ETV Bharat / state

తిరుమలలో "క్లీనింగ్ డే" - భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు టీటీడీ ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు - ఇకపై ప్రతి మంగళవారం ‘క్లీనింగ్ డే’ ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయం - నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Every Tuesday Cleaning Day in Tirumala
తిరుమలలో ఇకపై ప్రతి మంగళవారం ‘క్లీనింగ్ డే’ ప్రత్యేకంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 26, 2026 at 1:02 PM IST

2 Min Read
Choose ETV Bharat

Every Tuesday Cleaning Day in Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరోగ్యశాఖ సమగ్ర ముందస్తు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం క్లీనింగ్ డే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.

ఇటీవల కాలంలో తిరుమలలోని కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, వ్యర్థాలు పేరుకుపోతున్నాయని పలువురు భక్తుల నుంచి టీటీడీ యాజమాన్యానికి ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ఈ నూతన పారిశుద్ధ్య విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

ప్రతి మంగళవారం క్లినింగ్ తప్పనిసరి: ఈ కొత్త నిబంధన ప్రకారం వారం రోజుల పాటు నిరంతరాయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు, ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలి. ఈ ఆరు గంటల విరామ సమయంలో దుకాణాల లోపలి భాగాలను, వంటశాలలను, పరిసర ప్రాంతాలను సంపూర్ణంగా శుభ్రం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఈ నిర్ణయంలో భాగంగా మంగళవారం తిరుమలలోని మూడో సత్రం, పీఏసీ-1, పీఏసీ-2 తదితర ప్రాంతాల్లోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను మూసివేసి పరిసరాలను శుభ్రం చేశారు. ఫాస్ట్​ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రతకు సంబంధించి భక్తుల నుంచి ఫిర్యాదులు అందితే గనక కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా దుకాణాలను నిర్వహించే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పారిశుద్ధ్యం, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నిర్దేశిత సమయాల్లో క్లీనింగ్ చేయని వారిపై, నాణ్యతా ప్రమాణాలు పాటించని దుకాణాలపై కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో భక్తులు, వ్యాపారులు అందరూ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

తిరుమలలో ముగిసిన పవిత్రోత్సవాలు: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు పవిత్ర పూర్ణాహుతితో మంగళవారం ఘనంగా ముగిశాయి. తొలి రెండు రోజుల్లాగానే మంగళవారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తరువాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.

కాగా మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు - ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష

తిరుమలలో ఇక వన్యప్రాణుల భయమొద్దు - భక్తుల భద్రత కోసం రంగంలోకి 'రోబో డాగ్'