ETV Bharat / state

గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజనం - రైతుల హర్షం

ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం - నాణ్యమైన భోజనం, అల్పాహారం అందిస్తున్నామన్న యార్డు ఛైర్మన్‌ కుర్రా అప్పారావు - రైతులకు అందించే ఆహారపదార్ధాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామన్న యార్డు కార్యదర్శి

Free Meals Programme Start at Guntur Mirchi Yard
Free Meals Programme Start at Guntur Mirchi Yard (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2026 at 8:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

Free Meals Programme Start at Guntur Mirchi Yard : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే రైతులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. నేడు రైతులకు ఉచిత భోజనం పథకాన్ని ప్రారంభించారు. ఆసియాలోనే అతి పెద్దైన గుంటూరు మిర్చి యార్డ్​లో ఉచిత భోజన పథకాన్ని యార్డ్ ఛైర్మన్ కుర్రా అప్పారావు, కార్యదర్శి చంద్రిక ప్రారంభించారు.

యార్డ్​కు వందలాది మంది రైతులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారని వారి ఆకలి తీర్చేందుకు నాణ్యమైన భోజనం, అల్పాహారం అందిస్తున్నామని యార్డ్ ఛైర్మన్ కుర్రా అప్పారావు తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు రైతులకు అందించే ఆహారపదార్ధాలను తనిఖీ చేస్తామని, నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని మిర్చి యార్డ్ కార్యదర్శి చంద్రిక వివరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఉచితంగా భోజనం అందిస్తున్న కూటమి ప్రభుత్వం, అధికారుల పట్ల మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజన పథకం ప్రారంభం - రైతుల హర్షం (ETV Bharat)

"రైతుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, మేము కలిసి ఒక మెనూ రూపొందించాం. రైతుకు అందించే ఆహారం నాణ్యతగా ఉండాలని నిర్ణయించాం. దీన్ని ప్రతిరోజూ తనిఖీ చేస్తాం. ఈరోజు మధ్యాహ్నం భోజనాన్ని ప్రారంభించాం. రేపు ఉదయం అల్పాహారం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి రూ. 88.25లకు టెండర్లు దాఖలు చేశాం." - కుర్రా అప్పారావు, మిర్చి యార్డు ఛైర్మన్

"గుంటూరు మిర్చి యార్డులో ప్రతిరోజు రైతులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తాం. అలాగే ఉడకబెట్టిన గుడ్లు, గడ్డ పెరుగును అందిస్తాం.ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించటంతోపాటు రైతుల దగ్గర నుంచి ఫిడ్​బ్యాక్ తీసుకుంటాం. ఏదైన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం." - చంద్రిక, మిర్చి యార్డ్ కార్యదర్శి

"గుంటూరు మిర్చి యార్డులో ఈరోజు నుంచి ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించారు. బయట ఒక ప్లేట్ భోజనం దాదాపు రూ.150 ఉంది. ఇక్కడ ఉచితంగా అందించటం సంతోషంగా ఉంది. లేదంటే సుమారు 2 కి.మీ నడిచి వెళ్లి తినాల్సి వచ్చేది. ఇక్కడ మనస్ఫూర్తిగా తింటున్నాం." - రైతులు

గుంటూరు మిర్చి విశేషాలు ఇలా: గుంటూరు మిర్చికి ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రతీ సంవత్సరం రూ.10 వేల కోట్లకు పైనే లావాదేవీలు జరుగుతున్నాయి. సీజన్లో అయితే రోజుకు 2 లక్షల బస్తాలకు పైనే విక్రయాలు జరుగుతుంటాయి. ఏటా యార్డుకు దాదాపు 2 కోట్లు బస్తాలు వస్తుంటాయి. ఈ మిర్చి యార్డులో ప్రత్యక్షంగా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

ఉపాధి ఇలా: యార్డులో బస్తాలు దించడం, తూకం, లారీల్లోకి లోడింగ్, మిర్చి తొడిమలు తీయడం, శీతల గోదాములకు తరలించడం, నిల్వ చేయడం, ఎగుమతులకు వీలుగా బస్తాల్లో నింపడం, కంటైనర్లకు లోడ్‌ చేయడం వంటివి స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. సరకు రవాణా లారీల ద్వారా యజమానులు, డ్రైవర్లు, మధ్యవర్తులు, దిగుమతి, ఎగుమతి వ్యాపారులకు అవకాశాలు ఉంటాయి. యార్డు కేంద్రంగా జరిగే ఆర్థిక లావాదేవీలకు బ్యాంకులు, సిబ్బంది, యార్డు ఉద్యోగులు ఉంటారు. తుక్కు సేకరణ, తుక్కు నుంచి విత్తనాలు వేరు చేయడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు వంటివి చేస్తుంటారు.

'అధికారులు లేరు కదా అమ్మేద్దాం' - గోదాముల వద్దనే మిర్చి లావాదేవీలు

గుంటూరు మిర్చి యార్డుకు పోటెత్తిన సరుకు - తీసుకురావద్దన్న అధికారులు