"ఇంగితజ్ఞానం లేనివాళ్లు రాజకీయాలు చేస్తే ఏం మాట్లాడాలి?" - జగన్‌పై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటారా! - ఆయన బెంగళూరులో కూర్చుంటే అక్కడ, ఇడుపులపాయ వెళ్తే అక్కడ రాజధానా? - బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా ఇలా మాట్లాడతారా? - జగన్‌పై చంద్రబాబు ఫైర్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 7:29 AM IST
CM Chandrababu Fires On YS Jagan : "ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఆయన బెంగళూరులో కూర్చుంటే అక్కడ, ఇడుపులపాయ వెళ్తే అక్కడ రాజధానా? బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా ఇలా మాట్లాడతారా?. మొన్నటివరకు మూడు రాజధానుల పేరిట మూడుముక్కలాట ఆడారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా లేదని చెప్తే వినకపోవడంతో ప్రజలే బుద్ధి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని పేరు లేదంట. సీఎం ఎక్కడ కూర్చొంటే అదే రాజధాని అని ఆయన అంటుంటే నాకేం అర్థం కావట్లేదు. నది పక్కన వచ్చిందట. రాజమహేంద్రవరం, దిల్లీ, లండన్ వంటివి ఎక్కడున్నాయి? కనీస ఇంగితజ్ఞానం లేనివాళ్లు రాజకీయాలు చేస్తే ఏం మాట్లాడాలి?" అని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘పీపీపీ అంటే ఆయనకు అర్థం కావట్లేదు. మెడికల్ కళాశాలలు ఆ విధానంలో నిర్మిస్తామంటే వద్దని బెదిరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక భోగాపురం పూర్తి చేస్తే అప్పుడు విధ్వంసం చేసి, ఇప్పుడు ఆ క్రెడిట్ తనదని అంటున్నారు. పీపీపీలో మెడికల్ కళాశాలలు వద్దు. పీపీపీలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం మాత్రం ముద్దా?’ అని సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు.
ఇప్పుడు పెద్దవీరుడు బయలుదేరారు : శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదికలో సభలో పాల్గొని మాట్లాడారు. తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకోవడం తమ విధానం కాదని వెల్లడించారు. ఇప్పుడు పెద్దవీరుడు బయలుదేరాడని, నీళ్లు కావాలా? గొడవలు కావాలా? అంటే గొడవలే కావాలనుకునే రకం ఆయన (జగన్) అని అన్నారు. తనకు మాత్రం తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యమన్నారు. నదులను అనుసంధానం చేసుకుంటే ఏపీని మించిన రాష్ట్రం ఉండదని చెప్పారు. అవసరమైతే తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చన్నారు.
ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు : నరకాసురిడి పాలన మళ్లీ రాకూడదని మనం కోరుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరవే ఉండదని అలానే పోలవరం పూర్తయితే నీటి సమస్యే ఉండదని తెలిపారు. పోలవరం నుంచి విశాఖకు అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తామని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని వెల్లడించారు. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవని సూచించారు. పెద్దపెద్ద నగరాలన్నీ నదుల పక్కనే ఉన్నాయి. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఆఖరికి వైద్యకళాశాలలపైనా రాజకీయాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి టీవీ, పత్రికలో తప్పుడు ప్రచారం : గత ప్రభుత్వంలో తిరుమలలో నెయ్యిని కల్తీ చేశారని, దర్శనాలను అక్రమాలమయం చేశారని చంద్రబాబు ఆరోపించారు. తాము తిరుమలను పవిత్రంగా నిర్వహిస్తున్నామని, ఇది భరించలేక ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్లి పెట్టి సాక్షి టీవీ, పత్రికలో తప్పుడు ప్రచారం చేశారని హాలోగ్రామ్ ఆధారంగా దర్యాప్తు చేస్తే దొంగలు పట్టుబడ్డారని చెప్పారు. డాక్టర్ సుధాకర్‌ను చిత్రహింసలు పెట్టి రోడ్డుపై నిలబెట్టి పిచ్చోడని ముద్రవేసి చనిపోయేలా చేశారన్నారు. తాము ఆయన కుమారుడికి పదోన్నతి ఇచ్చి, కుటుంబానికి రూ.కోటి సాయం చేసి ఆదుకున్నామని తెలిపారు.
ఆ అదృష్టం నాకు దక్కింది : గత గోదావరి పుష్కరాల్లో అఖండ హారతి ప్రారంభించానని వచ్చే ఏడాది మూడోదఫా పుష్కరాలు నిర్వహించే అదృష్టం తనకు దక్కిందని సీఎం తెలిపారు. మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని గత ఎన్నికల్లో ఓడిపోకపోతే 2021లోనే పూర్తయ్యేదన్నారు.
భూకబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటాం: సీఎం చంద్రబాబు
ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు

