వారానికి ఒకరోజు నో వెహికల్ డే - ప్రధాని పొదుపు చర్యలపై కేబినెట్ భేటీలో కీలక చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం - దాదాపు 40కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలపిన మంత్రివర్గం - ప్రధాని మోదీ పొదుపు పిలుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చ

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2026 at 3:16 PM IST
|Updated : May 14, 2026 at 5:13 PM IST
AP Cabinet Meeting with Over 40 Agenda Items: ప్రధాని మోదీ పొదుపు చర్యల పిలుపుపై ఈ రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. దాదాపు నాలుగు గంటలు జరిగిన ఈ సమావేశంలో 40కిపైగా అజెండా అంశాలపై చర్చించారు. ఇప్పటికే తమ కాన్వాయ్ వాహనాలు తగ్గించాలని భద్రత సిబ్బందికి ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ సహా మంత్రులు ఆదేశాలు ఇవ్వగా అధికారులు, ఆ దిశగా చర్యలు తీసుకుని కాన్వాయ్‌ని తగ్గించారు. అలానే కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని ఇతర మార్గాలు చూడాలని ఇంక ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కల్పించే కీలక అంశంపై చర్చించారు. భారీ పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, శుద్ధ ఇంధన ప్రాజెక్టులు, మౌలిక వసతుల విస్తరణపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కీలక ప్రాజెక్టులకు కేబినెట్ పచ్చజెండా: తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 1 లక్ష కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51 వేల కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12 వేల కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఉంపింది. 39 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ మోడల్‌లో కర్నూలు విమానాశ్రయం అభివృద్ధి ప్రతిపాదనలపై చర్చించారు. వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్ చర్చించింది. విద్యుత్ సంస్థల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ, అగ్రిగోల్డ్ కేసులపై ప్రత్యేక బృందం నియామకం వంటి అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సాగునీటి కాలువల విస్తరణ, రహదారులు, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించింది. శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్, బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది. శుద్ధ ఇంధన రంగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టేలా చర్యలు తీసుకోనుంది.
కృతజ్ఞత చాటే సమయం వచ్చింది: నాదేశం - నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని సూచించారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా పర్యటనలలోనూ మంత్రులు కాస్ట్ కటింగ్ పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల టెంపరేచర్‌ను 24 నుంచి 26 మధ్య నడపాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని సూచించారు. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలు పెద్ద ఎత్తున పాటిద్దామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియ మన దగ్గర నుంచే ప్రారంభిద్దామన్నారు. దేశం మనకెంతో ఇచ్చిందని ఆ కృతజ్ఞత చాటే సమయంగా ప్రస్తుత పరిస్థితిని చూడాలని వ్యాఖ్యానించారు.
సమయం తీసుకుని ప్రకటన చేద్దాం: పొదుపు చర్యలు ఒక్కసారిగా ప్రజల్ని భయపెట్టేవిధంగా కాకుండా దశల వారీగా చేపడదామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ సూచనలకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ప్రతీ నిర్ణయానికి 48గంటల ముందు ప్రజల్ని సన్నద్ధం చేసి సమయం తీసుకుని ప్రకటన చేద్దామని సీఎం అన్నారు. తమ తమ శాఖల పరిధిలో పొదుపు చర్యలు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని కార్యదర్శులకు ఆదేశించారు.
రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కింద లక్ష కోట్ల ఖర్చు ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్క ఏపీ లోనే 11.5 లక్షలకుపైగా బాధితులు ఉంటే 8 రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల మంది బాధితులు ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సీఐడీ పెద్దలు సైతం అగ్రిగోల్డ్ సొమ్ము తిన్నారని చంద్రబాబు మండిపడ్డారు.
సైకిళ్ల వాడకం పెంచాలి: భేటీ అనంతంరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సూర్య ఘర్ కనెక్షన్లు పెంచాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కాలుష్యకారక వాహనాలు వీలైనంత తగ్గించాలని సీఎం కోరారని పంటలకు ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గించాలని చెప్పారని అన్నారు. సైకిళ్ల వాడకం పెంచాలని, పాదయాత్రగా వెళ్లాలని ఇంక ఈవీ వాహనాలు వాడేవారిని ప్రోత్సహించాలని సీఎం చెప్పినట్లు మంత్రి వెల్లడించారు యూనివర్సిటీలు ఆన్‌లైన్ తరగతులు పెంచాలని ప్రభుత్వ సంస్థల్లోనూ వర్క్ ఫ్రమ్ హోంను పరిశీలించాలని చెప్పినట్లు పార్థసారథి వివరించారు.
''ఇంధనం విషయంలో తొలుత దేశం గురించి ఆలోచించాలి. పొదుపు చర్యలతో ఆదాయం తగ్గినా భరించేందుకు సిద్ధం. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజారవాణాను ప్రోత్సహించాలి. ప్రజాప్రతినిధులు తమ వాహనాలు తగ్గించుకోవాలి. వారానికి ఒకరోజు నో వెహికల్ డేగా పాటించాలి. ఇంధన వినియోగం తగ్గించుకోవాలని ఆర్టీసీని కోరాం. నేతలు, అధికారులు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని కోరాం. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సీఎం కోరారు. బంగారం కొనడం తగ్గిస్తే విదేశీమారక ద్రవ్యం పెంచుకోవచ్చు.''- పార్థసారథి, మంత్రి
గొడ్డలి పార్టీ విమర్శలను తిప్పికొట్టాలి - మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం
రూ.1208.41 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం - మంత్రివర్గ కీలక నిర్ణయాలివే

