ఒకప్పుడు కేజీఎఫ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ - ఇప్పుడు జొన్నగిరి: సీఎం చంద్రబాబు
రాయలసీమను రత్నాలసీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభం - ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందన్న సీఎం - కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 24, 2026 at 3:59 PM IST
CM Chandrababu Inaugurated Gold Mine Project in AP : రాయలసీమను రత్నాలసీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు కేజీఎఫ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జొన్నగిరి గురించి చర్చ జరుగుతుందన్నారు. చమురు తర్వాత దిగుమతికి అధికంగా విదేశీ మారక ద్రవ్యం వాడేది బంగారానికే అన్నారు. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఇప్పటికి 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో వెయ్యి కిలోలకు చేరుతుందన్నారు. ఇప్పటికే 800 ఉద్యోగాలు వచ్చాయి, త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో 5 వేల మందికి ఈ గోల్డ్ మైన్స్‌లో ఉపాధి దొరుకుతుందని తెలిపారు. స్వర్ణగిరి రాష్ట్రానికి ఆదర్శంగా తయారవుతుందని స్పష్టం చేశారు.
జొన్నగిరిని సువర్ణగిరిగా మార్చుకుందామా? : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం, ప్లాంటు రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "గోల్డ్ మైనింగ్‌తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. "రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాన్ని గతంలో సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి నాలుగో రాజధాని ఇది. జొన్నగిరిని సువర్ణగిరిగా మార్చుకుందామా? వందల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండింది. అశోకుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చాటి చెబుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి సీమను కాపాడాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన నిర్ణయంతో రాయలసీమ ప్రాంతానికి ప్రాణం పోశాం" అని చంద్రబాబు అన్నారు.
"జొన్నగిరి రాష్ట్రానికి ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుంది. ఇక్కడ నగల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారింది. రాయలసీమకు ఇన్ని పరిశ్రమలు వస్తాయని అనుకున్నారా? దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీ కర్నూలులో వస్తోంది. వీలైనంత త్వరగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. 2028 నాటికి రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తాం." - సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పండని పంటలు, దొరకని ఖనిజాలు లేవు : ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ఈ ప్రాంత అభివృద్దికి ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుందనీ సీఎం తెలిపారు. బంగారం ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఓ జ్యుయలరీ పార్కు కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు. ఈ పరిశ్రమకు అనుమతులు, భద్రత కూడా కల్పిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అంటే రత్నగర్భ కూడా, మన రాష్ట్రంలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవనీ గుర్తు చేశారు.
కేవలం ఎన్డీఏ ప్రభుత్వ బ్రాండ్‌తోనే పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు. సీమలో ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్టీల్, సిమెంట్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్న చంద్రబాబు కర్నూలు జిల్లాలో దేశంలో అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నాం, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను తీసుకు వస్తామన్నారు. 2028 ఉత్పత్తి లక్ష్యంగా కడప జిల్లాలో జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
వేంకటేశ్వరస్వామికి అపచారం జరిగితే శిక్షించాలా? లేదా? : " 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంస పాలన నడిచింది. వేంకటేశ్వరస్వామికి అపచారం జరిగితే శిక్షించాలా? లేదా? స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లి దండాలు పెడుతున్నారు. దేవుడిని నమ్మే ఏ వ్యక్తి కూడా వాళ్లను క్షమించడు. ప్రజలకు ఏవిధంగా మంచి చేయాలనేదే నా ఆలోచన. గొడ్డలి పార్టీ విషాన్ని చిమ్ముతోంది.
నేరాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సమర్థులు. సాయికృష్ణ ఘటనకు కూడా కులం రంగు పులిమారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై నోరు పారేసుకుంటున్నారు. అలాంటి వారి నోరు మూయించే శక్తి మాకుంది. మెగా డీఎస్సీ పూర్తయిన ఏడాది తర్వాత పేపర్ లీకైందని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై చర్చకు రమ్మని మంత్రి లోకేశ్ సవాల్ విసిరితే రాలేదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా దాదాపు 11వేల మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాం’’ అని చంద్రబాబు అన్నారు.
2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా : అంతకుముందు హెలికాప్టర్లో 12 గంటలకు జొన్నగిరికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు కంపెనీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జియో మైసూర్ సంస్థ ఎండి ప్రభాకరన్ గోల్డ్ ప్లాంట్లో బంగారం శుద్ధి చేసే ప్రాసెసింగ్ యూనిట్‌ను చంద్రబాబుకు తెలియజేశారు. ఉత్పత్తి అయిన బంగారం బిస్కెట్లు, చిన్నచిన్న బంగారు వస్తువులు చంద్రబాబుకు చూపించారు. అనంతరం సభ వేదిక చేరుకున్న సీఎం చంద్రబాబు, ఉత్పత్తి అయిన బంగారం బిస్కెట్లను ఐదు ప్రముఖ జ్యువెలరీ వ్యాపారస్తులకు సీఎం చేతుల మీదుగా అందజేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని దానికి జొన్నగిరి నుంచి స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
తొలి ఏడాది 600 కిలోలు - మరుసటి ఏడాది 1500 కిలోల బంగారం - 'జొన్నగిరి స్వర్ణగిరి'
రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి తొలి అడుగు - జొన్నగిరిలో పరిశ్రమను ప్రారంభించనున్న సీఎం

