ETV Bharat / state

సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్​లైన్​లోనే​ - చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

ఆర్టీసీ, డ్రోన్ల సేవలపై చర్చలు - ఆర్టీజీఎస్​పై ఉన్నతాధికారులతో స‌మీక్ష - మ‌న‌మిత్ర వాట్సాప్​పై అవగాహన

CM Review on several important topics
CM Review on several important topics (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 9, 2025 at 1:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

CM Review on Several Important Topics with Departments: రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అధునాతన సాంకేతికతతో నూతన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఎప్పటికప్పుడు మంత్రులతో సమవేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు టెక్నాలజీకి అలవాటు పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సమీక్షను నిర్వహించి ముఖ్య అంశాలను మంత్రులతో చర్చించారు.

అన్నీ సేవ‌లూ ఆన్‌లైన్‌లోనే అందుబాటు: వ‌చ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరుల‌కు అన్నీ సేవ‌లు ఆన్‌లైన్‌లోనే అందించాల‌ని, ఆ దిశ‌గా ప్రతి శాఖ‌ చ‌ర్యలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల‌ను ఆదేశించారు. ఆర్టీజీఎస్​పై ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో స‌మీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండగ నుంచి ప్రజ‌ల‌కు అన్ని సేవ‌లు ఆన్ లైన్‌లోనే అంద‌జేయాల‌న్నారు. ఆన్‌లైన్‌లో సేవ‌లతో ప్రజ‌ల‌కు సేవ‌లు పార‌ద‌ర్శకంగా అంద‌డంతో పాటు ప్రభుత్వ పని తీరు ప‌ట్ల సంతృప్తి స్థాయి పెరుగుతుంద‌న్నారు.

ముఖ్య అంశాలపై సీఎం సమావేశం (ETV)

మ‌న‌మిత్ర వాట్సాప్​పై అవగాహన: ఇప్పటికీ కొన్ని శాఖ‌లు భౌతికంగానే సేవ‌లందిస్తున్నాయ‌ని అన్నారు. అలాంటి శాఖ‌లు వెంట‌నే త‌మ పంథా మార్చుకుని ప్రజ‌ల‌కు ఆన్‌లైన్‌లో సేవ‌లందించేలా ఏర్పాట్లు చేసుకోవాల‌ని తేల్చిచెప్పారు. ప్రజ‌ల‌కు కావాల్సిన ప్రభుత్వ సేవ‌ల‌ను కార్యాల‌యాల‌కు తిర‌గ‌న‌వస‌రం లేకుండా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అంద‌జేస్తున్నామ‌న్నారు. దీనిపై ప్రజ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు.

ఆర్టీసీ, డ్రోన్ సేవ‌లు విస్తృతంగా: రిజిస్ట్రేష‌న్ల తర్వాత డాక్యుమెంట్లు కొరియ‌ర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తుల ఇంటి ముందుకే పంపే ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. ఆర్టీసీ సేవ‌లు మ‌రింత మెరుగ‌ుపడేలా చూడాల‌ని ఆదేశించారు. బ‌స్టాండు ప్రాంగణం, పరిసరాలు, టాయ్‌లెట్ల వ‌ద్ద పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు ఉండాలన్నారు. డ్రోన్ సేవ‌లు మ‌రింత విస్తృత ప‌రిచాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు.

డ్రోన్లపై రైతుల‌కు అవ‌గాహ‌న: పురుగు మందుల వినియోగాన్ని త‌గ్గించేందుకు డ్రోన్లను ఏ విధంగా వాడుకోవాలనే అంశంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. పారిశుద్ధ్యం నిర్వహ‌ణ ద్వారా వ్యాధుల వ్యాప్తి లేకుండా చేయవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాల్లో కొంత‌మంది అధికారులు మంచి కార్యక్రమాల‌ు అమలు చేస్తున్నారని, మిగిలిన జిల్లాల‌్లో కూడా అమలయ్యేలా చూడాలని సూచించారు.

ఆర్టీజీఎస్​పై ఉన్నతాధికారులతో స‌మీక్ష: రాష్ట్ర ఆర్టీజీఎస్‌ కేంద్రాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని కోసం సచివాలయం సమీపంలో మల్టీపర్పస్‌ భవనాన్ని నిర్మిస్తోంది. ఆర్టీజీఎస్‌ సేవలను మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇప్పటికే 750 సేవలను అందిస్తోంది. ఇస్రో సహకారం, శాటిలైట్‌ సాయంతో అవేర్‌ 2.0 వ్యవస్థ ద్వారా వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నూతనంగా డేటా లేక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనితో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం ఒకే చోట ఉండేలా చేస్తుంది. ఈ కార్యకలాపాలు అన్నీంటికి త్వరలో ఆర్టీజీఎస్‌ కేంద్రం అవుతుంది. దీనికోసం సీఎం వివిధ శాఖల ఉన్నతాధికారులతో స‌మీక్ష నిర్వహించారు.

13 జిల్లాల్లో ఆర్టీజీఎస్‌ కేంద్రాలు - డిసెంబరు నాటికి అందుబాటులోకి వచ్చేలా పనులు

ఆధునిక సాంకేతికతతో విపత్తు నియంత్రణ - తుపానుపై అవేర్‌ 2.0 అస్త్రం