ETV Bharat / state

ఆపరేషన్ టేబుల్‌పై కార్డియాక్ అరెస్ట్​ - పేషెంట్​ను సురక్షితంగా కాపాడిన డాక్టర్లు

అత్యంత క్లిష్ట పరిస్థితిని అధిగమించి సర్జరీ చేసిన వైద్యులు - శస్త్రచికిత్స విజయవంతం చేసిన అస్టర్ ప్రైమ్ ఆసుపత్రి న్యూరో బృందం - చాకచక్యంగా వ్యవహరించి పేషెంట్​ను కాపాడిన తీరు

Aster Prime Hospital
Aster Prime Hospital in hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 10:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Aster Prime Hospital in hyderabad : బ్రెన్​ ట్యూమర్ శస్త్రచికిత్స చేస్తుండగా మధ్యలో పేషెంట్ గుండె ఒక్కసారిగా ఆగిపోవడంతో సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. అయితే సుమారు గంట పాటు నిరంతర ప్రయత్నాలతో హార్ట్​బీట్​ను పునరుద్ధరించి, సర్జరీని అస్టర్​ ప్రైమ్​ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్​ను సురక్షితంగా కాపాడిన అరుదైన ఘటన హైదారాబాద్​ నగరంలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌కు చెందిన 43 ఏళ్ల కార్పెంటర్ (బరువు 82 కిలోలు), మధుమేహంతో బాధపడుతూ కుడి వైపు బ్రెన్​ ట్యూమర్ తొలగింపుకు శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డా. పి. రంగనాధం ఆధ్వర్యంలో డాక్టర్ ప్రవీణ్ చంద్ర, డాక్టర్ లంకా కృష్ణ, సీనియర్ అనస్థీషియా నిపుణులు మల్టీడిసిప్లినరీ బృందం కలిసి ఆపరేషన్ చేశారు.

ఓపెన్ బ్రెయిన్ సర్జరీ : సర్జరీ ప్రారంభమై సుమారు 60 నిమిషాల తర్వాత, ట్యూమర్ కొంత భాగం తొలగించి మెదడు భాగాన్ని తెరిచిన సమయంలో అకస్మాత్తుగా గుండె స్పందన తీవ్రంగా పడిపోయి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఓపెన్ బ్రెయిన్ సర్జరీ జరుగుతున్న సమయంలో సీపీఆర్ నిర్వహించడం వైద్యులకు అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. మెదడు లోపలి ఒత్తిడిని నియంత్రించేందుకు తలను ఎత్తి ఉంచిన పరిస్థితిలోనే శస్త్రచికిత్స జరుగుతుండగా, వెంటనే ఆపరేషన్ టేబుల్‌ను సమతల స్థితికి మార్చి అత్యవసర పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చి గుండె స్పందన : డిఫిబ్రిలేటర్‌తో మూడు సార్లు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చి గుండె స్పందనను తిరిగి ప్రారంభించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. దాదాపు గంట పాటు వైద్య బృందం అహర్నిశలు శ్రమించడంతో చివరకు గుండె స్పందన సాధారణ స్థితికి చేరింది. ఈ సంక్షోభ పరిస్థితి మధ్య శస్త్రచికిత్సను నిలిపివేయకుండా వైద్యులు ధైర్యంగా కొనసాగించారు. తల ఎముక భాగాన్ని బయటకు తీసి, మెదడును రక్షించే ‘డ్యూరా’ పొరను పక్కకు జరిపిన స్థితిలో మెదడు వాపు ప్రారంభమైంది.

ఆ సమయంలో కనిపించిన మెదడు స్పందనలు రక్తప్రసరణ సక్రమంగా కొనసాగుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. అనంతరం మిగిలిన ట్యూమర్‌ను పూర్తిగా తొలగించారు. శస్త్రచికిత్స సమయంలో పరీక్షించిన కార్డియాలజిస్ట్ పేషెంట్​కు ఎలాంటి ప్రధాన గుండె సమస్యలు లేవని తెలిపారు. డాక్టర్​ పి. రంగనాధం మాట్లాడుతూ, తన 44 ఏళ్ల వైద్య అనుభవంలో ఇది అత్యంత ఉత్కంఠభరితమైన సంఘటన అని సన్నద్ధత, సమన్వయం, టీమ్​వర్క్​ ఇవే రోగిని మృత్యువు నుంచి కాపాడగలిగాయి అని పేర్కొన్నారు.

పూర్తిగా స్పృహతో ఆరోగ్యంగా : తరువాతి రోజు ఉదయం రోగిని వెంటిలేటర్ నుంచి తొలగించగా, ఆయన పూర్తిగా స్పృహతో ఆరోగ్యంగా ఉన్నారు. న్యూరోలాజికల్‌గా ఎలాంటి లోపాలు లేకుండా వేగంగా కోలుకున్నారు. కుడివైపు మెదడు శస్త్రచికిత్సల్లో సాధారణంగా ఎదురయ్యే ఎడమవైపు బలహీనత కూడా కనిపించలేదు. మంచి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన పేషెంట్​ ప్రస్తుతం డాక్టర్ల ఫాలోఅప్‌లో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

క్యాన్సర్ మరణశాసనం కాదు - శరీరం చెప్పే మాట వినాలి : మెగాస్టార్ చిరంజీవి

న్యుమోనియాకు అల్ట్రా రాపిడ్ ఎక్మోతో ట్రీట్​మెంట్ - బాలిక ప్రాణాలు కాపాడిన 'కిమ్స్ కడల్స్'