ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా రెండు జాతీయ రహదారుల విస్తరణ - రూ. 7,597.16 కోట్ల అంచనా వ్యయంతో పనులు

ప్రధాని అధ్యక్షతన క్యాబినెట్​ కమిటీలో ఆమోదం తెలిపిన కేంద్రం - దాదాపు 190 కిలోమీటర్ల వరకు నాలుగు వరుసల రోడ్డు - గంటకు 100 కిలోమీటర్లు ప్రయాణించేలా డిజైన్

కొత్తగా రెండు జాతీయ రహదారుల విస్తరణ
EXPANSION OF 2 NATIONAL HIGHWAYS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 4, 2026 at 8:42 AM IST

3 Min Read
Choose ETV Bharat

Central Gives Green signal for two highways : రోడ్ల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపించింది. వాటిలో తాజాగా రెండు కొత్త జాతీయ రహదారులకు కేంద్రం అనుమతినిచ్చింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్​ కమిటీ ఆమోదం దానికి తెలిపింది. ఆర్మూర్​-జగిత్యాల-మంచిర్యాల (ఎన్​హెచ్​-63), జగిత్యాల-కరీంనగర్​(ఎన్​హెచ్​-563) సెక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. అయితే ఈ రహదారుల అభివృద్ధి పనుల కోసం గత ఆర్థిక సంవత్సరంలోనే అవసరమైన ప్రక్రియను ఎన్​హెచ్​ఏఐ ఏర్పాటు చేసింది. తాజాగా కేంద్రం వీటికి ఆమోదం తెలపటంతో పనులు ప్రారంభం కానున్నాయి.

రద్దీ తక్కువ : ఆర్మూర్​-జగిత్యాల-మంచిర్యాల (ఎన్​హెచ్​-63), జగిత్యాల-కరీంనగర్ ​(ఎన్​హెచ్​-563) ఈ రెండు జాతీయ రహదారులను ఏర్పాటు చేయటానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల ఈ మార్గం నిజామాబాద్​, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మీదుగా వెళ్తుంది. అక్సాంపూర్​, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట, మంచిర్యాల వంటి ప్రధాన ప్రాంతాలు ఈ మార్గంలోనే ఉన్నాయి. అలాగే జగిత్యాల-కరీంనగర్​ పరిధిలో పోతారం, గంగాధర్​, కరీంనగర్​ వంటి ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధికమించటానికే ప్రస్తుతం ఈ రెండు జాతీయ రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఇక్కడ బైపాస్​ రోడ్లను నిర్మించనున్నారు. ఈ రెండు జాతీయ రహదారులను విస్తరించటంతో ఇక్కడ రాకపోకలు అంతరాయం కలగకుండా వేగం పుంజుకుంటుంది. అలాగే ఈ రోడ్లను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఇప్పటికే డిజైన్​ చేశారు.

రెండు పద్ధతుల్లో విస్తరణ పనులు : వీటిని మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఆర్మూర్​-జగిత్యాల-మంచిర్యాల రహదారి పనులను హ్యామ్​ పద్ధతిలో, జగిత్యాల-కరీంనగర్ రోడ్డును బీవోటీ పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ రెండింటినీ రూ. 7,597.16 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 190 కిలోమీటర్ల పరిధి వరకు నాలుగు వరుసల రోడ్డును విస్తరించనున్నారు. దీంతో ఆర్మూర్​-మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.

అనుసంధానత ఇలా: ప్రధానమంత్రి గతి శక్తి పథకానికి అనుగుణంగా రూపొందించిన ఈ రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులు 5 ఆర్థిక కేంద్రాలు, 7 సామాజిక కేంద్రాలు, 8 లాజిస్టిక్స్ హబ్‌లకు అనుసంధానం చేయనున్నాయి.

  • ఆర్థిక కేంద్రాలు : సిద్ధిపేట, వరంగల్ అర్బన్ ఎస్​ఈజెడ్​లు, నిజామాబాద్ సిద్దిపేటలో ఉన్న మెగా ఫుడ్ పార్కులు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిషింగ్- సీఫుడ్ క్లస్టర్.
  • సామాజిక కేంద్రాలు : వేములవాడ, కొండగట్టు, నగునూర్ కోట, ధర్మపురి, కాళేశ్వరం, లోయర్ మానేర్ డ్యామ్, ఖిలా కోట.
  • రైల్వే స్టేషన్లు : నిజామాబాద్, లింగంపేట్-జగిత్యాల్, పెద్దపల్లి, కోరుట్ల, మంచిర్యాలు, పొద్దూరు, గంగాధర, కరీంనగర్.

ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర విభాగానికి టెండర్లు : గత నెల 20వ తేదీన రెండు ప్యాకేజీలుగా విభజించిన ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్) ఉత్తర భాగంలోని పనులకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను ఆహ్వానించింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.518 కిలోమీటర్ల మేర ప్యాకేజీ-1కి టెండర్లు ఆహ్వానించారు. ప్యాకేజీ-2 కోసం, ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు 78 కిలోమీటర్లు బిడ్‌ల సమర్పణకు గడువు జూలై 7గా నిర్ణయించారు. గత నెలలో, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్​లో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు తుది ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. జాతీయ రహదారులు ఎన్​హెచ్​-63, ఎన్​హెచ్​-563తో పాటు ఆర్​ఆర్​ఆర్​ (రీజినల్ రింగ్ రోడ్) ఉత్తర విభాగానికి ఆమోదం లభిస్తుందని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో సమావేశంలో ఈ పనులకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని ఎన్​హెచ్​ఏఐ వర్గాలు అంటున్నాయి.

వేగం అందుకున్న బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు - 50 శాతం మేర పనులు పూర్తి