అయేషా మీరా హత్య కేసులో కోర్టు కీలక తీర్పు - అవశేషాలను కుటుంబానికి అప్పగించాలని ఆదేశం
అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు - వైద్య బృందం సేకరించిన అవశేషాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశం - ఫిబ్రవరి 27న తెనాలిలో మతపరమైన ఆచారాలతో అంత్యక్రియల నిర్వహణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 9:43 PM IST
CBI Court Issue Key Orders in Ayesha Meera Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ (CBI) అధికారులు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక (ఫైనల్ రిపోర్ట్)ను న్యాయస్థానం ఆమోదించింది. నివేదికను పరిశీలించిన అనంతరం కేసును క్లోజ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండవ సారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం, ఆ శరీర అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు.
తమ కుమార్తె శరీర అవశేషాలను అప్పగించాలని కోరుతూ ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా తమ న్యాయవాది శ్రీనివాస్ ద్వారా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ తల్లిదండ్రుల విజ్ఞప్తిని అనుమతించారు. ఫిబ్రవరి 27వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు బాధిత తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని ఆమె ఆదేశించారు.
కోర్టులో గుర్తింపు పంచనామా జరిపిన అనంతరం, ప్రాసిక్యూషన్ వారు అవసరమైన భద్రత, సరైన వాహన సదుపాయం కల్పించి తల్లిదండ్రులతో పాటు వారి స్వస్థలమైన తెనాలికి వెళ్లాలని కోర్టు సూచించింది. తెనాలిలోని స్మశాన వాటికలో వారి మతాచారం ప్రకారం ఆయేషా మీరా ఆఖరి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించాలని అధికారులను ఆదేశించింది. ఈ అంత్యక్రియల ప్రక్రియ మొత్తం సరైన పద్ధతిలో జరుగుతున్నట్లు రికార్డ్ చేయాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఆ సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే: విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో 2007 డిసెంబర్ 27 తెల్లవారుజామున బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన 9 నెలల తర్వాత 2008 ఆగస్టులో సత్యంబాబును నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు, అత్యాచారం నేరం కింద 10 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ 2010 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది.
అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 నవంబర్లో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేసు మళ్లీ మొదటికే వచ్చినట్లయింది.
18 ఏళ్లుగా మిస్టరీగానే - విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు
ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐకి ఏపీ హైకోర్టు నోటీసులు - కౌంటర్ దాఖలుపై ఉత్తర్వులు

