20 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు - ఉద్యోగ సంఘాల హర్షం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగుల ఇళ్లల్లో పండుగ వాతావరణం - ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 8:19 PM IST
Employee Unions Rejoice : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలతో ఉద్యోగుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొందని 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఉద్యోగుల చిరకాల వాంఛలను తీరుస్తూ క్యాబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడంపై ఫోరం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. 20 ఏళ్ల తమ కలను నెరవేర్చడంలో కీలక భూమిక పోషించిన ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్‌కు ఈ సందర్భంగా ఘన సన్మానం చేశారు.
మానవతా దృక్పథంతో : 2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, కేవలం పరిపాలనాపరమైన జాప్యం వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన 11,000 మందికి పాత పెన్షన్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. తద్వారా 2003 డీఎస్సీకి చెందిన 8 వేల మంది ఉపాధ్యాయులకు, 2 వేల మంది పోలీసులకు, మరో వెయ్యి మంది ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులకు గొప్ప మేలు జరిగిందన్నారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించిందన్నారు. గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎనిమిది వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామంగా అభివర్ణించారు.
టేబుల్ ఐటమ్‌గా చేర్చి : ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు SC, ST, BC, మైనారిటీ వెల్ఫేర్, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం వారికి భరోసానిచ్చిందన్నారు. క్యాబినెట్ ఎజెండాలో ఇప్పటికే 87 అంశాలు ఉన్నప్పటికీ, ఉద్యోగుల విన్నపం మేరకు 88వ అంశంగా 'టేబుల్ ఐటమ్'గా చేర్చి కేవలం గంట వ్యవధిలోనే దీనికి ఆమోదం తెలపడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొన్నారు.
గత మూడేళ్లుగా పెండిగ్లో ఉన్న 8 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి చెందిన గురుకుల పాఠశాలలు, SC, ST మైనార్టీ పాఠశాలల ఉద్యోగులు, 9,10 షెడ్యూల్లో ఉన్న దాదాపు 40 వేల మంది ఉద్యోగులకి పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2004 కంటే ముందే సర్వీస్ పెన్షన్‌కు నోటీఫై అయ్యాం. కానీ కేవలం పరిపాలనా పరమైన జాప్యం వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన 11,000 మందికి పాత పెన్షన్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. మాకు మిగతా ఉద్యోగులతో పాటే పెన్షన్ ఇవ్వండి అని గత 20 సంవత్సరాలుగా అడుగుతున్నాం ఇన్ని రోజులకి టేబుల్ ఐటమ్‌గా క్యాబినెట్ అప్రూవల్ తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.- విద్యాసాగర్, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు గట్టిగా శ్రమిస్తోంది. చంద్రబాబు విజన్, పవన్ కల్యాణ్ ఆశయాలు కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యంగా ఈ ప్రయాణం సాగుతోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సాగుతున్న పాలన రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా నిలుస్తోంది.
ఆ ముగ్గురు ఎక్కడ? - సాయికృష్ణ కేసులో కీలకంగా మారిన ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, స్నేహితుడు

