హైకోర్టు ఆదేశాలతోనే జగన్ అక్రమాస్తులపై కేసు - 'దాల్మియా సిమెంట్స్' పిటిషన్‌పై సీబీఐ వాదనలు
హైకోర్టు బెంచ్ ఉత్తర్వుల మేరకే జగన్ అక్రమాస్తులపై కేసు నమోదైంది - దాల్మియా వ్యవహారంలోనూ ఆధారాలున్నాయి - తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సీబీఐ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 8:04 AM IST
YS Jagan Disproportionate Assets Case Updates : ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు బెంచ్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకే జగన్‌కు చెందిన అక్రమాస్తులపై కేసు నమోదైందంటూ సీబీఐ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఇందులో భాగంగా నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పలు కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దాల్మియా వ్యవహారంలోనూ సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పరిశీలించి, ఆధారాలున్నందున న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని తెలిపింది.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అక్రమంగా లీజులు పొందినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో రూ.95 కోట్ల పెట్టుబడులు పెట్టిందన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదయ్యాయని, ఇందులో నిజమైన పెట్టుబడిదారులు ఎవరో గుర్తించి, వారిని మినహాయించాలని న్యాయస్థానం చెప్పిందన్నారు. ఈ ఆదేశాల ప్రకారం జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలువురిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు.
కౌంటరు ఎలా దాఖలు చేస్తారు : కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407.05 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల కోసం జయా మినరల్స్ పెట్టిన లీజు దరఖాస్తును మూడు నెలల్లో ఈశ్వర్ సిమెంట్స్‌కు బదిలీ చేయాలన్న షరతుతో అప్పటి ప్రభుత్వం ఆమోదించిందని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పూర్తి వివరాలతో అదనపు కౌంటరు దాఖలు చేశామని చెప్పగా, న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. క్రిమినల్ పిటిషన్‌లో కౌంటరు ఎలా దాఖలు చేస్తారని, ఆ నిబంధన ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
రికార్డులో లేని డాక్యుమెంట్లు కోర్టుకు : సీబీఐ న్యాయవాది సమాధానమిస్తూ గతంలో విచారించిన మరో బెంచ్ ఆదేశాలతో కౌంటరు దాఖలు చేశామన్నారు. పిటిషనర్ రికార్డులో లేని డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారని, వాటికి సమాధానం ఇవ్వడానికి కౌంటరు దాఖలు చేశామని తెలిపారు. పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలను ఇదే హైకోర్టు గతంలో ఇతర కేసుల్లో తేల్చివేసిందని గుర్తుచేశారు. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడాన్ని హైకోర్టు సమర్థించిందన్నారు.
ఈ పిటిషన్‌ను కొట్టివేయాలనడం సరికాదు : పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ తాము కాగ్నిజెన్స్‌ను సవాలు చేయలేదన్నారు. సీబీఐ ఆరోపించినట్లు దాల్మియా సిమెంట్స్ నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. వాస్తవ పెట్టుబడుదారులను గుర్తించాలని హైకోర్టు పేర్కొన్నప్పటికీ దానికి విరుద్ధంగా సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. గతంలో కొందరి పిటిషన్లను ఇదే హైకోర్టు కొట్టివేసిందని, మరికొన్నింటిని అనుమతించిందన్నారు. వాటి ఆధారంగా ఈ పిటిషన్‌ను కొట్టివేయాలనడం సరికాదని, ఇందులో అంశాలు వేరుగా ఉన్నాయనగా న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.
రాజధానిపై మళ్లీ అదే మాట - అక్కసు వెళ్లగక్కిన జగన్
గవర్నర్‌ను కలిసేందుకూ అదే దాదాగిరి - కోటి సంతకాలను సమర్పించడానికి వెళ్లిన వైఎస్ జగన్

