జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష - 31న తుది నోటిఫికేషన్!
రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లెలో కలిపే ప్రతిపాదనలపై సమీక్ష - తాజా ప్రతిపాదనలతో 29 నుంచి 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా కసరత్తు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 4:31 PM IST
|Updated : December 27, 2025 at 7:47 PM IST
CM Chandrababu Review Meeting On Reorganization Of Districts in AP : రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో కలిపి, రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలతో 29కి పెరాగాల్సి ఉన్న జిల్లా సంఖ్య తాజా ప్రతిపాదనలతో 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా కసరత్తు జరుగుతోంది.
దొనకొండ, కురిచేడును మార్కాపురం జిల్లాలో పొదిలిని ఒంగోలు జిల్లాలో కలపటంతో పాటు గూడూరును నెల్లూరు జిల్లాలో, రైల్వే కోడూర తిరుపతిలో కలిపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆదోనిని రెండు మండలాలుగా విభజించటంతో పాటు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మార్పులపై తుదినిర్ణయం తీసుకుని 31న తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. జనగణన సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపానలను ప్రస్తుతానికి వాయిదా వేశారు.
జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పు చేర్పులతో ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు అనగాని, అనిత, నారాయణలతో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించారు.
29 జిల్లాల స్థానంలో 28 జిల్లాలే! : ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తూ జిల్లాల పునర్విభజనలో మార్పులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైనా కీలక చర్చ జరిగింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే జరిగితే గతంలో ఏర్పాటు కావాల్సి ఉన్న 29 జిల్లాల స్థానంలో 28 జిల్లాలే ఏర్పాటు కానున్నాయి. మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తిరిగి అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలా లేక వేరేదైనానా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రేపు మేరకు మార్పు చేర్పులపై నివేదిక : విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగా యధావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం రేపు(ఆదివారం) మరోమారు సమవేశమై సీఎం ఆదేశాల మేరకు మార్పు చేర్పులపై నివేదిక రూపొందించి 29న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదనలు తీసుకురానుంది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపానలపై చర్చను సాంకేతిక ఇబ్బందులతో వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
నోటిఫికేషన్ ప్రకారం ఆ జిల్లా యదాతథం : రంపచోడవరం జిల్లాను ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం యదాతథంగా కొనసాగించనున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు ఇతర ప్రాంతాల్లో మార్పులు పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మారనుంది. అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్‌కు మార్చనున్నారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌కు, అద్దంకి రెవెన్యూ డివిజన్‌లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పు చేశారు.
ఆ 5 మండలాలను ప్రకాశం జిల్లాకు : కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోకి మార్చటంతో పాటు ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. కందుకూరు డివిజన్‌లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చడంతో పాటు కందుకూరు డివిజన్‌లోని మిగిలిన రెండు మండలాలు అయిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్‌లోకి మార్పులు ప్రతిపాదించారు. పలమనేరు డివిజన్‌లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్‌కు, చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు మార్చనున్నారు.
సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర : చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌కు మారనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. కదిరి రెవెన్యూ డివిజన్‌లోని ఆమదగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయటంతో పాటు పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లో ఉన్న ఈ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. మార్పుచేర్పుల తర్వాత ఈ డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా సర్వే పూర్తైన తర్వాత గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ప్రదిపాదనలపై ప్రభుత్వం ముందుకెళ్లనుంది.
రాజధాని అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ- 4 జిల్లాల్లో గెజిట్
అమరావతి రైల్వేలైన్‌కు 'భూ' చిక్కులు - రైతుల పట్టు, సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ!

