ETV Bharat / state

సాఫ్ట్‌వేర్‌ జాబ్​ చేసి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహణ -​ అంతర్జాతీయ ముఠా గుట్టరట్టు చేసిన పోలీసులు

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించిన నెల్లూరు పోలీసులు - ఆర్777 అనే బెట్టింగ్ యాప్‌ నిర్వాహకులను అరెస్టు చేసి వారి నుంచి 4 ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం

POLICE_BUST_CRICKET_BETTING_RACKET
POLICE_BUST_CRICKET_BETTING_RACKET (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 10:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

Police Bust International Cricket Betting Racket in Nellore: ప్రస్తుత సమాజాంలో క్రికెట్‌ బెట్టింగ్‌ రోజురోజుకీ విస్తరిస్తోంది. పట్టణాల నుంచి గ్రామాల వరకూ ఇది పాకింది. ఇప్పుడు పలు వెబ్​సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారానే కాకుండా మొబైల్‌ యాప్‌ల రూపంలోనూ వచ్చేశాయి. ఇందులో చిక్కుకొని బాధితులు అల్లాడుతున్నారు. ఆన్‌లైన్‌లో తారసపడుతున్న యాడ్స్​ క్షణాల వ్యవధిలో ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి.

బెట్టింగ్​ల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే నష్టపోయిన మరికొందరు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవర పెడుతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అయినా పుట్టగొడుగుల్లా ఎక్కడోచోట పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరులో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న కొంతమంది వ్యక్తుల గుట్టును పోలీసులు రట్టు చేశారు.

అత్యాశతో సులభంగా డబ్బులు సంపాదించాలని: క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్‌ను నెల్లూరు సిటీ పోలీసులు ఛేదించారు. ఆర్‌777 అనే బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు బుకీలు మహేశ్‌బాబు, హరికృష్ణను అరెస్టు చేసినట్లు బాలాజీ నగర్‌ పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు బుకీలు మహేశ్‌కుమార్‌, మణికుమార్‌లు పరారీలో ఉన్నారని సిబ్బంది వారి గురించి వెతుకుతున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 4 ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

మాయమాటలు చెప్పి రూ.53 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేసినట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి గుట్టు రట్టు చేశారు. నిందితుల బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ.1.64 కోట్ల నగదును సీజ్‌ చేశారు. గతంలో పొడపాటి మహేశ్‌బాబు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసే వాడని అత్యాశతో సులభంగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్‌ యాప్‌ను ఎంచుకున్నట్లు పోలీసులు చెప్పారు. శ్రీలంక, దుబాయ్‌ దేశాలు తిరిగి బెట్టింగ్‌ యాప్‌ నిర్వహణపై మహేశ్‌ శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ఆర్‌777 యాప్‌ను 30 శాతం షేర్‌ వచ్చేలా దుబాయ్‌ నుంచి తీసుకున్నాడని మణి, వేణు, మహేశ్‌కుమార్‌కు 15 శాతం షేర్‌ ఇస్తూ వారితో ఈ బెట్టింగ్ నిర్వహించాడని పోలీసులు తెలిపారు.

పట్టుబడగానే యాప్‌ మూత: సాధారణంగా యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. క్రికెట్‌ యాప్‌లను రూపొందించిన వారు వాటిని ప్లే స్టోర్‌లో ఉంచరు. లింక్‌ రూపంలో ఉండేలా రూపొందిస్తారు. బెట్టింగ్‌ ఆడాలనుకునే నమ్మకస్తులకు మాత్రమే ఆ లింక్‌ పంపుతారు. దాన్ని క్లిక్‌ చేసి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌ నిర్వహిస్తారు.

ఎవరైనా పట్టుబడినట్లు తెలియగానే దాని వివరాలన్నీ తొలగిపోయేలా ముందుగానే యాప్‌లో వెసులుబాటు కల్పిస్తారు. సూత్రధారి శివారెడ్డి పరారీలో ఉండడంతో యాప్‌ ఎంత వరకు పనిచేస్తుందనే దానిపై స్పష్టత రాలేదు. ఇప్పటికే దాన్ని వివరాలన్నీ తొలగించేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న సెల్​ఫోన్​ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

చేసేది పాల వ్యాపారం - నడిపేది బెట్టింగ్‌ బండారం

ఆడినోళ్లు గెలవరు, ఆడించినోళ్లు దొరకరు - బెట్టింగ్‌ ఊబిలో కూరుకుపోతున్న యువత