విశాఖ తీరానికి రక్షణ కవచం - రూ.178 కోట్లతో సముద్ర కోత నివారణ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
విశాఖ నుంచి భీమిలి వరకు కోతకు గురవుతున్న 30 ప్రాంతాలు - ఆర్‌కే బీచ్‌లో రిటైనింగ్ వాల్ - పలు చోట్ల కృత్రిమ ఇసుక దిబ్బలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2026 at 11:55 AM IST
Protective Shield For The Visakhapatnam Coast : విశాఖపట్నం తీర ప్రాంతంలో దాదాపు గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సముద్ర కోత సమస్యకు పరిష్కారం దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. తుపాన్లు, వాయుగుండాల ప్రభావంతో సముద్ర అలలు ఉద్ధృతంగా తీరాన్ని ఢీకొనడం వల్ల విశాఖ నుంచి భీమిలి వరకు అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా 2007 తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమై మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణ సమతౌల్యం, తీర ప్రాంత మౌలిక వసతులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఈ నేపథ్యంలో తీర ప్రాంత కోత నివారణకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించారు. భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని రూ.250 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, కేంద్ర ప్రభుత్వం రూ.178 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ బాధ్యతను నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్‌కు అప్పగించారు.
30 ప్రాంతాల గుర్తింపు : విశాఖ నుంచి భీమిలి వరకు కోతకు గురవుతున్న మొత్తం 30 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వాటిలో ఒక ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా, మూడు ప్రాంతాలు మధ్యస్థాయి ప్రభావిత ప్రాంతాలుగా, మిగిలిన 26 ప్రాంతాలు తక్కువ తీవ్రత కలిగినవిగా వర్గీకరించారు. కోత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బయోషీల్డ్‌లుగా మడ అడవులను పెంచాలని నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాల్లో సహజ, కృత్రిమ పద్ధతుల్లో రక్షణ చర్యలు చేపట్టనున్నారు.
ఆర్‌కే బీచ్‌లో భారీ రక్షణ గోడ : అత్యంత ప్రమాదకర ప్రాంతంగా గుర్తించిన ఆర్‌కే బీచ్‌లోని గోకుల్‌పార్క్ నుంచి కురుసురా జలాంతర్గామి వరకు రూ.71 కోట్లతో ప్రత్యేక పనులు చేపట్టనున్నారు. గోకుల్‌పార్క్ వద్ద 1.1 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మించనుండగా, జలాంతర్గామి ప్రాంతంలో అర కిలోమీటరు మేర పైల్ ఫౌండేషన్ వేయనున్నారు.
పెదజాలరిపేట, మంగమారిపేట, భీమిలిలో ప్రత్యేక చర్యలు : పెదజాలరిపేటలో రూ.27 కోట్లతో తీరాన్ని పునరుద్ధరించి ఇసుక దిబ్బలను అభివృద్ధి చేయనున్నారు. మంగమారిపేటలో రూ.43 కోట్లతో సముద్ర అలల దిశ మార్చే డిఫ్లెక్టింగ్ వాల్ నిర్మించి, భారీ ఇసుక దిబ్బలను ఏర్పాటు చేస్తారు. భీమిలిలో రూ.37 కోట్లతో సముద్ర ఆవాసాల పునరుద్ధరణకు కాంక్రీట్, రీఫ్ క్యూబ్స్, సీ వాల్ నిర్మాణాలను చేపడతారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 131 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండగా, గత సంవత్సరం 25.8 కిలోమీటర్లు మాత్రమే కోతకు గురైంది. ఈ ప్రభావం 43 మత్స్యకార గ్రామాలపై పడగా, అందులో 15 గ్రామాలు తరచూ సముద్ర కోత ముప్పును ఎదుర్కొంటున్నాయి.
" ప్రతి సంవత్సరం సముద్ర కోత సమస్యతో సతమతమవుతున్న విశాఖ తీర ప్రాంత రక్షణకు దాదాపు రూ.250 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపితే రూ.178 కోట్ల పనులకు మాత్రమే ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రాథమిక నివేదికలపై సంతృప్తి చెందింది. ప్రస్తుతం డీపీఆర్ తయారు చేయాల్సి ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ దాని బాధ్యతలు తీసుకుంది." - తేజ్‌భరత్, వీఎంఆర్‌డీఏ కమిషనర్
రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుపై ప్రభుత్వం సీరియస్ - అధికారులపై చర్యలు
తీరం వెంట ఆకట్టుకునే ఆకృతులు - యోగా పండగకు ముస్తాబవుతున్న విశాఖ

