తుంగభద్ర నది మూడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది: సీఎం చంద్రబాబు
కర్ణాటక హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం - కొత్త గేట్లు ప్రారంభించిన కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు - నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్ల అమరిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 25, 2026 at 4:44 PM IST
CM Chandrababu Inauguration New Gates Of Tungabhadra Project : బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన తుంగభద్ర పునరుజ్జీవం సంతరించుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన జలాశయం గేట్లను కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్రం హోస్పేటలో జరిగిన ఈ కార్యక్రమం సందడి వాతావరణంలో సాగింది. అంతకుముందు ముగ్గురు సీఎంలతో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ భేటీ అయ్యి మూడు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చించారు.
మూడు రాష్ట్రాలకు మేలు చేసే తుంగభద్ర జలాశయం కొత్త గేట్లతో కళకళలాడుతోంది. కర్ణాటకలోని హోస్పేటలో నూతన గేట్ల ప్రారంభోత్సవం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. కేంద్రమంత్రితో పాటు మూడు రాష్ట్రాల సీఎంలు, నీటిపారుదల శాఖా మంత్రులు, అధికారులు తరలివచ్చారు. ప్రాజెక్టు 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, 8వ గేటును కర్ణాటక సీఎం డీకే శివకుమార్, 19వ గేటును ఏపీ సీఎం చంద్రబాబు, ప్రాజెక్టు 20వ గేటును తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ముగ్గురు సీఎంలు కలవడం ఓ చరిత్ర : ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘తుంగభద్ర మూడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. ఆరు నెలల్లో 33 గేట్లు అమర్చిన అందరినీ అభినందిస్తున్నా. కేంద్ర జలవనరులశాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ముగ్గురు సీఎంలు కలవడం ఓ చరిత్ర. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తుంగభద్ర తాగు, సాగు నీరు ఇచ్చింది. ఈ నది లేకపోతే చాలా సమస్యలు వచ్చేవి.
జలవనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఉంది. గంగ, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తుంది. సీఆర్ పాటిల్‌కు నదులు అనుసంధానం చేసిన అనుభవం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి-కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలి’’ అని చంద్రబాబు అన్నారు.
"తుంగా పానం - గంగా స్నానం ప్రసిద్ధ సామెత. తాగడానికి స్వచ్ఛంగా, తీయగా తుంగా నది ఉంటుంది. బహు పుణ్యానికి గంగా నది గొప్పది. తుంగభద్ర నది, మూడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు వాటిని పరిరక్షించుకోవాలి. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుంది. ఆరు నెలల్లో 33 గేట్లు అమర్చిన అందరినీ అభినందిస్తున్నా. సీఆర్ పాటిల్ నేతృత్వంలో ముగ్గురు సీఎంలు కలవడం చరిత్ర. మూడు రాష్ట్రాలకు నాందిగా మారుతుంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తుంగభద్ర సాగు, తాగునీరు ఇచ్చింది. తుంగభద్ర లేకపోతే చాలా ప్రమాదం వచ్చేది. జలవనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది." - సీఎం చంద్రబాబు
నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం : తుంగభద్ర నది ఒడ్డున బళ్లారి వేదికగా జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. "తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుంది. 3 తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోంది. బళ్లారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తుంది. తక్కువ మాట్లాడటం, అత్యంత వేగంగా పనిచేయడం సీఆర్ పాటిల్ ప్రత్యేకత. అలాంటి వ్యక్తి కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రిగా ఉండటంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా" అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఆధునిక సాంకేతికతతో ప్రస్తుత డ్యామ్‌లు: ప్రస్తుత డ్యామ్‌లు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. 73 ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని చెప్పారు. ‘‘ఈ ప్రాజెక్టులో ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లూ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. నర్మద, సరోవర్ జలాలు మిళితం చేసి నదుల అనుసంధానం చేపట్టాం. ఈ ప్రక్రియతో గుజరాత్‌లో నదీజలాలు సమృద్ధిగా ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో 3 నదులు అనుసంధానం చేపట్టాం’’ అని సీఆర్ పాటిల్ అన్నారు.
ప్రాజెక్టు చరిత్ర : జీవనాడిగా పేరొందిన తుంగభద్ర ప్రాజెక్టు నిర్మించి 73 ఏళ్లు పూర్తయ్యాయి 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్ వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్యనాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్ వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్తగేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ-కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి.
కొత్తగేట్ల అమరికతో తుంగభద్ర జలాశయానికి సరికొత్త రూపు
70 ఏళ్ల నాటి చరిత్ర - ఆగస్టులో గేటు కొట్టుకుపోవడంతో సమస్య, తుంగభద్రలో 33 కొత్త గేట్ల నిర్మాణం

