ఎటుచూసినా వాహనాలు, భారీ యంత్రాలు - శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు
అమరావతిలో నిర్మాణ పనుల్లో పుంజుకున్న వేగం - శరవేగంగా సాగుతున్న రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పనులు - రాజధానిలో దర్శనమిస్తున్న భారీ యంత్ర సామగ్రి, వేల మంది కార్మికులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 22, 2025 at 3:43 PM IST
Amaravati Development Works Speed Up: అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రాజధానిలో ఏ వైపు చూసినా వేల మంది కార్మికులు, వాహనాలు, యంత్రాలు, భారీ నిర్మాణ సామగ్రి దర్శనమిస్తున్నాయి. రాజధాని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, ట్రంక్ రోడ్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జిలు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీసు అధికారుల భవన సముదాయాల పనులు వేగంగా జరుగుతున్నాయి.
దానితోపాటు మరో వైపున రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధికీ శరవేగంగా ఎల్‌పీఎస్ లేఔట్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న లేఔట్‌లలో జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు రోడ్లు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు చేసే పనులను చేస్తున్నారు. ఏపీ ఎన్‌ఆర్‌టీ, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
శరవేగంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పనులు: అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీ నెస్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పైల్ ఫౌండేషన్ పనులు పూర్తి కావడంతో బేస్‌మెంట్ ఏర్పాటు చేయటం కోసం ప్రస్తుతం కార్మికులు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును మొత్తం 12 టవర్స్‌తో 2 బేస్‌మెంట్‌లు, గ్రౌండ్ ఫ్లోర్+ 18 ఫ్లోర్‌లుగా నిర్మాణం చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్‌కు 4 లేదా 6 ప్లాట్లను నిర్మాణం చేయనున్నారు. మొత్తం 1200 ప్లాట్లు నిర్మించనున్నారు. మొత్తం 29.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సమాయత్తమైంది. ముందుగా నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అదే విధంగా ఆ ప్రాంతంలో రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలను తీసుకుంది. ప్రస్తుతం అమరావతిలో విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయలకు వెళ్లే రోడ్లను మొదటి విడతలోనే నిర్మించనున్నారు. రాజధాని గ్రామాల్లో సీఆర్డీఏ కాంపిటెంట్ అథారిటి కార్యాలయాలు ఏర్పాటవ్వడంతో రైతులు విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ పరిణామాలన్నింటిపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయటమే కాకుండా అక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనను సైతం పక్కన పెట్టారు. గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా అసలు పట్టించుకోలేదు. అమరావతిపై కక్షతో అక్కడి ప్రజలను వైఎస్సార్సీపీ సర్కార్ విస్మరించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అమరావతి నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు : కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో భూములను కేటాయించారు. అయితే వాటి నిర్మాణాలు ప్రారంభం కావాలంటే అక్కడకు చేరుకునే రహదారులు పూర్తి చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ యంత్రాంగం వీటిపై దృష్టి సారించాయి. అందుకు అనుగుణంగా నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. జనవరి నుంచి అన్ని పనులు పూర్తిస్థాయిలో ఊపందుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం రాజధానిలో చేపడుతున్న పనులపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి 11 గ్రామాల్లో సీఆర్డీఏ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. రాజధాని భూ సమీకరణ సమయంలో ఉన్నటువంటి సీఆర్డీఏ కార్యాలయాలను జగన్ సర్కార్ నిర్ధాక్షిణ్యంగా తీసివేసింది. అంతేకాకుండా తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ అన్నదాతలను పట్టించుకునే వారు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో సీఆర్డీఏ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
సకాలంలో కౌలు అందజేత: అమరావతికి భూములు ఇచ్చిన కర్షకులకు కౌలు సకాలంలో అందిస్తున్నారు. కౌలుకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే స్థానిక సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను విక్రయించాలంటే రిజిస్ట్రేషన్లు సైతం వీటిలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. వీటిద్వారా అన్నదాతలకు మంచి సౌలభ్యం కల్పించినట్లయింది.
అమరావతి అభివృద్ధికి భారీగా బడ్జెట్ - పనులకు త్వరలో టెండర్లు
రాజధాని ప్రాంతంలో వేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు - ముళ్లకంపలు, చెట్ల తొలగింపు

