ETV Bharat / state

మరో 11 ప్రాజెక్టులకు SIPB ఆమోదం - రూ.9076 కోట్ల పెట్టుబడులు, 10 వేల ఉద్యోగాలు

సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం - పరిశ్రమలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖల ప్రాజెక్టులపై చర్చ - రూ.9,076 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 11 ప్రాజెక్టులపై చర్చ

CM Chandrababu Key Decisions On 19th SIPB Meeting
CM Chandrababu Key Decisions On 19th SIPB Meeting (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 7, 2026 at 4:36 PM IST

5 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Key Decisions On 19th SIPB Meeting : వ్యవసాయ రంగాన్ని పారిశ్రామికీకరణతో అనుసంధానిస్తూ, ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 19వ SIPB సమావేశంలోన్ 11 భారీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపటంతో పాటు, రూ.9076 కోట్ల రూపాయల పెట్టుబడుల ఆమోదంతో, పారిశ్రామిక ప్రగతికి సరికొత్త బాటలు వేశారు. వీటి ద్వారా 10531 ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టనున్నాయి.

భవిష్యత్తులో ఇథనాల్‌కు పెరగనున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకునేలా సరికొత్త ఇథనాల్ బ్లెండింగ్ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలాని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ఇందులో భాగంగా భవిష్యత్‌లో పెరిగే ఇథనాల్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ 40 శాతానికి పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోలు, డీజిల్‌లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందన్నారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్దేశించారు.

19వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు:

  • డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ సంస్థ నెల్లూరు జిల్లాలో 4 స్టార్ హోటల్ - రూ.139.92 కోట్ల పెట్టుబడి, 180 మందికి ఉపాధి.
  • మాధవి లీజర్ అండ్ స్టేస్ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్సార్ కడప జిల్లాలో 3 స్టార్ హోటల్ - రూ.52.10 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉపాధి.
  • శ్రీనివాసం అమ్యూజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్సార్ కడప జిల్లాలో సమగ్ర అమ్యూజ్‌మెంట్ పార్క్ - రూ.68.69 కోట్ల పెట్టుబడి, 690 మందికి ఉపాధి.
  • వజ్ర హాస్పిటాలిటీ ఎల్ఎల్‌పీ విజయవాడలో హోటల్, బ్యాంక్వెట్, ఎగ్జిబిషన్ సెంటర్ - రూ.62.40 కోట్ల పెట్టుబడి, 450 మందికి ఉపాధి.
  • నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ (NILP) తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నఎట్టిపాకంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ - రూ.255 కోట్ల పెట్టుబడి, 400 మందికి పైగా ఉపాధి.
  • అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లా పరవాడలో సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్ - రూ.1,600 కోట్ల పెట్టుబడి, 750 మందికి ఉపాధి.
  • బెర్రీ అలాయ్స్ లిమిటెడ్ బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఇంటిగ్రేటెడ్ మాంగనీస్ సిన్టర్, డీఆర్ఐ, కార్బన్ పేస్ట్ ప్లాంట్ - రూ.1,200 కోట్ల పెట్టుబడి, 831 మందికి ఉపాధి.
  • జియో మైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో స్వర్ణగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ - రూ.689 కోట్ల పెట్టుబడి, 1,750 మందికి ఉపాధి.
  • ఈకో బాక్స్ ఇండస్ట్రియల్స్ అసెట్ IV ప్రైవేట్ లిమిటెడ్ (గూగుల్ వేర్ హౌస్ పార్టనర్స్) విశాఖపట్నంలో లాజిస్టిక్స్, లైట్ ఇండస్ట్రియల్ పార్క్ - రూ.1,008 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉపాధి.
  • అదానీ ఫౌండేషన్ విశాఖపట్నం జిల్లా కపులుప్పాడలో ప్రాజెక్టు - రూ.2,200 కోట్ల పెట్టుబడి.
  • మోండెలీజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ - రూ.1,801 కోట్ల పెట్టుబడి, 80 మందికి ఉపాధి.

టూరిస్ట్ స్పాట్‌ల దగ్గర ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు : పర్యాటకరంగంలో అపార అవకాశాలు ఉన్నాయన్న సీఎం, తిమ్మమ్మ మర్రిమాను సహా రాష్ట్రవ్యాప్తంగా 100 టూరిస్ట్ స్పాట్‌ల దగ్గర ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువు, లంబసింగి లాంటి ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. లంబసింగి, అరకు సమీపంలో రిసార్ట్ ఏర్పాటుకు జిందాల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేస్తోందన్నారు. ఏటికొప్పాక, కొండపల్లి , ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ, పొందూరు కళారూపాల్ని కూడా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలిలన్నారు.

నేచర్, వాటర్, అమ్యూజ్మెంట్ పార్కులను అనుసంధానించాలన్న ముఖ్యమంత్రి, సూర్యలంక మాస్టర్ ప్లాన్ త్వరితగతిన రూపొందించాలని ఆదేశించారు. కుప్పంలో కంగుంది కోట, చిత్తూరు జిల్లాలో ఎలిఫెంట్ సఫారీ వంటివి అభివృద్ధి చేయాలిలన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగం నుంచి జీఎస్‌డీపీకి వాటా పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవసరమైన హోటల్ గదులు పెద్దఎత్తున వస్తున్నాయని సీఎం అన్నారు. 2024లో 4,390 హోటల్ రూములు ఉంటే ఈ రెండేళ్లలో 9,364 హోటల్ రూముల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. దీంతో రాష్ట్రంలో 13,753 హోటల్ రూములు అందుబాటులోకి వస్తుండగా, దీనికి కృషి చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.

సోలార్ సెల్స్‌లో ఏపీ అగ్రగామిగా : రెన్యువబుల్ ఎనర్జీ విస్తృతం కావడంతో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సోలార్ సెల్స్‌లో ఏపీ అగ్రగామిగా నిలవాలన్నారు. ఇంకా ఏర్పాటు చేయాల్సిన 38 ఎంస్ఎంఈ పార్కులను త్వరితగతిన ప్రారంభించాలని నిర్దేశించారు. రైల్వే టెర్మినల్స్‌కు ఎంస్ఎంఈ పార్కులను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. లాజిస్టిక్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో యువతకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా చూడాలన్నారు. బీపీసీఎల్, ఆమ్కా ప్రాజెక్టులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా సంప్రదింపులు జరపాలన్నారు.

అనకాపల్లి జిల్లా పరవాడలో 'అక్షత్ గ్రీన్‌టెక్' సంస్థ 1,600 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. కపులుప్పాడలో 'అదానీ ఫౌండేషన్' ఆధ్వర్యంలో 2,200 కోట్ల రూపాయల మెగా ప్రాజెక్టుకు SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు గూగుల్ వేర్‌హౌస్ పార్టనర్స్ అయిన 'ఈకో బాక్స్ ఇండస్ట్రియల్స్' సంస్థ విశాఖలో 1,008 కోట్ల రూపాయలతో లాజిస్టిక్స్, లైట్ ఇండస్ట్రియల్ పార్క్‌ను నిర్మించనుంది. ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారానే ఐదు వేల మందికి ఉపాధి దక్కనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో 'జియో మైసూర్ ఇండియా' సంస్థ 689 కోట్ల రూపాయలతో 'స్వర్ణగిరి గోల్డ్ మైనింగ్' ప్రాజెక్టును చేపట్టబోతోంది. కడప జిల్లాలో మాధవి లీజర్ సంస్థ 3 స్టార్ హోటల్, శ్రీనివాసం అమ్యూజ్‌మెంట్ సంస్థ సమగ్ర అమ్యూజ్‌మెంట్ పార్కులను నిర్మించనుండటంతో ఇక్కడ స్థానిక యువతకు భారీగా ఉపాధి లభిస్తుంది.

రెండేళ్లలో ఇప్పటివరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా 339 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటితో రాష్ట్రానికి మొత్తం రూ.11,86,271 కోట్ల విలువైన పెట్టుబడులు రానుండగా. 10,41,821 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా.

మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు చేస్తాం : సీఎం చంద్రబాబు

గిరిజన ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు - మారుమూల ప్రాంతాల్లో సెల్‌ టవర్లు: సీఎం చంద్రబాబు