ETV Bharat / state

మూడు ప్రధాన అంశాలే కీలకంగా తుంగభద్ర కమిటీ అధ్యయనం!

పూడిక తీత, నవళి రిజర్వాయర్‌ నిర్మాణం, ఆర్డీఎస్‌ నుంచి నీటి మళ్లింపుపైనా దృష్టి - కేంద్ర జలశక్తి శాఖ నుంచి బోర్డుకు వర్తమానం

Central Committee on Tungabhadra to Focus on 3 key Aspects
Central Committee on Tungabhadra to Focus on 3 key Aspects (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 11:02 AM IST

2 Min Read
Choose ETV Bharat

Central Committee on Tungabhadra to Focus on 3 key Aspects: తుంగభద్రలో పూడికతీత, నవళి రిజర్వాయర్ నిర్మాణం, ఆర్డీఎస్​ నుంచి నీటి మళ్లింపు! తుంగభద్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్రం నియమించే కమిటీ ఈ మూడు అంశాలే కీలకంగా అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కొత్తగా నిర్మించే నవళి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలో కమిటీ చూపే పరిష్కారం కీలకం కానుంది.

టీఎంసీల మళ్లింపుపై అధ్యయనం: తుంగభద్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్రం నియమించే కమిటీ ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. తుంగభద్రలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడిక తొలగింపు, నవళి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం, రాజోలి బండ మళ్లింపు పథకం- ఆర్డీఎస్​లో తెలంగాణకు 15.9 టీఎంసీల మళ్లింపుపై కమిటీ అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది.

3 ప్రధాన అంశాలపై దృష్టి సారించనున్న తుంగభద్రపై కేంద్ర కమి (ETV Bharat)

గురువారం తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్​ పాటిల్ సమక్షంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో వివిధ అంశాలు చర్చించారు. సమావేశం ముగిశాక ఈ 3 అంశాలపై పూర్తి సమాచారం పంపాలని కేంద్ర జలశక్తిశాఖలోని కీలక అధికారి తుంగభద్ర బోర్డు ముఖ్యుడిని ఆదేశించారు.

కార్యరూపం దాల్చలేదు: 1989లో తుంగభద్రలో పూడిక తొలగింపుపై సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించారు. ఒక టీఎంసీ నీటి నిల్వ పెంచేలా పూడిక తీయాలంటే వంద కోట్లు అవుతుందని లెక్కగట్టారు. 2007, 2012, 2023 బోర్డు సమావేశాల్లోనూ పూడికతీతపై చర్చలు జరిగాయి. పలు ప్రతిపాదనలు ముందుకొచ్చినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. తుంగభద్రలో నీటి నిల్వ మట్టాలు 15 వందల 40 అడుగులకు 16 వందల 33 అడుగులకు మధ్య 755 మిలియన్ క్యూబిక్ మీటర్ల పూడిక వల్ల దాదాపు 26.7 టీఎంసీల నిల్వ తగ్గిపోతోంది.

ఈ పూడిక తొలగింపు, రవాణా ఇతరత్రా ఖర్చులు కలిపి 24 వేల 600 కోట్లు అవుతుందని లెక్కించారు. అంటే ఒక టీఎంసీ నీటి నిల్వ పెంచాలంటే రూ. 920 కోట్లు ఖర్చవుతుంది. ఆ పూడిక మట్టి వేసేందుకు వేల ఎకరాలు కావాలి. ఈ పరిస్థితుల్లో కేంద్ర కమిటీ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ అభ్యంతరం: తుంగభద్రలో పూడిక కారణంగా ఏర్పడిన నీటి నిల్వ నష్టాన్ని భర్తీ చేసేందుకు కర్ణాటక నవళి బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మాణానికి సిద్ధమైంది. కొప్పల్ జిల్లాలోని నవళి గ్రామంలో తుంగభద్ర జలాశయం ఎడమ వైపు నుంచి ప్రారంభమయ్యేలా 30.90 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఈ కొత్త రిజర్వాయర్‌పై ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభ్యంతరాలు తెలిపింది. ఇప్పటికే కుడి గట్టు ఎగువ, దిగువ కాలువల్లోనూ, కేసీ కాలువ కేటాయింపులకు తగ్గట్లుగా నీళ్లు రావడం లేదన్నది ఏపీ అభ్యంతరం.

నవళి రిజర్వాయర్ నిర్మిస్తే దిగువన ఉన్న ఏపీ కేటాయింపులు సరిగా వినియోగించుకోలేమని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తుంగభద్ర డ్యాం నుంచి తమకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అనుమతిస్తే తప్ప నవళికి అంగీకారం చెప్పలేమని ఏపీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర కమిటీ చూపే పరిష్కారం కీలకం కానుంది.

తుంగభద్ర నది మూడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది: సీఎం చంద్రబాబు

కొత్తగేట్ల అమరికతో తుంగభద్ర జలాశయానికి సరికొత్త రూపు