ETV Bharat / state

ఉద్యానవనంగా మార్కాపురం జిల్లా - జులై 1కి వెలిగొండ నుంచి నీరు విడుదల: సీఎం చంద్రబాబు

మార్కాపురం జిల్లా దోర్నాల గంటావానిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన - వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం - రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనుల పరిశీలన

CM Chandrababu Laid Foundation Stone for Veligonda Canal Works
CM Chandrababu Laid Foundation Stone for Veligonda Canal Works (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 7:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Laid Foundation Stone for Veligonda Canal Works : ఈ ఏడాది జులై 1 నాటికి వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్‌ 15 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను నిర్దేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఎం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పడ్డాక తొలిసారి జిల్లాలో పర్యటించారు. దోర్నాలలోని గంటవానిపల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీజర్ కాలువ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. వెలిగొండ పూర్తైతే భూగర్భజలాలు పెరిగి, బోర్లు, చెరువులకు నీళ్లు వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు, ఫీడర్ కాలువ పనులు వేగంగా సాగుతున్నాయని హర్షం వెలిబుచ్చారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మీరే ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారంటూ సీఎంను ఉద్దేశించి రైతులు వ్యాఖ్యానించారు. రూ.2,500 కోట్ల విలువైన పనులు మిగిలి ఉన్నా పూర్తి చేయకుండానే గత పాలకులు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు నాటకాలాడారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఉద్యానవనంగా మార్కాపురం జిల్లా - జులై 1కి వెలిగొండ నుంచి నీరు విడుదల: సీఎం చంద్రబాబు (ETV)

ఫీడర్ కాలువ లైనింగ్ పనుల్ని పరిశీలించిన సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 11,580 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా ఫీడర్ కాలువ పనులు చేపట్టామని అధికారులు వివరించారు. నల్లమలసాగర్ ప్రాంతంలో మూడు గ్యాప్స్‌ ఫిల్ చేయడం ద్వారా రిజర్వాయర్ ఏర్పడిందని ఇందులో 53.83 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఫ్లడ్ సీజన్ ప్రారంభమయ్యేనాటికి ఫీడర్ కాలువ సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.

సొరంగాలలో జరుగుతున్న పనులపై ఆరా : ఈ సందర్భంగా స్థానిక చెరువులు నింపేందుకు స్ట్రక్చర్లు పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వెలిగొండ టన్నెళ్లు పూర్తయ్యాక పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలూ తీసుకోవాలన్నారు. అనంతరం నల్లమలసాగర్‌ ఫీడర్ కెనాల్‌ను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం తిలకించారు. జులై 1 నాటికి వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వబోతున్నామని అధికారులకు స్పష్టం చేసిన సీఎం ఆ దిశగా పనులు వేగంగా పూర్తిచేయాలని నిర్దేశించారు. సొరంగాలలో జరుగుతున్న పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు పురోగతిపై ఆరాతీశారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

వచ్చే ఎన్నికల్లో నూరుశాతం స్ట్రైక్‌రేట్ : అనంతరం మార్కాపురం ప్రజా వేదిక సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, మార్కాపురం జిల్లాను ఉద్యానవనంగా తయారుచేస్తామని తెలిపారు. ఈ ఏడాది వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు మొత్తం రూ.9 వేల 81 కోట్లు కావాలన్నారు. ఇప్పటివరకు తాము రూ.5 వేల 455 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వెలిగొండను 2 దశల్లో పూర్తి చేయాలని సీఎం నిర్ణయించామన్నారు. వెలిగొండ పూర్తి అయితే మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు ఎంతో లాభం కలుగుతుందన్నారు. ఉదయగిరి, బద్వేలుకు కూడా నీళ్లు వెళ్తాయన్నారు. నల్లమలసాగర్‌కు గోదావరి నీరు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

"మార్కాపురం జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే అందరూ సహకరించాలని అప్పుడు కోరా. రాష్ట్రానికి మేలు చేసేందుకే పవన్‌ కల్యాణ్‌, నేను కలిశాం. అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు మనదే హవా. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురం జిల్లాల్లో నూరుశాతం స్ట్రైక్‌రేట్ కావాలి. మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నా. మదనపల్లెకు కూడా న్యాయం చేస్తానని చెప్పా, చేశా. పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం జిల్లా ఇస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నా. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఇచ్చాం." అని చంద్రబాబు తెలిపారు.

" 3 వరాలు ఇచ్చేందుకు మార్కాపురం వచ్చా. 1995లోనే మార్కాపురం ప్రజల కష్టాలు చూశా. ఇక్కడి రైతులు సాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు వల్ల మార్కాపురం జిల్లాకు అనేక లాభాలు. వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల జీవితాలు బాగుపడతాయి. 2014-19 మధ్య వెలిగొండ పనులను పరుగులు పెట్టించాం. 2019-24 మధ్య వెలిగొండ పనులు మూలన పడ్డాయి. వెలిగొండ వల్ల 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు ఎంతో లాభం. ఇక్కణ్నుంచి ఉదయగిరి, బద్వేలుకు కూడా నీరు వెళ్తాయి. వెలిగొండ పనులు పూర్తయ్యాయని అప్పటి సీఎం ప్రారంభించారు. 2020లోనే వెలిగొండ పూర్తవుతుందని చెప్పి మిమ్మల్ని మోసం చేశారు." - సీఎం చంద్రబాబు

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం - నిర్లక్ష్యం వహించొద్దు: సీఎం చంద్రబాబు

గ్రామీణ డాక్‌ సేవక్‌ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు - సూపర్‌సిక్స్‌ అమల్లో వారి సేవలు గొప్పవి: చంద్రబాబు