పిల్లల విక్రయాల కేసు - లొంగుబాటులో దిల్లీ ముఠాలో కీలక సూత్రధారి ప్రియాంక
పిల్లల విక్రయాల కేసులో తప్పించుకు తిరుగుతున్న దిల్లీ ముఠాలో కీలక సూత్రధారి ప్రియాంక అన్ని వైపులా దారులు మూసుకుపోవడంతో లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం - మేరఠ్‌లో ఆమె అత్తమామలకు పోలీసులు నోటీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 1:06 PM IST
|Updated : January 10, 2026 at 1:14 PM IST
Child Trafficking Busted in Vijayawada : పిల్లల విక్రయాల కేసులో తప్పించుకు తిరుగుతున్న దిల్లీ ముఠాలో కీలక సూత్రధారి ప్రియాంక లొంగిపోనున్నట్లు తెలిసింది. నిందితురాలిని అరెస్టు చేసేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక బృందం దిల్లీకి, తర్వాత మేరఠ్‌కు వెళ్లింది. పోలీసులు వెళ్లే ముందే ప్రియాంక ఉత్తరాఖండ్‌కు పరారైంది. అన్ని వైపులా దారులు మూసుకుపోవడంతో లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మేరఠ్‌లో ఆమె అత్తమామలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని విజయవాడ వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో న్యాయవాదితో కలసి నగరానికి రానున్నట్లు తెలిసింది.
పిల్లల అమ్మకాలతో భారీ ఆర్జన : ఈమె, శిశు విక్రయాల ద్వారా భారీగా ఆర్జించినట్లు గుర్తించారు. ఈమె ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఖాతాల వివరాల కోసం సంబంధిత బ్యాంకులకు లేఖలు రాశారు. వివరాలు రాగానే లావాదేవీలను పరిశీలించనున్నారు. తదుపరి లావాదేవీలకు తావులేకుండా ఖాతాలను స్తంభింపజేయనున్నారు. వీటి విశ్లేషణతో ఇంకా ఎవరెవరితో లింకులు ఉన్నాయో బయటకు వచ్చే వీలుంది.
దిల్లీకి చెందిన ఆరుగురు నిందితులపై రౌడీషీట్లు : ఈ కేసులో నిందితులు బయటకు వచ్చినా పదేపదే ఈ నేరాలకు పాల్పడుతుండడంతో వీరిపై త్వరలో రౌడీషీట్లు తెరవనున్నారు. ఇతర రాష్ట్రాల్లో నిందితులపై ఉన్న రౌడీషీట్లు తెరిచి, వాటిని సంబంధిత స్టేషన్లకు పంపనున్నారు. ముంబయి, అహ్మదాబాద్, దిల్లీకి చెందిన ఆరుగురిపై వెంటనే రౌడీషీట్లు తెరవనున్నారు. దీంతో వీరిపై నిఘాకు ఆస్కారం ఏర్పడనుంది.
నగరానికి ప్రత్యేక బృందం : పిల్లల విక్రయాల కేసులో నిందితుడు అనిల్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. శుక్రవారం సాయంత్రం మహారాష్ట్ర నుంచి పీటీ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. గత ఏడాది మార్చిలో నమోదైన పిల్లల విక్రయాల కేసులో మహిళా స్టేషన్‌లో నమోదైన కేసులో అనిల్‌ను నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్‌లో అరెస్టయి మహారాష్ట్రలోని జైలులో రిమాండ్‌లో ఉన్న అనిల్‌ను పీటీ వారెంట్‌పై నగరానికి ప్రత్యేక బృందం తీసుకువచ్చింది.
మరో నిందితురాలు ఫరీనా : మహిళా స్టేషన్ పోలీసులు నిందితుడిని న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో కారాగారానికి తరలించారు. విక్రయాలలో మరో నిందితుడు అయిన కిరణ్ పెదనాన్న ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు రాబట్టే వీలుంది. ఇంకా అరెస్టు కావాల్సిన నూరి కోసం మరో బృందం థానే వెళ్లనుంది. మరో నిందితురాలు ఫరీనా కస్టడీ కోసం నున్న పోలీసులు పిటిషన్ వేయగా 1, 2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే వీలుంది.
కిల్లర్ ప్రియాంక వారి కుటుంబ కథాచిత్రమ్! - పిల్లల విక్రయాల సొమ్ముతో విలాస జీవితం
పోలీసుల అదుపులో సహాయకురాలు : పిల్లల విక్రయాల ద్వారా వచ్చే సొమ్మే ప్రియాంక కుటుంబానికి ఆదాయం. ఆ డబ్బుతోనే వారు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాలు బయటపెడితే కారు ఉండాల్సిందే. కీలక నిందితురాలు బాయ్‌ఫ్రెండ్స్‌నూ మార్చేస్తుందని దర్యాప్తులో తేలింది. ఇలా ఒకరు, ఇద్దరు కాదు యావత్ కుటుంబంలో అందరూ విక్రయాల కేసుల్లో నిందితులే. ఒకరు మినహా అందరూ ప్రస్తుతం జైళ్లలోనే ఉన్నారు. ప్రియాంకకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె దిల్లీతోపాటు యూపీలోని మీరట్‌లోనూ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. దిల్లీ సబర్బన్, యూపీలోని శివారు గ్రామాల నుంచి పిల్లల్ని తీసుకుని వివిధ ప్రాంతాల్లోని ముఠాలకు విక్రయిస్తుంది. ఈమె పై దిల్లీలోని పశ్చిమ విహార పోలీసు స్టేషన్, హరియాణాలోని ఫరీదాబాద్ స్టేషన్లతోపాటు విజయవాడలో మూడు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
'బలగం' సరోజిని మాయ, పసికందుల బేరసారం - అమ్మ పిలుపు కోసం తపించిన దంపతులకు శోకం

