అమరావతిలో వైఎస్సార్సీపీ నేతల పర్యటన - అడ్డుకున్న రైతులు - ఉద్రిక్తత
వైఎస్సార్సీపీ నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తత - ఉండవల్లిలో ఆ పార్టీ నాయకులను అడ్డుకున్న రాజధాని రైతులు - రైతులను తోసుకుంటూ ముందుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ నేతల ప్రయత్నం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 27, 2026 at 12:36 PM IST
|Updated : June 27, 2026 at 1:19 PM IST
Amaravati Farmers Vs YSRCP : పోరాటాల ఉద్యమగడ్డ రాజధాని అమరావతి ప్రాంగణం రైతుల తిరుగుబాటుతో మరోసారి భగ్గుమంది. అమరావతిలో బలవంతంగా భూసమీకరణ, సేకరణ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించింది. ఇందులో భాగంగా ఇవాళ ఆ కమిటీ రాజధానిలోని పెనుమాక పర్యటనకు బయల్దేరింది. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లోని ప్రజలు, వైఎస్సార్సీపీ నేతల పర్యటనను అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా పెద్దఎత్తున రోడ్డెక్కి నినదించారు.
రాజధానిని ముక్కలు చేయాలని చూసిన వైఎస్సార్సీపీ నాయకులకు ఇక్కడ స్థానం లేదంటూ నల్లజెండాలు, ప్లకార్డులతో మహిళలు సైతం పెద్దఎత్తున తరలివచ్చారు. 'డౌన్ డౌన్ వైఎస్సార్సీపీ' అంటూ నినాదాలతో ఆయా గ్రామ జంక్షన్లను హోరెత్తించారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేసిన వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని అన్నదాతలు నిలదీశారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నాయకులతో ఆ పార్టీ రాజధాని పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిందని పేర్కొంటున్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని బహిరంగంగా ప్రకటించిన తర్వాతే వైఎస్సార్సీపీ నాయకులు ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టి, అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలను హెచ్చరించారు. అయినా ఆ పార్టీ కార్యకర్తలు ఉండవల్లి సెంటర్‌కు మొండిగా దూసుకురావడం ఘర్షణకు దారితీసింది. అక్కడ కర్షకులతో వారు కావాలనే వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
వైఎస్సార్సీపీ నాయకుల అతి ప్రవర్తన కవ్వింపు చర్యలతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఉండవల్లి జంక్షన్ కాసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌ను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తమ భవిష్యత్‌ను అంధకారం చేసిన నాయకులను చూసి అమరావతి శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. ఆ పార్టీ నాయకులు తమ డ్రామాలను తక్షణమే విరమించుకోకపోతే, 29 రాజధాని గ్రామాల రైతులమంతా ఏకమై తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని అన్నదాతలు ఘాటుగా హెచ్చరించారు.
ఊహించని స్థాయిలో స్థానిక ప్రజలు, మహిళలు 'జై అమరావతి' అంటూ ఎదురుతిరగడంతో పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ అగ్రనాయకత్వంలో ఒక్కసారిగా వణుకుమొదలైంది. ఆత్మరక్షణలో భాగంగా అక్కడి నుంచి బయటపడే మార్గాలు అన్వేషించారు. చూస్తుండగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నదాతలను తోసుకుంటూ వైఎస్సార్సీపీ నేతలు ముందుకువెళ్లేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Tension in Amaravati : ఈ క్రమంలో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలు కాగా ఆసుపత్రికి తరిలించారు. దీనిపై సమాచారం అందుకున్న తుళ్లూరు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని రైతులు, వైఎస్సార్సీపీ నేతల్ని చెరోవైపునకు తీసుకెళ్లారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ పోలీసుల రక్షణ వలయంలో ఆ పార్టీ నాయకులు ఉండవల్లి నుంచి నిష్క్రమించారు. దీంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
మరోవైపు తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ చిన్నతంబిని టీడీపీ నాయకులు పరామర్శించారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని, వైద్య ఖర్చులు పార్టీ భరిస్తుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతల దాడిలో కానిస్టేబుల్ చిన్నతంబి గాయపడ్డారు.
చకచకా అమరావతి నిర్మాణ పనులు - విధ్వంసం నుంచి విశ్వనగరిగా!
అమరావతి మీదుగానే బుల్లెట్ రైలు - పాత ప్రతిపాదనకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు

