సంతానం భారం కాదు, సంపద - పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలి : సీఎం చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా పల్స్ పోలియో కార్యక్రమం - చిన్నారులకు పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు - పరిస్థితులు మారాయి - ఇప్పుడు సంతానం భారం కాదు సంపదన్న సీఎం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 5:05 PM IST
CM Chandrababu Polio Drops to Children : జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ క్రమంలోనే తన క్యాంప్ కార్యాలయంలో పిల్లలకు సీఎం చంద్రబాబు పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడారు.
పిల్లలను ఎత్తుకుని చంద్రబాబు కొంతసేపు ఆడించారు. వారి ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులుతో సీఎం మాట్లాడారు. పిల్లల పెంపకం భారంగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగానికి, ఉపాధికి వెళ్తున్న మహిళలు పిల్లల పెంపకంలో ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అడిగారు.
National Immunization Day 2026 : ఇంట్లో భర్త, మగవాళ్లు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చిన్నారుల్ని కని, పెంచడం, వారి అలనాపాలనా చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని తెలిపారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో భాగస్వాములు అయ్యేవారని గుర్తుచేశారు. వారిని విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని గుర్తుచేశారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని చంద్రబాబు తెలిపారు. సంతానాన్ని సమస్యగా, భారంగా చూసే విధానం పోవాలని చెప్పారు. సంతానం అంటే సంపద అనే పరిస్థితి వస్తోందని వెల్లడించారు. అందుకే ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజల అండతో కొండనైనా ఢీకొడ్తాం - సేవ చేసేందుకే కూటమి ఏర్పాటు: సీఎం చంద్రబాబు
వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు - నిర్వాసితులకు రూ.300 కోట్ల చెక్కుల పంపిణీ

