రూ.19,391 కోట్ల పెట్టుబడులు - 11,753 ఉద్యోగాల ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
14వ ఎస్‌ఐపీబీ సమావేశంలో భారీగా పెట్టుబడులకు ఆమోదం -14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా- 11వేల753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం- 2026లోనూ ఉత్సాహంతో పని చేయాలని దిశానిర్దేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 6:22 PM IST
|Updated : January 6, 2026 at 7:00 PM IST
CM Chandrababu in 14th SIPB Meeting : పెట్టుబడులకు సంబంధించి 2025వ సంవత్సరంలో టీమ్ వర్క్‌తో ఎలాంటి ఫలితాలు సాధించామో 2026లోను అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు, అధికారులకు సూచించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 14వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో 14 సంస్థలకు చెందిన మరో రూ. 19,391 కోట్ల పెట్టుబడులు, 11,753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనాలకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు రూ. 8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, 835,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
పెట్టుబడుల వెల్లువ : బాపట్ల జిల్లాలో ఆర్ణ కోస్టల్ రిసార్ట్స్ రూ. 187.58 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 250 ఉద్యోగాలు లభించనున్నాయి. సత్యసాయి జిల్లాలో ఇస్కాన్ రూ. 425.20 కోట్ల పెట్టుబడుల ద్వారా 1035 ఉద్యోగాలు, అనంత జిల్లాలో సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్ రూ. 200.82 కోట్ల పెట్టుబడుల ద్వారా 245 ఉద్యోగాలు లభించనున్నాయి. నెల్లూరు జిల్లాలో టాటా పవర్ రూ. 6675 కోట్ల పెట్టుబడుల ద్వారా 1000 ఉద్యోగాలు రానున్నాయి. నంద్యాల జిల్లాలో రామ్ కో సిమెంట్స్ రూ. 1500 కోట్ల పెట్టుబడుల ద్వారా 300 ఉద్యోగాలు లభించనున్నాయి. కడప జిల్లా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ. 5571 కోట్ల పెట్టుబడుల ద్వారా 5000 ఉద్యోగాలు రానున్నాయి. విజయనగరం జిల్లాలో రాధికా వెజిటబుల్స్ ఆయిల్స్ రూ. 234 కోట్ల పెట్టుబడుల ద్వారా 165 ఉద్యోగాలు, అనకాపల్లి జిల్లాలో రిలయెన్స్ కన్స్యూమర్స్ రూ. 30 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
క్లీన్ బీచ్ ఫ్రంట్ : సూర్యలంక అత్యంత సురక్షితమైన ప్రాంతమన్న సీఎం, బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 15 కిలోమీటర్ల మేర కాలుష్య రహిత ప్రాంతంగా క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలన్నారు. సూర్యలంకతో పాటు సూళ్లూరుపేట వద్ద ఉన్న ద్వీపాలను బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చునని సూచించారు. మాల్దీవ్స్ తరహాలో ఐ ల్యాండ్ టూరిజం తయారు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. రాబోయే 15 ఏళ్లలో టూరిజం కార్పోరేషన్‌కు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. పాపికొండలు-పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలన్నారు.
ఆవకాయ్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ టూ స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్లను ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. విశాఖ, అమరావతికి హోటళ్లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు మాన్సాస్ ట్రస్ట్ తన భూములను విరాళంగా ఇచ్చేందుకు సిద్దంగా ఉందని, ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం తెలిపారు.
టీమ్ వర్క్‌తో మంచి ఫలితాలు : టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. వీటి నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేయటం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. విద్యుత్ రంగంలో గొప్పగా పని చేశామని, రూ. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్లు గుర్తు చేశారు. రూ. 4,500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.70 కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో అధికారులు చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయని తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ ఛాంపియన్ కావాలి : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తిరుపతి ప్రాంతానికి రావాల్సి ఉందన్న ముఖ్యమంత్రి, అప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. వివిధ రకాల వెరైటీలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లకు వెళ్లాలని తెలిపారు. వాల్యూ అడిషన్ జరిగితేనే రైతులకు గరిష్ట ప్రయోజనం దక్కుతుందని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ ఛాంపియన్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, భవిష్యత్తులో ఉద్యాన ఉత్పత్తులకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కావాలన్నారు.
పాలసీల అమలు విషయంలో ఎలాంటి డీవియేషన్ ఉండేందుకు వీల్లేదని, అందరికీ సమానంగా అవకాశాలు అందాలన్నారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ సమీపంలో మరింత భూమిని పరిశ్రమల కోసం సిద్ధం చేయాలని సూచించారు. ఎంప్లాయిమెంట్ పోర్టల్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆదేశించారు. స్పేస్ సిటీ కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరం అవుతాయన్నారు. మాకవరపాలెం వద్ద ఫుడ్ పార్క్ సహా అల్యూమినియం డౌన్ స్ట్రీమ్ పరిశ్రమలు వచ్చేలా చూడాలని దీని కోసం ఇండస్ట్రియల్ పార్క్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వివరించారు. ఎస్ఐపీబీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏపీ ఐటీ ఇన్ఫ్రా పోర్టల్‌ను ప్రారంభించారు.
సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది : దావోస్ సదస్సుకు వెళ్లి ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగామని, విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగామని వ్యాఖ్యానించారు. గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి మంత్రి లోకేశ్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందన్న సీఎం, ఆ కిక్ కోసం అందరూ పని చేయాలన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో మంచి ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలని సూచించారు. సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సహా పలువురు హాజరయ్యారు.
13వ ఎస్‌ఐపీబీ సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 56 వేల మందికి ఉపాధి
ఎస్ఐబీపీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 85,870 మందికి ఉద్యోగాలు

