దక్షిణాదికి బుల్లెట్ రైలు, నదుల అనుసంధానం - సదరన్ కౌన్సిల్ భేటీలో సీఎం చంద్రబాబు మార్క్ విజన్
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల గుండా వెళ్లే బుల్లెట్ రైలు కారిడార్ - దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్ డ్రై పోర్ట్‌లు - ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 7:46 AM IST
AP CM Chandrababu at Southern Council : మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. 2047 నాటికి దక్షిణ భారత రాష్ట్రాలను సమిష్టిగా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన ముఖ్యమైన ప్రతిపాదనలను సమర్పించారు.
24 అంశాలతో కూడిన ఎజెండా : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా వెళ్లే బుల్లెట్ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం, ఈ మూడు రాష్ట్రాలలో ఆర్థిక కార్యకలాపాలను మరింతగా పెంచుతుందని ఆయన వివరించారు. దక్షిణ రాష్ట్రాల కోసం ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులను ఏర్పాటు చేయడం, దక్షిణ గ్రిడ్‌ను జాతీయ పవర్ గ్రిడ్‌తో అనుసంధానించడం, విశ్వవిద్యాలయాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థల సహకారంతో ఉమ్మడి నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు.
\కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో జరుగుతున్న 31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. ఈ కీలక భేటీకి చంద్రబాబుగారితో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, ప్రతినిధులు… pic.twitter.com/KGNwzS0ewd
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 20, 2026
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం చెన్నై సమీపంలో దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ఈ కీలక ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు, ఇతర పెండింగ్ విషయాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహాయాన్ని సులభతరం చేయడానికి ఒక ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ సమావేశంలో 24 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చలు జరిగాయి.
10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ : 2047 నాటికి దక్షిణాది రాష్ట్రాలను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో 31% వాటా ఉన్న దక్షిణాది, పరస్పర సహకారంతో భారత్‌ను 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిన ఆయన, తిరుపతి, మదురై వంటి దక్షిణాది పుణ్యక్షేత్రాలను వారణాసి, అయోధ్యలతో అనుసంధానిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక, పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సమస్యలు ఇప్పటికీ తీరలేదు : రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లయినా 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తులు, అప్పుల పంపకాలు పూర్తి కాలేదని సీఎం పేర్కొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 66, 56 కింద ఉన్న ఆర్థిక సమస్యలు, వనరుల లోటు, దిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల వివాదాలను త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం హామీ ఇచ్చిన 11 జాతీయ సంస్థల్లో 10 ఏర్పాటవడం పట్ల, అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం, అమరావతి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణాల్లో కేంద్ర సహకారం కీలకమన్న ఆయన, షెడ్యూల్-13 కింద ఉన్న విశాఖ-చెన్నై కారిడార్, మూడు విమానాశ్రయాలు, కొత్త రాజధానికి రైలు అనుసంధానం పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే దుగరాజపట్నం పోర్టు, బీపీసీఎల్ రిఫైనరీ, వైజాగ్-విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, కడప జిందాల్ స్టీల్ రైలు కనెక్టివిటీకి తక్షణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నదుల అనుసంధానంతో మిగులు జలాలు : భవిష్యత్తు నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని సీఎం స్పష్టం చేశారు. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు జలాలను కావేరి బేసిన్‌కు తరలించడం ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నీటి కష్టాలు తీర్చవచ్చని ప్రతిపాదించారు. అలాగే గంగా-కావేరి అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి గంగా నది మిగులు జలాలను దక్షిణాదికి మళ్లించాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంతాల సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రాజెక్టుల డీపీఆర్‌లు, అనుమతులను నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.
రూ.16 వేల కోట్ల ఆర్థికలోటు భర్తీ : రైతు రుణమాఫీకి సంబంధించిన బకాయిలు , పెండింగ్‌లో ఉన్న బిల్లులతో సహా నాలుగు అంశాల కింద రావాల్సిన మొత్తం రూ.32,000 కోట్లలో, ఇప్పటివరకు కేవలం రూ.16,000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని పేర్కొంటూ, మిగిలిన రూ.16,000 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
వరల్డ్ ఫొటోగ్రఫీ డే - కెమెరా చేతబట్టి ‘క్లిక్’మనిపించిన సీఎం చంద్రబాబు
నేడు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం - హాజరుకానున్న సీఎం చంద్రబాబు

