జగన్ ఫ్లెక్సీ ముందు జంతు బలి - పోలీసుల అదుపులో వైఎస్సార్సీపీ నాయకులు
జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ - విమర్శల వెల్లువ- ఎట్టకేలకు పోలీసులు అదుపులో వైఎస్సార్సీపీ నాయకులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 1:55 PM IST
Case Filed Over Animal Scarification Issue in Jagan Birthday Celebrations : మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తులు వికృత చేష్టలకు పాల్పడిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలు అరాచకం సృష్టించారు. జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. రప్పారప్పా అంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రాశారు. ఆ తంతును వీడియో తీశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. దీంతో పోలీసులు శనివారం ఉదయం చోడవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇందుకు పాల్పడిన రమేష్, నవీన్, సాయి సహా ఏడుగురిని నల్లజర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఫ్లెక్సీల ముందు మేకపోతుల్ని బలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. మేకపోతుల్ని బలి ఇచ్చే వీడియోలతో భయభ్రాంతులకు గు రిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేసి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
వికృత చేష్టల వైస్సార్సీపీ నాయకుల అరెస్ట్ : అనంతపురం జిల్లా ముదిగుబ్బలోని దొరిగల్లు గ్రామంలో జగన్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫ్లెక్సీల దగ్గర పొట్టేళ్లను వేటకొడవళ్లతో నరికి రక్తాభిషేకం చేసిన కేసులో పదిమంది వైఎస్సార్సీపీ నాయకులను ముదిగుబ్బ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా గట్టిగా కేకలు వేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించడంతో అరెస్టు చేసినట్లు సీఐ శివరాముడు తెలిపారు. అరెస్టు అయిన వారిలో దొరిగల్లుకి చెందిన మునిచంద్ర, మహేష్, మల్లేష్, నరసింహులు, రామాంజనేయులు, సతీష్‌కుమార్, మల్లికార్జున, రమేష్‌రెడ్డి, ఓంప్రకాష్, శ్రీకాంత్ ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కదిరి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
17 మంది కార్యకర్తల బైండోవర్ : ఈనెల 21న మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రామగిరి మండలం పోలేపల్లి, కొండాపురం గ్రామాల్లో మూగజీవాలను వేటకొడవళ్లతో నరికి, గ్రామాల్లో అలజడి సృష్టించిన వైఎస్సార్సీపీ శ్రేణులపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసులు నమోదైన వ్యక్తులను శుక్రవారం రామగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ సురేష్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేశారు.
ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణం సీజ్ : రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీని ప్రింట్ చేసినందుకు నల్లజర్లలో రాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని సీజ్ చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపారు. ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ‘2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని’ అనే వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీని ఆదివారం ఏర్పాటు చేశారు. దీనిపై గ్రామస్థులు, టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఆరుగురు వ్యక్తులు, ప్రింటింగ్ దుకాణంపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
కత్తులతో హల్‌చల్ : మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లా విందూరు గ్రామానికి చెందిన కొందరు యువకులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను, ప్రజలకు భయాందోళన కలిగించేలా ఫొటోలు షేర్ చేయడంతో శుక్రవారం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గ్రామీణ ఎస్సై తిరుపతయ్య వివరాల మేరకు గ్రామానికి చెందిన యువకులు గ్రామంలో రోడ్లపై కత్తులతో హల్‌చల్ చేశారు. ఈ సందర్భంగా కేక్ కోసి టపాకాయలు పేలుస్తూ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రజలను భయాందోళనకు గురిచేశారు. పట్టణానికి చెందిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు లల్లూ ఫిర్యాదు మేరకు యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మారణాయుధాలతో ప్రదర్శనలు - చట్టపరంగా చర్యలు తీసుకోవాలి: పల్లా శ్రీనివాసరావు
గర్భిణిపై వైఎస్సార్సీపీ కార్యకర్త దాడి - అరెస్టు చేసిన పోలీసులు

