ETV Bharat / state

ఏపీలో పెట్టుబడుల ఊపు - కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభం: సీఎం చంద్రబాబు

దేశీయ పెట్టుబడుల్లో ప్రథమ స్థానంలో ఏపీ - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టంని వెల్లడి - పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu About Investments in Andhra Pradesh
CM Chandrababu About Investments in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 3, 2026 at 1:13 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu About Investments in Andhra Pradesh : దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా ఏపీ దక్కించుకున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఊపు, కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టమని అన్నారు. పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు.

పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు : దేశీయ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం ప్రజలకు శుభవార్త అన్న ఆయన, ముందుచూపుతో అమలు చేస్తున్న పాలసీ సంస్కరణల ప్రభావం ఇదని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల ద్వారా పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందుతున్నాయన్నారు. ప్రోత్సాహకాల పంపిణీలో పారదర్శకత కోసం ఎస్క్రో ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టామని వెల్లడించారు. రంగాలవారీగా స్పష్టమైన విధానాలు అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్న ఇన్వెస్టర్లకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

విజన్‌పై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ బృందం చేసిన కృషిని ప్రశంసనీయమన్నారు. ఇది విజయానికి ముగింపుగా కాకుండా భవిష్యత్ అభివృద్ధికి పునాదిగా అభివర్ణిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు, భాగస్వామ్యాలు, స్థిరమైన వృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్​ : ఏపీ తర్వాత స్థానాల్లో ఒడిశా (13.1 శాతం), మహారాష్ట్ర (12.8 శాతం) ఉన్నాయి. గతంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఒడిశాలను దాటి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 9.5 శాతం, గుజరాత్‌ 7.1 శాతం పెట్టుబడులతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు : విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంతో దేశవిదేశాల పెట్టుబడిదారులు 613 ఒప్పందాలు ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని గతంలో సంబంధిత అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలసికట్టుగా విజయవంతం చేశారు.

బ్యాటరీ తయారీ యూనిట్‌ : పెట్టుబడుల సదస్సుకు ముందే జరిగిన ఎంఓయూల ద్వారా భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. పలు కీలక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రెన్యూ పవర్‌, ‘హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌’, యాక్సిస్‌ ఎనర్జీ’ ఉన్నాయి. ఓర్వకల్లులో సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీ పరిశ్రమ, కుప్పంలో పాదరక్షల తయారీ యూనిట్‌ కి తైవాన్ సంస్థలు ముందుకు వచ్చాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో జాయింట్‌ వెంచర్‌ ద్వారా ఎడ్వాన్స్డ్‌ బ్యాటరీ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ఈ-జౌల్‌ ఇండియా ముందుకు వచ్చింది. 19వేల 500 కోట్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీ, క్యాథోడ్‌ యాక్టివ్‌ మెటీరియల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆర్థిక అభివృద్ధి బోర్డు(ఈడీబీ)తో ఒప్పందం చేసుకుంది.

కుప్పంలో 400 కోట్లతో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు అలీజియన్స్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. పాదరక్షల తయారీ సంస్థ పౌ చెన్‌ గ్రూప్‌ ఓ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఓర్వకల్లులో ఇమేజ్‌ సెన్సర్‌ యూనిట్ల ఉత్పత్తికి క్రియేటివ్‌ సెన్సర్‌ ఇంక్‌ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సెమీకండక్టర్‌ మిషన్‌ కింద ప్రోత్సాహకాలు అందించాలని కోరిన సంగతి తెలిసిందే.

అమెరికాలో మంత్రి లోకేశ్‌ పర్యటన - ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ

సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్ - 613 ఒప్పందాలు - రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు