ETV Bharat / state

డ్రైవర్ హత్య కేసులో సాక్షులకు బెదిరింపులు - ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు నమోదు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు నమోదు - డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించారని సర్పవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన నలుగురు సాక్షులు - అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులు

Case_registered_on_MLC_Ananthababu
Case_registered_on_MLC_Ananthababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 21, 2026 at 10:05 PM IST

2 Min Read
Choose ETV Bharat

Case Registered on MLC Ananthababu for Threatening Witnesses: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని నలుగురు సాక్షులు కాకినాడ సర్పవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దుర్గాశివప్రసాద్‌, మణికంఠ, వెంకటేశ్‌, పవన్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు కాకినాడలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అప్పటికే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ఎమ్మెల్సీ అంగీకరించినా: 2022 మే 19 రాత్రి 10 గంటల సమయంలో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యాన్ని కారులో తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపారు. మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేశారు. ఈ ఉదంతాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని యత్నించారు. ఇదే విషయాన్ని మృతుని తల్లిదండ్రులకూ చెప్పారు. సుబ్రహ్మణ్యం ఒంటిపై గాయాలు చూసి ఇది హత్యేనని వారు నిలదీయడం, ఎస్సీ సంఘాల ఆందోళనలతో అప్పట్లో సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శరీరంపై 31 గాయాలు, అంతర్గతంగా మరో మూడు తీవ్ర గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో ఉన్నా, తానే హత్య చేశానని అనంతబాబు అంగీకరించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీకి మరికొందరు సాయం చేశారనీ, వారినీ అరెస్ట్‌ చేయాలని మృతుని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

మూడురోజుల తర్వాత కేసు నమోదు: సుబ్రహ్మణ్యం హత్య జరిగిన 3 రోజులకు గానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. అప్పటికే అనంతబాబు నివాసముండే శంకర్‌ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌లో కొన్ని సీసీటీవీ ఫుటేజీలను మాయం చేశారు. గతంలో వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల నుంచి 60 ఫుటేజీలను సేకరించారు. వీటిలో కేవలం 18 మాత్రమే విజయవాడలోని ప్రాంతీయ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. వీడియోలు క్వాలిటీ లేకపోవడం, చీకటిగా ఉండటంతో పూర్తిస్థాయిలో విశ్లేషించలేమని, కొంత సమాచారమే ఇవ్వగలమని వారు తెలిపారు. ఆధునిక పరికరాలున్న సెంట్రల్‌ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండా పోలీసులు ఆలస్యం చేశారు. కేసు విచారణ, నిరూపణకు కావాల్సిన సెల్‌టవర్‌ డంప్‌లు, CDRలు తీసుకోలేదు. లోపభూయిష్టంగా ఛార్జిషీట్ వేశారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన సిట్‌ కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను సేకరించింది. హత్యకు ముందు, తర్వాతి రోజుల దృశ్యాలన్నీ వందల గంటలు ఉండగా, నిశితంగా పరిశీలించింది. హైదరాబాద్‌, చెన్నై సెంట్రల్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అనంతబాబు, ఆయన భార్య కలిసి హత్య జరిగిన ప్రదేశం, అనంతరం అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు సిట్‌ శాస్త్రీయ నివేదిక ఇచ్చింది. సుబ్రహ్మణ్యం శరీరంపై చీలికలు, దెబ్బలున్నాయని., 2-3 బలమైన వస్తువులతో దాడి చేశారని ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు. భుజం దగ్గర చేతి గోళ్ల రక్కులున్నాయని, హత్యలో ఇద్దరు ముగ్గురు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. తీవ్రగాయాలు, షాక్‌, భయం, ఒత్తిడి కలిసి మరణానికి దారితీసి ఉండొచ్చని ఫోరెన్సిక్ అధికారులు వివరించారు.

నిందితుడితో పోలీసులు కుమ్మక్కు - డ్రైవర్​ సుబ్రహ్మణ్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సుబ్రహ్మణ్యం హత్యలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర - ఛార్జిషీట్‌లో పేర్కొన్న సిట్​