అమరావతిలో భూకేటాయింపులపై 22 అంశాలపై చర్చ - 7 కొత్త ప్రతిపాదనలు
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం - పాల్గొన్న మంత్రులు నారాయణ, కొల్లు, కందుల, సంధ్యారాణి - సీఆర్‌డీఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 8:43 PM IST
Cabinet Sub Committee meet on Land Allocations to Companies: సీఅర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. భూ సమస్యల పరిశీలన, రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం తదితర అంశాలపై చర్చించారు. అమరావతిలో గతంలో వివిధ సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రారంభించలేని సంస్థలు, అదనపు స్పేస్ కోరిన వాటిని పరిశీలించి వాటికి క్లియరెన్స్‌లు ఇచ్చామని తెలిపారు. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా బ్యాంకులు, వివిధ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలకు చెందినవి ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో మొత్తం 22 అంశాలపై చర్చ జరిగిందని వీటిలో 7 కొత్త ప్రతిపాదనలు ఉన్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 11 ప్రతిపాదనల్లో మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. బ్యాంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం అడిగిన వాటిని క్లియర్ చేశామని అన్నారు. మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణిలు ఈ భేటీలో పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలోని అనేక సంస్థలను ఇబ్బంది పెట్టింది. గత ప్రభుత్వ విధానాల వల్ల అనేక సంస్థలు పనులు ప్రారంభించలేదు. ఆయా కంపెనీల భూ అవసరాలు గుర్తించి అనుమతులు ఇచ్చాం. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా బ్యాంకులు, వివిధ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలకు చెందినవి ఉన్నాయి.- పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి
సీఆర్డీఏ పరిధిలో భూకేటాయింపులపై ఈ భేటీలో చర్చించడం జరిగింది. 22 అంశాలపై చర్చించాం. ఇందులో 7 కొత్త ప్రతిపాదనలు ఉన్నాయి. మరో 11 ప్రతిపాదనల్లో మార్పులు చేయడం జరిగింది. బ్యాంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం వారు భూమిని కొంత అడిగారు. అడిగిన వాటిని క్లియర్ చేశాం. అదే విధంగా ఇప్పటి వరకు కేటాయించిన భూముల్లో ఆయా సంస్థలు ఎంత వరకు పని మొదలు పెట్టారు అవి ఎక్కడి వరకు వచ్చాయి అనే దానిపై ఈ రోజు మంత్రులందరం చర్చించడం జరిగింది.- నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
వేగంగా నిర్మాణ పనులు : మరోవైపు అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకున్న సంగతి తెలిసిందే. రాజధానిలో ఏ వైపు చూసినా వేల మంది కార్మికులు, వాహనాలు, యంత్రాలు, భారీ నిర్మాణ సామగ్రి దర్శనమిస్తున్నాయి. రాజధాని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, ట్రంక్ రోడ్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జిలు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీసు అధికారుల భవన సముదాయాల పనులు వేగంగా జరుగుతున్నాయి. దానితోపాటు మరో వైపున రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధికీ శరవేగంగా ఎల్‌పీఎస్ లేఔట్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న లేఔట్‌లలో జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు రోడ్లు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు చేసే పనులను చేస్తున్నారు. ఏపీ ఎన్‌ఆర్‌టీ, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
అమరావతి రైతులకు గుడ్‌న్యూస్ - వీధి పోట్ల సమస్యకు పరిష్కారం
ఎటుచూసినా వాహనాలు, భారీ యంత్రాలు - శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు

