నియోజకవర్గాల్లో సర్వే - 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి: సీఎం చంద్రబాబు
సమీక్షలతో పనితీరు మెరుగుపడింది - జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 7, 2025 at 6:53 AM IST
CM Chandrababu Key Comments on TDP MLAs: 'ప్రతి నియోజకవర్గం నుంచి నాలుగైదు మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నా. దాని ప్రకారం ఇంకా 37 మంది ఎమ్మెల్యేల పని తీరు మెరుగుపడాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతర సమీక్షలు, ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాల ఫలితంగా ఎమ్మెల్యేలు, నేతల పనితీరు మెరుగైందని వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో ప్రతి శుక్రవారం పార్టీ నాయకులతో సమావేశాలు, ప్రజల నుంచి వినతుల స్వీకరణ, పింఛన్ పంపిణీ తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెరిగిందని పేర్కొన్నారు. నేతలకు కేడర్‌తో వచ్చిన అంతరం తగ్గిందని వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో శనివారం చంద్రబాబు సమావేశమయ్యారు. అంతకుముందు ఉండవల్లి నివాసంలో పార్టీ కీలక బృందంతోనూ రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలిచ్చారు.
వారం రోజుల్లో పూర్తి చేయండి: పార్టీ లోక్‌సభ నియోజకవర్గ కమిటీ నియామకంలో జరుగుతున్న జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే శనివారం నాటికల్లా సభ్యుల పేర్లు నిర్ణయించాలని ఆదేశించారు. ‘పార్టీ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యుల ఎంపిక కోసం ముగ్గురు నేతలతో కమిటీలు వేశాం. వాళ్లు ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి మూడేసి పేర్లు సిఫార్సు చేశారు. ఇప్పటికే అధ్యక్ష, కార్యదర్శుల పేర్లు నిర్ణయించాం. 32 మంది సభ్యుల పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి. త్రిసభ్య కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించండి. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ వారం రోజుల్లో లోక్‌సభ నియోజకవర్గ కమిటీ సభ్యుల తుది జాబితా పూర్తి చేయండి’ అని అధినేత దిశానిర్దేశం చేశారు.
అప్పుడే భవిష్యత్ నాయకత్వం: ‘పార్టీ పట్ల అంకితభావం, సిద్ధాంతాలపై అవగాహన, విద్యార్హతలు, వయసు, సీనియర్ల అభిప్రాయాలు, బ్యాక్ ఆఫీస్ డేటా వీటన్నింటినీ పరిశీలించాకే రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలి. ఆరెస్సెస్ వాళ్లు సిద్ధాంతానికి కట్టుబడి ఏ పదవులూ ఆశించకుండా బీజేపీ కోసం పని చేస్తున్నారు. మనం కూడా అలాంటి కేడర్‌ను తయారు చేయాలి. పార్టీ సిద్ధాంతం ఆధారంగానే నాయకులు పని చేయాలి. అప్పుడే భవిష్యత్తు నాయకత్వం తయారవుతుంది’ అని చంద్రబాబు సూచించారు. బీసీల్లో నిమ్నవర్గాల నుంచి కొత్తతరం నాయకులను ప్రోత్సహించాలన్నారు. ‘రజక, వడ్డెర, బోయ వంటి బీసీ వర్గాలు జనాభాపరంగా ఎక్కువగా ఉన్నాయి. వారి నుంచి కొత్త నాయకత్వం రావడం లేదు. ఆయా వర్గాల నుంచి నాయకుల్ని తయారు చేయాలి’ అని అధినేత సూచించారు.
అలాంటివారిని ప్రోత్సహించాలి: విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికి తీయడానికి స్కూల్ ఇన్నోవేటివ్ పార్టనర్‌షిప్ సమిట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో ఇది చేద్దాం. పాఠశాలల్లో ‘క్లికర్’ ఆధారిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో రియల్ టైం నాలెడ్జ్‌ను గుర్తించాలి. ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసేలా, నైపుణ్యాలు మెరుగుపరిచేలా వారిని తయారుచేయాలి. చాలామంది విద్యార్థులకు ఎన్నో వినూత్న ఆలోచనలుంటాయి. వీరు స్కూల్ ఇన్నోవేటర్లు. వారి ఆలోచనలకు రూపమివ్వాలి. ఓ పాఠశాల విద్యార్థి గుండెపోటు ముప్పును గుర్తించడానికి ఓ యాప్‌ను కనిపెట్టాడు. అలాంటి వారి ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలి’’ అని తెలిపారు. విద్యార్థులకు 4 శాతం వడ్డీకి రుణాలిచ్చి విదేశాల్లో చదువుకునేందుకు పంపాలని, వారికి 40 ఏళ్లు వచ్చేవరకూ ఆ రుణం తీర్చే వెసులుబాటు ఇవ్వాలని సూచించారు.
అవన్నీ తప్పుడు ఆరోపణలు: గత వైకాపా ప్రభుత్వం రాజకీయ ప్రేరేపితంగా, ఎలాంటి సాక్ష్యాలూ, ఆధారాలూ లేకపోయినా తనపై బనాయించిన అక్రమ కేసులను మాత్రమే న్యాయస్థానాలు కొట్టి వేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ‘ఓ మాజీ సీఎంను అరెస్టు చేయాలంటే చట్టపరంగా కొన్ని విధివిధానాలు పాటించాలి. అప్పట్లో ఇవేమీ పాటించలేదు. ఒక్క కేసులోనూ ఆధారం లేదు. తప్పుడు కేసులు కాబట్టే కోర్టులు వాటిని తీసేస్తున్నాయి. అంతేగానీ నేను సీఎంగా ఉన్నందువల్ల కాదు. అలాగైతే జగన్ కూడా తన మీద కేసులు తొలగించుకునే వారుగా?’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు.
వాటిపై స్పందించాల్సిన అవసరం లేదు: ‘జగన్ నెలకోసారి రాష్ట్రానికి వచ్చి, మూడు గంటల పాటు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వాడూవీడూ అంటున్నారు. అలాంటి వ్యక్తికి విలువ లేదు. వాటికి ఎక్కువగా స్పందించాల్సిన అవసరమూ లేదు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి పరాకామణిలో చోరీ కేసు అంటే జగన్‌కు చులకనగా ఉందా అని ఆగ్రహించారు.
కఠిన చర్యలకు వెనకాడబోను - తిరువూరు విభేదాలపై సీఎం చంద్రబాబు సీరియస్
అటవీశాఖ ఉద్యోగులతో శ్రీశైలం ఎమ్మెల్యే ఘర్షణ - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తీరుపై సీఎం సీరియస్

