ETV Bharat / state

మిర్చి రేటు ఢమాల్‌‌ - రోజురోజుకు పడిపోతున్న ధరలు, ఆందోళనలో రైతులు

దయనీయంగా మారిన మిర్చి రైతుల పరిస్థితి - లక్షల్లో పెట్టుబడి పెడుతున్నా గిట్టుబాటు ధరలేక ఇక్కట్లు - పంటను రాసులుగా పోసి వ్యాపారుల కోసం ఎదురుచూపులు - ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు

watch for Chilli Farmers Suffering Due to Price Fall Day to Day
Chilli Farmers Suffering Due to Price Fall Day to Day (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 9:20 AM IST

3 Min Read
Choose ETV Bharat

Chilli Farmers Suffering Due to Price Fall Day to Day : రోజురోజుకీ తగ్గుతున్న మిరప ధరలతో అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇరవై రోజుల క్రితం ఉన్న ధరలు ప్రస్తుతం పడిపోవటంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.

అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా తయారైంది మిర్చి ధరల పరిస్థితి. అనంతపురం జిల్లాలో మిర్చి రైతులు నానాపాట్లూ పడుతున్నారు. రెండు వారాలుగా మిరప కోతలు పెట్టిన వారంతా ఏరోజుకారోజు పడిపోతున్న ధరలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు మిరపను రాసులుగా పోసి కొనేవారి కోసం ఎదురుచూస్తున్నారు. పంట సాగుకోసం తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరిగిపోతుండటంతో దళారులకే అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిరప విక్రయాలకు మార్కెట్ సౌకర్యం లేకపోవడం కూడా అన్నదాతలకు సమస్యగా మారింది. మిరప రైతులంతా కర్ణాటకలోని బ్యాడిగ, హుబ్లీ మార్కెట్లకు తరలించి విక్రయాలు చేసుకోవాల్సివస్తోంది. కష్టపడి అక్కడకు పంట తీసుకెళ్లినా దళారులు దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.

వేధిస్తున్న విల్టు సమస్య : ఈసారి మిరప సాగు కాలంలో రైతులకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. కొన్నేళ్లుగా మిరప పంటను వేధిస్తున్న విల్టు సమస్య ఈసారి విజృంభించింది. పిందె, పూత దశలోనే తోటలన్నీ ఎండిపోయిన పరిస్థితి. పంటను కాపాడుకోవడానికి రైతులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అనేకసార్లు పంటకు మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగాయి.

కోత ఖర్చులు కూడా రానంతగా మిరప ధరలు నేలకు పడిపోయాయని మహిళా రైతులు చెబుతున్నారు. దక్కిన కొద్దిపంటకైనా గిట్టుబాటు ధర రాకుంటే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పదివేల హెక్టార్లలో మిరప సాగవుతోంది. ఏటా 70 వేల మెట్రిక్ టన్నుల మేర మిరప దిగుబడులు వస్తున్నా పంట విక్రయాలకు తగిన మార్కెట్ సదుపాయం లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది.

పైపైకి ఎగబాకిన మిర్చి ధరలు : రెండేళ్లుగా మిర్చి ధరలు నేలచూపులు చూడడంతో రైతులు తీవ్రంగా నష్టయపోయిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది డిసెంబరు నుంచి మిర్చి ధరలు పైపైకి ఎగబాకాయి. కర్ణాటకలోని బ్యాడిగ అంతర్జాతీయ మార్కెట్‌లో డబ్బి రకం గరిష్ఠ ధర పలికింది. ఏకంగా క్వింటాలు ధర రూ.71,199 అమ్ముడుపోయింది. బ్యాడిగ కడ్డీ రకం రూ.54 వేలు పలికింది. బ్యాడిగ రకాల్లో నాణ్యతను బట్టి సగటున రూ.55 వేల నుంచి రూ.65 వేలకు వరకు ధర పలకడంతో రైతులు పొందారు.

విత్తన రకాలైన తేజ, 5531, 2043, 273 ధరలు గత ఏడాది క్వింటాలు రూ.11 వేల లోపు ఉండేది. ఈసారి రూ.16 వేల నుంచి రూ.22 వేల వరకు అధిక ధర పలికింది. నాణ్యతను బట్టి ఒక్కో రకం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పెరిగింది. అప్పుడు మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో రైతులు తీసుకు వచ్చిన పంటను వ్యాపారులు వెంటనే కొనుగోలు చేశారు. ప్రకృతి వైపరిత్యాల కారణంగా మధ్యప్రదేశ్‌, గుజరాత్ రాష్ట్రాలతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ దేశాల్లో మిరప దిగుబడి తగ్గింది. కర్ణాటకలోను కూడా ఆశించిన స్థాయిలో సాగవ్వలేదు. ఫలితంగా మిరపకు గత కొన్ని రోజులుగా అనూహ్యంగా డిమాండ్‌ ఏర్పడింది.

కానీ ప్రస్తుతం ఇరవై రోజుల క్రితం ఉన్న ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.

మిర్చి ఎత్తుకెళ్తున్న దొంగలు - ఆందోళనలో రైతులు

చీడపీడల తాకిడిలో మిర్చి పంట - నివారణకు అధికంగా రసాయనాల వాడకం