ETV Bharat / state

తాగునీటి పరీక్షలకు మొబైల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి: సీఎం చంద్రబాబు

ఆర్టీజీఎస్ లో వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష - బాగా పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించాలని సూచించిన చంద్రబాబు, పారిశుద్ధ్య నిర్వహణ లేని ఆసుపత్రుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశం

CM Chandrababu Review on RTGS
CM Chandrababu Review on RTGS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 7:33 AM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Review on RTGS: సమర్థంగా పనిచేసే ఉద్యోగులను గుర్తించి వారిని ప్రోత్సహించేలా అభినందన లేఖలను పంపేందుకు అన్నిశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయా ఉద్యోగుల వ్యక్తిగత రికార్డుల్లో వాటిని నమోదు చేయాలని అన్నారు. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. సరిగా పనిచేయని వారిని మోటివేట్‌ చేయడంపై దృష్టిపెట్టాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే ఉద్యోగులను గుర్తించి, ప్రోత్సహిస్తే బాగుంటుంది అంటూ సీఎం చేసిన సూచనపై అధికారులంతా చాలా మంచి నిర్ణయమని తెలిపారు. ఉద్యోగులను అభినందించడం ఇదే తొలిసారి అవుతుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల్లో పోటీతత్వం కూడా పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం: ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని అన్ని స్థాయిల్లో ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం విషయంలో ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోని ఆసుపత్రుల జాబితా సిద్ధం చేయాలనీ చంద్రబాబు ఆదేశించారు.

అక్కడ పొరుగుసేవల ఏజెన్సీని, సంబంధిత ఆసుపత్రి ఏవోలను బాధ్యులుగా చేయాలని సీఎం చంద్రబాబు వివరించారు. గతంతో పోల్చితే ఆలయాల్లో సిబ్బంది పనితీరు కొంత బాగుందని ఇంకా మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చూసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దని తేల్చి చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా సిబ్బంది అంతా పనిచేయాలని స్పష్టం చేశారు.

పనితీరులో మార్పు కనిపించాలి:సీఎం అదే విధంగా అవినీతికి ఆస్కారం ఉండరాదని ఏసీబీని రంగంలోకి దించే (యాక్టివేట్‌ చేసే) పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం హితవు పలికారు. సరిగా పనిచేయని కారణంగా తహసీల్దార్లను పక్కన పెట్టాల్సిన దుస్థితి రాకూడదని పేర్కొన్నారు. మంచి పనితీరు కనబరిచే డిప్యూటీ కలెక్టర్లను గుర్తిస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ శాఖకు ఫ్రెష్‌లుక్‌ తీసుకురావాల్సి ఉందని ఈ శాఖకు ఉన్న చెడ్డపేరు పోవాలని పనితీరులో మార్పు కనిపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రీ సర్వేతో అన్ని రకాల భూ సమస్యలు పోవాలన్నా సీఎం మళ్లీ వివాదాలు రాకుండా చూడాలన్నారు. ఎవరైనా సర్వేయర్లు సరిగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నీరు కలుషితం కాకుండా చర్యలు: తాగునీటి పరీక్షలకు మొబైల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలనీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు నమూనాలు సేకరించి, ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించాలని తెలియజేశారు. ల్యాబ్‌లు అందుబాటులో లేకపోతే మొబైల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై ఆడిట్‌ చేయించాలని దాని ఆధారంగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం పెద్దఎత్తున టెక్నాలజీ వినియోగించి సేవలు అందిస్తుండగా, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందుకు మీసేవ, డ్వాక్రా సంఘాలు, ప్రణాళిక విభాగంతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఏఐ-ఇంపాక్ట్‌ సదస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఏడు ఎంవోయూలను ఎలా అమల్లో పెట్టాలనే దానిపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, దేవాదాయ, వైద్యారోగ్య, పట్టణాభివృద్ధి, రవాణా, అగ్నిమాపక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అధునాతన సాంకేతికతతో నూతన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఎప్పటికప్పుడు మంత్రులతో సమవేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు టెక్నాలజీకి అలవాటు పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్​లైన్​లోనే​ - చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

13 జిల్లాల్లో ఆర్టీజీఎస్‌ కేంద్రాలు - డిసెంబరు నాటికి అందుబాటులోకి వచ్చేలా పనులు