ETV Bharat / state

ఏఐ సదస్సులో కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన దారుణం: సీఎం చంద్రబాబు

కాంగ్రెస్‌ ప్రవర్తన సిగ్గుచేటు - అంతర్జాతీయ సదస్సులో అర్ధనగ్న ప్రదర్శన దారుణం - రాష్ట్రంలో బూతులు తిట్టేవారిని పరామర్శిస్తున్నారు - వినుకొండ స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు

CM Chandrababu Comments on Congress Behavior
CM Chandrababu Comments on Congress Behavior (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 22, 2026 at 9:50 AM IST

|

Updated : February 22, 2026 at 10:00 AM IST

4 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Comments on Congress Behavior: ''ఏఐ సదస్సులో కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు ఆవేదన కలిగించింది. 70కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన దేశ ప్రతిష్ఠకు నష్టమని, ఇలాంటి చర్యాల్ని ఖండిస్తున్నా'' అని సీఎం చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభితో కలిసి స్వచ్ఛ రథాలను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏఐ సదస్సులో ప్రపంచంలోని చాలా దేశాలు ఆవిష్కరణలు ప్రదర్శించగా, మన ఆవిష్కరణల్ని చూపించి ప్రపంచ దేశాల అభినందనలు అందుకున్నామని అన్నారు. ఐటీ, ఏఐల్లో ముందుండటంతో ప్రపంచ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహించే ఏకైక దేశం మనదేనని అందరూ కితాబిచ్చారు. మన యువత ప్రయోజనాలు కాపాడాల్సిన కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ''మన రాష్ట్రంలోను కూడా వైఎస్సార్సీపీ వంటి పార్టీని ఎప్పుడూ చూడలేదు. నేను బాంబులకు భయపడలేదు. అలిపిరిలో నాపై దాడి చేసినప్పుడు వేంకటేశ్వరస్వామి నన్ను కాపాడారు. ఆ స్వామికి అపచారం కలిగే పనులు వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులే తిడుతున్నారు. ఇది న్యాయమేనా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నామా? రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు. మదనపల్లెలో ఒకరు గంజాయి తాగి మృగంలా ప్రవర్తించారు. గంజాయి తాగి ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను. అలాంటి మృగాలు జైల్లో ఉండాలి లేదా ఉరిశిక్షతో పైకి పోవాలి, చట్టం తన పని తాను చేస్తుంది'' అని సీఎం పేర్కొన్నారు.

నెయ్యే కాదని సిట్‌ తేల్చింది: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో నాసిరకం ప్రసాదాలు గత 5 ఏళ్లు అందరూ తిన్నారు. వైఎస్సార్సీపీ వారు భక్తుల నమ్మకాన్ని దెబ్బ తీశారు. మేము పవిత్రతను కాపాడుతున్నాం. ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ ప్రకారం టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని అన్నారు. నెయ్యి నాణ్యంగా లేదని ల్యాబ్​కు పంపితే జంతు కొవ్వు ఉందని తేల్చారు. ప్రజలకు తెలియజేయకపోతే అప్రతిష్ఠ వస్తుందని ల్యాబ్ రిపోర్టునే నేను ప్రకటించానని సీఎం అన్నారు. దీన్ని రాజకీయం చేసి సుప్రీం కోర్టు వరకు వెళ్లేలా చేశారని దీనిపై సిట్‌ వేస్తే అసలు నెయ్యే కాదని, రసాయనాలు ఉన్నాయి అని తేల్చిందని అన్నారు.

సిట్ స్పష్టంగా చెప్పినప్పటికీ తిరిగి దాన్ని మా పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని హెరిటేజ్ కంపెనీని తీసుకు వచ్చి నా పేరు ప్రస్తావించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కరడుగట్టిన నేరస్థులతో రాజకీయం చేయాలా? రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడి పైనే లేదని మీ అందరిపై ఉందని తెలిపారు. చెడ్డవారిని దూరం పెట్టినప్పుడే రాజకీయాల్లో ప్రక్షాళన మొదలవుతుందని నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మార్పు రాదని పిలుపునిచ్చారు. ప్రజల కోసమే నాడు జైలుకెళ్లానని కేవలం ప్రజలు, రాష్ట్రాభివృద్ధి కోసమే ఇప్పటికీ పోరాటం చేస్తున్నానని సీఎం వివరించారు.

