ఏరువాక పున్నమి - అన్నదాతకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
ఖరీఫ్ ప్రారంభానికి ముందు ఆనవాయితీగా వస్తున్న ఏరువాక పౌర్ణమి కార్యక్రమం - అన్నదాతలకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 29, 2026 at 1:26 PM IST
CM Chandrababu Dy CM Pawan Eruvaka Wishes: దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ సహా పలువురు మంత్రులు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమమిదని సీఎం అన్నారు. వ్యవసాయ రంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని కోరారు.
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానం అయ్యే కార్యక్రమం ఏరువాక. పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నాను. ప్రకృతిని పూజించే గడ్డపై పుట్టిన మనం ఆ… pic.twitter.com/BsnIitLNkL
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2026
ప్రకృతితో మనిషి అనుబంధం చాటి చెప్పే ఏరువాక: అన్నదాతలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేదే ఏరువాక పున్నమి అని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గుంటూరులో ఏరువాక కార్యక్రమం: ఐదేళ్లపాటు రాజధాని రైతులు, మహిళల్ని వేధించి బూతులు తిట్టి కాళ్లతో తన్నిన వారికి రాజధానిలో తిరిగే అర్హత ఉందా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతల అమరావతి పర్యటనపై అచ్చెన్న మండిపడ్డారు. గుంటూరులో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని అని పార్లమెంట్ లో చట్టం చేశారని గొడ్డలి పార్టీ మినహా అన్ని పార్టీలు అమరావతి రాజధానికి మద్దతిచ్చాయని తెలిపారు. అక్కడ వ్యతిరేకించి ఇప్పుడు అమరావతిలో ఎలా పర్యటిస్తారని నిలదీశారు. రైతుల ఓపిక, సహనానికి హద్దు ఉంటుందని స్పష్టం చేశారు.
పుట్టింటికి ఆడపడుచులు: ఏరువాక పున్నమి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, బంధాలకు కొత్త సంవత్సరం లాంటిది. రైతుల ఇళ్లలో పని చేసేవారి (పాలేర్లు) పాత కాలపరిమితి ముగిసి, ఈ రోజు నుంచే కొత్త సంవత్సర ఒప్పందాలు ప్రారంభమవుతాయి. ఏరువాక సాగుతుండగా రైతులు ఆలపించే నాగలి పాటలు, సాగు పాటలు తెలుగు జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఈ పండుగ సందర్భంగా పెళ్లైన ఆడపడుచులను పుట్టింటికి ఆహ్వానించడం ఆనవాయితీ. అలా వచ్చిన ఆడపడుచులు - తండ్రి, సోదరులు, పశువులకు హారతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు.
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే ఖరీఫ్ ప్రారంభానికి ముందు ఆనవాయితీగా వస్తున్న ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండల కేంద్రంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని పేర్కొన్నారు ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని ఎంపీ పిలుపునిచ్చారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఎలినో ప్రభావంతో అంతర పంటలు, తక్కువ నీటిని సేకరించే పంటలపై దృష్టి సారించాలని రైతులకు కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం కుడికాలువ ద్వారా సాగునీరు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏరువాక పున్నమి: ఈ రోజు రైతులు నాగలికి ఎందుకు పూజ చేస్తారో తెలుసా?'
విశిష్టం జ్యేష్ఠం- బ్రహ్మదేవునికి ప్రీతికరమైన జ్యేష్ఠ మాసం ఎందుకు అంత పవిత్రం?

