ETV Bharat / state

ఫైళ్ల​ క్లియరెన్స్​లో వేగం పెంచాలి - మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ఫైళ్ల కియరెన్స్​కు డోలా, నిమ్మల, ఫరూక్‌ 2 రోజులు - చంద్రబాబు, లోకేశ్​, నారాయణ, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్, దుర్గేష్‌ 3 రోజులు - పవన్ 4 రోజులు

CM Chandrababu Comments in Meeting Held in Secretariat
CM Chandrababu Comments in Meeting Held in Secretariat (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 10, 2025 at 3:40 PM IST

4 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Comments in Meeting Held in Secretariat : ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు, చేర్పులు జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి శాఖ చేసిన పనులన్నీ తన వద్ద రికార్డు రూపంలో ఉన్నాయని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సదస్సు నిర్వహించారు. వృద్ధిరేటు పెంపునకు తీసుకోవాల్సిన అంశాలు, అమలు ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

త్వరగా ఫైల్స్‌ క్లియర్ చేయాలి : దస్త్రాల క్లియరెన్స్‌లో మంత్రులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఫైల్స్ క్లియరెన్స్‌ టైం రిపోర్ట్‌ను ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్​ సదస్సులో ప్రదర్శించారు. మంత్రులు డోలా, నిమ్మల, ఫరూక్‌ 2 రోజులు, సీఎం చంద్రబాబు, లోకేశ్​, నారాయణ, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్, దుర్గేష్‌ 3 రోజులు సమయం తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సగటున 4 రోజుల్లో ఫైల్స్‌ క్లియర్‌ చేస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 11 రోజులు తీసుకుంటుండగా కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ అత్యధికంగా 15 రోజుల సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరగా ఫైల్స్‌ క్లియర్ చేయాలని సీఎం సూచించారు.

దస్త్రాల క్లియరెన్స్​లో వేగం పెంచాలని మంత్రులకు సీఎం ఆదేశం (ETV)

3 నెలల్లో మెరుగుపర్చుకోవాలి : ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచేలా ప్రభుత్వ శాఖలు పని చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. టెక్నాలజీ ఆడిటింగ్‌తో పాటు అధికారుల్లో ప్రవర్తన మారితే ప్రజల్లో సంతోషిస్తారన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు పౌరసేవలను మరింత మెరుగ్గా మార్చడానికి పని చేయాల్సిన సమయం ఇది అన్నారు. సేవల డెలివరీ వద్దే సమస్య ఉంటోందని, మూడు నెలల్లో అంతా పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. వీటితో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు సంతృప్తిగా లేకపోతే బంగారం ఇచ్చినా లాభం ఉండదని అభిప్రాయపడ్డారు. అంతా కలిసి పనిచేస్తే మూడు నెలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు.

'అనంతపురం వేరుశనగ రైతులకు దేశంలోనే తొలిసారి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చాం. ఆ జిల్లాలో కరవు తీర్చేందుకు ఇజ్రాయెల్‌ సాంకేతికతను పరిశీలించాం. రాయలసీమలో పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉండేది. అనంతపురం జిల్లాలో నాణ్యమైన వేరుశనగ పండేలా చర్యలు చేపట్టాం. అన్నా హజారే, రాజేంద్రసింగ్‌ స్ఫూర్తితో జలసంరక్షణ చేపట్టాం. రాయలసీమలో ఇప్పుడు భూగర్భజలాలు పైకి వచ్చాయి. భూగర్భజలాలు 3 మీటర్లకు చేరితే ఖర్చుపెట్టే బడ్జెట్‌ తగ్గుతుంది. సౌరశక్తి వినియోగించుకుంటే విద్యుత్‌ డిమాండ్‌ బాగా తగ్గుతుంది. ఈ ఏడాది కరెంట్‌ ఛార్జీలు పెంచం. దేశంలో ఇండస్ట్రియల్‌ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదే.' -ముఖ్యమంత్రి చంద్రబాబు

సీఎం సూచనలు : సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చని, పాలనా రిత్యా రాజ్యాంగంలో చాలాసార్లు సవరణలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్ధిక ఫలితాలపై సమావేశంలో సమీక్షించారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా ఆధారిత పాలన​ అంశాలపై సూచనలు చేశారు. సూపర్ సిక్స్ పథకాల, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. దరఖాస్తులు సకాలంలో క్లియరెన్సులు, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో ప్రజెంటేషన్ జరిగింది. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు వాటి పరిష్కారం పై హెచ్ఓడీలకు సీఎం సూచనలు చేశారు.

ఉన్నతాధికారులంతా శాస్త్రీయంగా ఆలోచించి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పీపీఏలను రద్దు చేసి గత ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ 5.19 విద్యుత్ కొనుగోళ్లను 4.92కు తగ్గించామని గుర్తు చేశారు. మొత్తంగా రూ. 9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చిందని అయినా ప్రజలపై భారం పడకూడదని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచమని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

గతంలో జరిగిన పొరపాట్లకు చెక్​ పెట్టాలి : రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా నూతన వ్యవస్థ తీసుకొస్తున్నామన్నారు. ప్రజలు మెచ్చే పాలన ఇవ్వటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను గత పాలకులు నిర్వీర్యం చేసి నిధులు మళ్లించటం వల్ల కేంద్రం కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా నూరు శాతం సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని ఆదేశించారు. నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఏపీ అడుగులు వేస్తోందని, అందుకే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయన్నారు. గత పాలకులు రాష్ట్ర బ్రాండ్ పడిపోయేలా చేసి 13 శాతం వరకు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేశారన్నారు. చాలా విభాగాలు నిధులు ఎలా ఖర్చు చేశాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిర్యాదులు ఎక్కువగా ఆ శాఖ సరిగ్గా పని చెయ్యనట్లే : మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై విశ్లేషించి వ్యవస్థలో లోపాలను సవరించుకోవాలని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాలు అనర్హులను తొలగించి అర్హులకు ప్రయోజనం కలిగించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు ఎక్కువగా ఉంటే సంబంధిత శాఖ సరిగ్గా పనిచేయనట్టే అన్నారు. రెవెన్యూ, పోలీసు, పురపాలక శాఖల్లో పెద్ద ఎత్తున వస్తున్న గ్రీవెన్సులు త్వరితగతిన పరిష్కారం కావాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గిరిజన పాఠశాలల్లో ముస్తాబు అనే ఓ చిన్న కార్యక్రమం చేపట్టి విద్యార్ధుల్లో మార్పు తెచ్చారని అభినందించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతీ మూడు నెలలకు ఓ మారు సమీక్ష చేసుకుందామన్నారు. వేసవిలో తాగునీరు, నీటి సరఫరా విషయంలో ఇప్పటి నుంచే ప్రభుత్వ శాఖలు సిద్ధం కావాలని తెలిపారు.

వృద్ధిరేటు పెంపునకు ప్రణాళికలు - అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలి: సీఎం చంద్రబాబు