ETV Bharat / state

వేసవిలో పిల్లలు ఎక్కువగా మొబైల్​ చూస్తున్నారా? - డేను ఇలా ప్లాన్​ చేస్తే ఫోన్ అస్సలు ముట్టుకోరు!

సెలవుల్లో ఇంట్లో పిల్లలు అతిగా మొబైల్ చూస్తుంటే ఇలా చేయండి - దృష్టి మరల్చేలా తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్న నిపుణులు - పిల్లలతో కాసేపు సరదాగా గడపాలని సూచన

Summer Holidays Safety Tips for Parents
Summer Holidays Safety Tips for Parents (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 18, 2026 at 4:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Summer Holidays Safety Tips for Parents : రాష్ట్రంలో వేసవి సెలవులు వచ్చి ఇప్పటికే 15 -20 రోజుల సమయం గడిచిపోయింది. ఎండల తీవ్రత నేపథ్యంలో బాల బాలికలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఉండి ఏమైనా చేస్తున్నారా? అంటే ఏమీ లేదు. వారు చేసేదల్లా ఒకే పని. వారంతా అత్యధిక సమయం సెల్​ఫోన్​కు అతుక్కుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో చరవాణి వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, మరో 25 రోజులు సెలవులు ఉండటంతో పిల్లల దృష్టి మరల్చేలా తల్లిదండ్రులు, కుటుంబీకులు పలు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అప్పట్లో కేవలం కాల్స్​ మాట్లాడటానికే పరిమితమైన మొబైల్స్,​ ఇప్పుడు మాత్రం సర్వ సమాచారం అరచేతిలో అందించే సాధనంగా మారింది. ఈ క్రమంలో పిల్లల చేతికి ఫోన్​ ఇస్తే కొన్నిసార్లు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదమూ ఉంది. వివిధ లింకుల ద్వారా బెట్టింగ్​ యాప్​లు, ఆన్​లైన్​ గేమ్స్​ రూపంలో సైబరాసురులు చిన్నారులను ఆకట్టుకోవచ్చు. అకౌంట్​లో డబ్బును కాజేసే అవకాశం దృష్ట్యా మొబైల్​ వాడకంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

మొబైల్​తో నష్టాలివే! :

  • పెరుగుతున్న స్క్రీన్​ టైంతో ఎన్నో ఆరోగ్య మార్పులు
  • అధిక కాంతి కారణంగా చూపులో స్పష్టత లోపిస్తుంది.
  • నిద్రకు దూరం అవుతున్నారు.
  • ఒత్తిడి హార్మోన్లు విడుదలై చక్కెర, రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
  • మెడ నొప్పితో పలువురు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం : వేసవి సెలవుల్లో పిల్లలు తమ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇదే మంచి సమయం అని నిపుణులు అంటున్నారు. ఇటీవల ప్రభుత్వం అన్ని చోట్ల నిర్వహిస్తున్న వేసవి శిబిరాలకు హాజరు కావొచ్చు. అక్కడ డ్యాన్సులు, డ్రాయింగ్​, సాహిత్యం, ఇతర కళల వైపు అడుగేయాలి. ప్రస్తుతం ఉమ్మడి మెదక్​, వికారాబాద్​ జిల్లాల్లో పలువురు ఈ దిశగా అడుగులు వేస్తూ ప్రత్యేకతను చాటుతుండటం గమన్హారం.

10 ఏళ్లలోపు పిల్లలైతే ఇలా చేయండి : ఉదయం అరగంట సేపు అక్షరాలు, టేబుల్స్​, కథలు తదితర వాటితో ఎంగేజ్​ చేయడం, మధ్యాహ్నం డ్రాయింగ్​, కథలు వినడం, చెప్పడం, క్రాఫ్ట్​, కొద్ది సేపు నిద్ర, సాయంత్రం ఆటలు, పార్క్​, స్నేహితులతో గడపడం, రాత్రి కుటుంబంతో గడిపేలా చూడాలి. అయితే వీటిని ప్రతిరోజు పాటించాలంటే తల్లిదండ్రులు తమ సమయాన్ని పిల్లలకు కేటాయించాల్సి ఉంటుంది.

పిల్లలతో కాసేపు సరదాగా : పిల్లలు కాస్త అల్లరి చేయగానే వారి ఏడుపు ఆపటానికి ఫోన్​ చేతికి ఇస్తుంటారు. ఇలానైనా వారిని విసికించకుండా ఉంటారనే ఆలోచనతో తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు. కానీ పిల్లలు మాత్రం దీన్నే అవకాశంగా చేసుకొని ఏడ్చి మరీ మొబైల్​ తీసుకోవాలని ఆలోచనా ధోరణి వారిలో పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా ఏడ్చినప్పుడల్లా ఎలక్ట్రానిక్​ వస్తువులు ఇవ్వకుండా, దాని నుంచి దారి మరల్చేలా చేయాలి. కేవలం ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించాలని పేర్కొంటున్నారు. ఇలా కొత్త విధానాన్ని అలవాటు చేస్తే మొబైల్​, ఎలక్ట్రానిక్​ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

సెలవుల్లో ఇలా చేయండి :

  • ఆటలు, పాటలు, చదువుతో సంబంధం ఉండే అంశాలపై దృష్టి పెట్టేలా పిల్లలను ప్రోత్సహించాలి.
  • చిన్న చిన్న నీతి కథలు, ఇతర పుస్తకాలు చదివేలా కృషి చేయాలి.
  • డ్రాయింగ్​, డ్యాన్స్​, సంగీతం, గార్డెనింగ్​, పెయింటింగ్​, క్రాఫ్ట్​ తదితర వాటిలో ఆసక్తి ఉన్న దాన్ని ఎంచుకొని నేర్చుకునేలా ప్రోత్సహించాలి.
  • కంప్యూటర్​ బేసిక్స్​, ప్రాజెక్టుల తయారీ, స్పోకెన్​ ఇంగ్లీష్​, ఫొటోగ్రఫీ తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలి.
  • రోజు మొత్తం పిల్లలు సెల్​ఫోన్​ జోలికి పోకుండా ప్రత్యేక షెడ్యూల్​ను ఏర్పాటు చేయాలి.

అరచేతిలో ఆధునిక అస్త్రం - కొత్త ఆపదలను మోసుకొస్తోన్న మొబైల్ ఫోన్

మీ పిల్లలు ఫోన్ వదలడం లేదా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!