ETV Bharat / state

బటన్ నొక్కడానికి రాలేదు - పేదలకు భరోసా ఇవ్వడానికే వచ్చా: సీఎం చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి - రెండేళ్లలో పింఛన్లకే రూ.73,500 కోట్లు, సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు - ఆడబిడ్డలకు త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం

Chandrababu at Pension Distribution
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 4:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chandrababu at Pension Distribution : నేను కేవలం పింఛన్లు ఇవ్వడానికి, బటన్ నొక్కడానికి ఇక్కడికి రాలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదలకు భరోసా కల్పించి, వారిలో ధైర్యం నింపేందుకే వచ్చానని ఉద్ఘాటించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సరిగ్గా 31 ఏళ్ల కిందట ఇదే రోజున తాను మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు.

బటన్ నొక్కడానికి రాలేదు, పేదలకు భరోసా ఇవ్వడానికే వచ్చా : సీఎం చంద్రబాబు (ETV Bharat)

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పింఛన్లు అందిస్తున్నామని సీఎం తెలిపారు. గడచిన రెండేళ్లలో పెన్షన్ల కోసమే రూ.73,500 కోట్లు వెచ్చించామని వివరించారు. అలాగే, మొత్తం సంక్షేమం కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా వారికి ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పేదల పట్ల తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందన్నారు. సంక్షేమం అనేది పేదవాడిని నిలబెట్టేలా ఉండాలని సూచించారు.

మహిళా సాధికారత : ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బంది పడకూడదని ఉచిత బస్సు ప్రయాణం తీసుకువచ్చామని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. మహిళలకు కష్టం రాకూడదనే ఉద్దేశంతో 'దీపం' పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని 33 శాతం రిజర్వేషన్లు తెచ్చామన్నారు. ఆర్టీసీలో మహిళా కండక్టర్ల వ్యవస్థను తానే తీసుకువచ్చానని, త్వరలో మహిళా డ్రైవర్లను కూడా ప్రోత్సహిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. నరసాపురంలో దేశంలోనే నంబర్ వన్ ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. నిన్ననే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించానని, దానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రేపు గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్తున్నామని, కొండలు, గుట్టలు తొలిచి మరీ నీటిని తరలిస్తామన్నారు. నదుల అనుసంధానంతో భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఏమాత్రం రావని భరోసా ఇచ్చారు.

తలసరి ఆదాయం పెంపు : ప్రస్తుతం మన తలసరి ఆదాయం రూ.3 లక్షలుగా ఉందని, 2047 నాటికి దానిని రూ.54 లక్షలకు చేర్చడమే లక్ష్యమని సీఎం వివరించారు. తలసరి ఆదాయం పెరిగితే ఆటోమేటిక్​గా పేదల సంపద వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదేనని, ఆ రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకులు కేవలం బటన్లు నొక్కి రోడ్లకు గుంతలు పెట్టారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, కానీ కూటమి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పెంచలేదని స్పష్టం చేశారు. తాము ఏ మంచి పని చేసినా వైఎస్సార్సీపీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్​లో భాగంగా మెగా డీఎస్సీ వేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు కోర్టులో ఏకంగా 350 కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని, మీ పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో అవసరం లేదని తేల్చి చెప్పారు.

కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తపన, అనుభవంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిలో దూసుకెళ్తోందని సీఎం అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఎన్నటికీ మర్చిపోలేనని, ఎంత సేవ చేసినా రుణం తీర్చుకోలేనని భావోద్వేగానికి గురయ్యారు. 45 ఏళ్లుగా వెనుకబడిన వర్గాలు టీడీపీకి అండగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. వడ్డెరలకు మైనింగ్ లీజులు, గౌడ కులస్తులకు మద్యం షాపులు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి మరింత వేగంగా జరగాలంటే ప్రజలు తమ సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు.

మాట ఇచ్చి నిలబెట్టుకున్నా - వెలిగొండ బంగారు కొండ అవుతుంది: సీఎం చంద్రబాబు

మీ హెల్త్​ మీ ఫోన్‌లోనే - గిరిజనుల ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రభుత్వానిది: సీఎం చంద్రబాబు