ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేవారికి గొడ్డలి పార్టీ ఫండింగ్ చేస్తోంది: సీఎం చంద్రబాబు
ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే గొడ్డలి పార్టీ లక్ష్యం - నాతో పాటు పవన్‌ను దూషించే వారి వెనుక వైఎస్సార్సీపీ ఉంది - మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 5, 2026 at 8:15 PM IST
CM Chandrababu At Kuppam : గొడ్డలి పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేయిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తనతో పాటు పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ హింస, బూతులను నమ్ముకుందని ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందని సీఎం ధ్వజమెత్తారు. మూడు రోజులుగా కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి స్వగృహంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా : రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గానికి ప్రాజెక్టులు వస్తున్నాయని రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కుప్పానికి కనెక్టివిటీని పెంచుతున్నామన్నారు.
త్వరలోనే సరికొత్తగా ముస్తాబైన అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకూ కృష్ణా నీరు తెచ్చామని త్వరలోనే గాలేరు - నగరి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్నారు.
ప్రణాళికలు సిద్ధం : అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలూ ప్రగతి సాధించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. క్వాంటం, సెమీ కండక్టర్ల విభాగాల్లో భారీగా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వచ్చే డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సీఎం తెలిపారు.
పరిశ్రమలే కాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనానికీ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తుంటే కొందరు అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారని సీఎం మండిపడ్డారు.
సిగ్గులేకుండా నీతులు : గత పాలకులు కంపెనీలకు భూములు ఇచ్చి వివాదాల్లోకి నెట్టారని ఒక్క వ్యక్తి లబ్ధి కోసం విలువైన భూములు, ఖనిజ సంపద బ్లాక్ అయ్యిందన్నారు. ఓబుళాపురంతో పాటు ఆన్‌రాక్ సంస్థలు కూడా ఈ తరహాలోనే తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని ఆయన తెలిపారు. కంపెనీలను తరిమేయటం, పరిశ్రమల్ని పారిపోయేలా చేయటమే వైఎస్సార్సీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం కష్టపడి తీసుకు వచ్చిన ప్రతీ ప్రాజెక్టునూ తామే తెచ్చామని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అదే పనిగా అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత పాలకులు ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చేశారన్నారు. తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఇప్పుడు సిగ్గులేకుండా నీతులు చెబుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
సీఎం, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు - యూట్యూబర్ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు
సాగరంలో సత్తా చాటేలా - త్వరలో మరో రెండు యుద్ధనౌకలు ఎంట్రీ, ప్రత్యేకతలు ఏంటంటే?