పరామర్శల పేరిట బలప్రదర్శనకు దిగుతున్నారు: ''చెత్త, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. పరామర్శల పేరిట బయటకు వస్తారు. మనుషుల్ని బలవంతంగా తెచ్చుకుని బలప్రదర్శనకు దిగుతున్నారు. వాళ్ల కార్ల కింద మనుషుల్ని చంపేసి ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. చనిపోయినవారి ఇళ్లకు పరామర్శకు వెళ్లరు వాళ్లనే పిలిపించుకుని పరామర్శిస్తారు. ఇదెక్కడా చూడలేదు. బూతులు తిట్టేవారిని పరామర్శిస్తారు. వాళ్ల కోసం చనిపోయిన వారిని మాత్రం పరామర్శించారు. విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా తీసుకు వెళ్తున్నాం.

నాడు పెట్టుబడులు పెట్టాలి అన్నా ఎవరూ ముందుకు రాలేదు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి, 13 శాతం అప్పులు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మిన ప్రజలకు సూపర్‌ సిక్స్​ను అనుకున్న సమయం కంటే ముందుగానే అమలు చేశాం. అవకాశాల్ని అందిపుచ్చుకోవడం ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో 23 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. త్వరలోనే విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)లో శిక్షణ ఇచ్చేందుకు ఏఐ ట్యూటర్‌ వస్తారు. వ్యవసాయంలో ఏఐ అగ్రి ఎకానమీని తీసుకొస్తాం. ఇటీవల బిల్‌గేట్స్‌ కూడా వచ్చి రైతులు టెక్నాలజీ వినియోగిస్తున్న తీరును చూసి ఎంతో అభినందించారు'' '' అని సీఎం అన్నారు.

బూట్లు తొలగించి, జ్ఞాపిక అందుకుని: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, ఆయన భార్య లీలావతి కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానించారు. అనంతరం వారు వేంకటేశ్వరస్వామి ప్రతిమ ఉన్న జ్ఞాపికను బహూకరిస్తు ఉండగా చంద్రబాబు తన కాళ్లకు ఉన్న బూట్లను తొలగించి అందుకున్నారు.

కోటప్పకొండ ప్రభల ప్రస్తావన: పల్నాడులో అడుగుపెట్టగానే వచ్చే వైబ్రేషన్సే వేరు. ఇటీవలే కోటప్పకొండ తిరునాళ్లు జరిగాయి. మునుపెన్నడూ లేని రీతిలో భక్తులు భారీగా హాజరయ్యారు. జిల్లా అధికారులు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి అనగానే కోటప్పకొండ ప్రభలే గుర్తుకొస్తాయి. నేను అనునిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నాను. అందుకు వేరే కారణాలున్నాయి.

దొంగలను పట్టి నడిరోడ్డుపై నిలబెడతా: సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని శాసనమండలిలోకి తీసుకెళ్లారు. పాదరక్షలు వేసుకుని స్వామి చిత్రాలను విసిరేశారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాలా? వేంకటేశ్వరస్వామి విషయాన్ని బయట మాట్లాడకూడదనుకున్నాను. 2 రోజులు ఓపిక పట్టాను. నాపైనే నెపం వేసే ప్రయత్నం చేస్తుంటే ఎలా ఊరుకుంటాను? దొంగే దొంగ అంటుంటే దొంగను పట్టి నడిరోడ్డు పై నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే మాట్లాడుతున్నా, మీరంతా ఈ విషయంలో నాతో నడవాలిని అని సీఎం అన్నారు.

పేదలకు అండగా ఉంటాం - ఆదాయం పెంచి ఆనందం పంచుతాం: సీఎం చంద్రబాబు

పనిచేయని, సమస్యలు సృష్టిస్తున్న వారిని భరించాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

Last Updated : February 22, 2026 at 10:00 AM IST