పిల్లలు ఏడుస్తున్నారని స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? - అయితే కంటి దవాఖానాకు పోవాల్సిందే!
పిల్లల అల్లరి తట్టుకోలేక స్మార్ట్‌ఫోన్ ఇస్తున్న తల్లిదండ్రులు - యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ అలవాటు పడుతున్న చిన్నారులు - పిల్లల్లో తెలియకుండానే తలెత్తుతున్న నేత్ర సమస్యలు

Published : November 7, 2025 at 2:16 PM IST
EYE Problems In Children Due To Using Smartphones : ఓ మూడేళ్ల బాబు ఇంట్లో తరచూ ఏడుస్తున్నాడని, అల్లరి చేస్తూ అన్నం తినడానికి ఇబ్బంది పెడుతున్నాడని తల్లిదండ్రులు ఆ బాబు చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఆ బాలుడు వీడియోలు చూస్తూ కూర్చుంటే, తల్లి అతడికి అన్నం తినిపిస్తుండేది. ఇలా ఏడాది గడిచిన తర్వాత చిన్నారి కళ్ల నుంచి మెల్లగా నీళ్లు రావడం గమనించారు. కంటి వైద్యుల వద్దకు తీసుకెళ్లగా, ఫోన్ ఎక్కువగా చూడటం వల్లే ఈ సమస్య వచ్చిందని తేల్చి చెప్పారు.
పిల్లల అల్లరిని ఓర్చుకోలేని తల్లిదండ్రులు ఏడాది పాప నుంచి పదేళ్ల బాబు వరకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తూ వారికి అలవాటు చేస్తున్నారు. అల్లరి చేసినా, ఏడ్చినా, చివరకు అన్నం తినకపోయినా ఆట వస్తువులను మర్చిపోయి ఫోన్లతో బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. వీడియోలు చూస్తూ, యూట్యూబ్‌లో పాటలు చూపిస్తూ ఓదార్చుతుండటంతో చిన్నారులు క్రమంగా ఫోన్లకు అతిగా అలవాటు పడిపోతున్నారు. ఇది చిన్నారుల శారీరక, మానసిక పరిస్థితులపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతోంది.
ఫోన్లను వినియోగించడం వల్లె కంటి సమస్యలు : పిల్లల అల్లరిని అప్పటికప్పుడైతే ఫోన్‌తో మాన్పించడంలో తల్లిదండ్రులు సఫలం అవుతున్నా రానున్న రోజుల్లో వారి ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిని, సృజనాత్మకతను నాశనం చేస్తున్నది తల్లిదండ్రులే అన్న పచ్చినిజాన్ని గుర్తించలేకపోతున్నారు. రాష్ట్రంలోని ఏ కంటి వైద్య నిపుణులను పలకరించినా పిల్లలు ఎక్కువగా ఫోన్లను వినియోగించడం వల్ల కంటి చూపుపై ప్రభావం పడుతోందని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
రాత్రివేళల్లో వీడియోలు చూడటం, ఫోన్లోనే గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో తెలియకుండానే నేత్ర సమస్యలు వస్తున్నాయి. నీళ్లు కారడం, కళ్లు పొడిబారిపోవడంతో పాటు అల్సర్ వచ్చి ఇన్‌ఫెక్షన్ సైతం సోకుతోంది. 15 ఏళ్లలోపు పిల్లలు స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వాడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడకపోవడం వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ వేరే ప్రపంచంలో ఉంటూ జంక్ ఫుడ్‌ను సైతం ఎక్కువగా తింటున్నారని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు.
మార్పు తీసుకురావచ్చు
- ఓ ఉన్నతాధికారి వారంలో కేవలం ఒక రోజు మాత్రమే ఇంట్లో పిల్లలకు ఫోన్ ఇస్తారు. అదీ సెలవు రోజు మాత్రమే. గంట దాటితే వారంతట వారే ఫోన్‌ను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పేస్తారు. ఆ తల్లిదండ్రులు ఓపికతో స్మార్ట్‌ఫోన్లు, వాటి వినియోగంపై పిల్లలకు పూర్తి అవగాహన కల్పించడమే ప్రధాన ఇందుకు కారణం.
- ఓ గేమింగ్ కంపెనీ యజమానికి ఇద్దరు పిల్లలున్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ఫోన్ ఇవ్వరు. వారాంతపు సెలవులు వస్తే పర్యాటక ప్రాంతాలు, ప్రకృతిని చూపించడం కోసం తీసుకెళ్తారు.
- ఇంట్లో ఖాళీ సమయాల్లో పిల్లలకు చిత్రలేఖనం, రాయడం వంటివి అలవాటు చేయాలి. స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. చాలామంది తల్లిదండ్రులు తమ కంటే పిల్లలకే స్మార్ట్‌ఫోన్ గురించి ఎక్కువగా తెలుసని గొప్పలు చెబుతుంటారు. ఈ ధోరణి సరైంది కాదని మానసిక వైద్యులు చెబుతున్నారు.
"చిన్నతనంలో పిల్లలు మారాం చేయడం సర్వసాధారణమైన విషయమే. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ వల్ల కలిగే నష్టాలపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలి" -సంజీవరావు, ఆప్తాలమిస్ట్, మణుగూరు
నాకు అక్షరాలు సరిగా కనిపించడం లేదు! - చిన్నారుల్లో పెరుగుతున్న దృష్టిలోపం
మీ కంటి చూపు తగ్గిపోతుందా? ఇలా చేస్తే సైట్ ఈజీగా పోతుందట! మీరు ట్రై చేయండి

