'పులివెందుల వెళ్లేందుకు శివశంకర్‌రెడ్డికి అనుమతి ఇవ్వొద్దు' - కోర్టుకు సునీత, సీబీఐ విజ్ఞప్తి
శివశంకర్‌రెడ్డి పిటిషన్‌పై సీబీఐ, సునీతల అభ్యంతరం - బెయిల్ షరతులు సడలించొద్దని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి - అక్కడి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 11:55 AM IST
CBI and Sunitha Object to Petition Filed by Sivashankar Reddy : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదో నిందితుడైన డి.శివశంకర్‌రెడ్డిని సొంతూరు పులివెందుల వెళ్లడానికి అనుమతించవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థతో పాటు వివేకా కుమార్తె సునీత హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు నివేదించారు. స్థానిక సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 79 ఏళ్ల తల్లి వెన్నునొప్పితో బాధపడుతున్నారని, 2025లో శస్త్రచికిత్స విజయవంతం కాలేదని, అందువల్ల మరోసారి శస్త్రచికిత్స చేయించడానికి నెల రోజులపాటు పులివెందుల వెళ్లడానికి అనుమతిస్తూ బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ శివశంకర్‌రెడ్డి హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పిటీషనర్ వివేకా హత్యకుట్రతో పాటు సాక్ష్యాల చెరిపివేతలో కీలకపాత్ర పోషించారని పేర్కొంది. ఈ కేసులో సాక్షులందరూ ఆ ప్రాంతంలోనే ఉన్నారని, నెలరోజులపాటు పిటీషనర్ అక్కడే ఉంటే వారిని ప్రభావితం చేయగలరని పేర్కొంది. శివశంకర్‌రెడ్డి అక్కడికి వెళ్లడం కంటే ఆయన తల్లిని హైదరాబాద్‌కు తీసుకురావడం వల్ల ఉపయోగం ఉంటుందని, అందువల్ల పిటిషన్‌ను కొట్టేయాలని కోరింది.
అది వాస్తవం కాదు : సునీత తరఫున ఆమె న్యాయవాది ఎస్.గౌతమ్ కౌంటర్ దాఖలు చేశారు. గత ఏడాది జరిగిన శస్త్రచికిత్స విఫలమైందన్నది వాస్తవం కాదని, దీనికి ఆధారాల్లేకుండా షరతులను సడలించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. సాక్షుల రక్షణ కోసమే అక్కడకు వెళ్లరాదన్న షరతు విధించారని గుర్తుచేశారు. శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి, కోడలు ఇద్దరూ డాక్టర్లేనని వాళ్లు కడపలో ఆస్పత్రి నడుపుతున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక చికిత్స అవసరమైతే హైదరాబాద్ తీసుకురావచ్చన్నారు. లేదంటే కడపలో వారి కుటుంబ ఆస్పత్రిలో కాకుండా పులివెందులలో చికిత్స అందించడానికి అన్న కారణం చెప్పడంలో అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవాలు వెల్లడించకుండా, వైద్య రికార్డులు సమర్పించకుండా బెయిల్ షరతులను సడలించరాదని శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణను ఈ నెల ఐదోతేదీకి వాయిదా వేసింది.
రెండేళ్ల తర్వాత మళ్లీ : అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రెండేళ్ల తర్వాత మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. కిరణ్ యాదవ్‌కి - అర్జున్ రెడ్డికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై కూడా కూపీ లాగుతున్నారు. పులివెందులలో కిరణ్ యాదవ్, మహేంద్ర యాదవ్‌ను ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు తనను చంపాలని కుట్ర చేస్తున్నారని సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 2 ఏళ్ల తర్వాత సీబీఐ మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్, సాక్షిగా ఉన్న భరత్ కుమార్ యాదవ్ సోదరులు కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్‌లను పులివెందుల పోలీస్ స్టేషన్లో సీబీఐ అధికారులు విచారించారు. విచారణకు తొలుత మహేంద్ర హాజరు అయ్యారు. అనంతరం కిరణ్ వచ్చారు. వివేకా హత్య చోటు చేసుకున్న రోజు తెల్లవారుజామున 1.42 గంటలకు అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి కిరణ్ కుమార్ వాట్సప్ కాల్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ పై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే కిరణ్‌కి మహేంద్రకి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై కూడా విచారించారు.
కిరణ్ బంధువు కావడంతో గతంలో ఫోన్లో మాట్లాడుకున్నట్లు మహేంద్ర సమాధానం ఇచ్చారు. కిరణ్ తన సోదరుడు సునీల్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వీరిని 2 గంటల పాటు సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ విచారించారు. కాల్ డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు.
వివేకా హత్య కేసు - ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని సీబీఐకి సుప్రీం ఆదేశం
కల్తీ నెయ్యి కేసు, వివేకా హత్య కేసులో సిట్ తీరుపై సందేహాలు - ఈ కుట్రల వెనకున్న ‘అదృశ్య’ శక్తులెవరో?

