విశాఖ, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు - కేబినెట్ నిర్ణయాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - 55 అజెండా అంశాలపై చర్చ - పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఆమోదం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 7:53 PM IST
|Updated : February 24, 2026 at 9:51 PM IST
Cabinet Meeting Chaired by CM Chandrababu: విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి జిల్లా, చీరాల, రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 55 అజెండా అంశాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 160 మెగావాట్లు, 125 మెగావాట్లు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
నెల్లూరు జిల్లా శ్రీనగరాజుపురంలో మహిళల కోసం కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల పునర్‌వ్యవస్తీకరణకు నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నియోనాటాలజీ విభాగానికి 3 బోధనా పోస్టులు సృష్టించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో 2,387 కోట్ల రూపాయల పెట్టుబడితో సెమీకండక్టర్ అసెంబ్లీ & టెస్ట్ ఫెసిలిటీ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూకేటాయింపులకు నిర్ణయం తీసుకున్నారు. సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్” పేరుతో కొత్త శాఖ ఏర్పాటుకు నిర్ణయించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల ఖరారుపై కేంద్రానికి పంపే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ధ్రువపత్రాలు ఉన్న వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గోవాలి: మంత్రులు ప్రతీరోజూ పరీక్షగానే భావించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేసే పని మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శిలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విపక్షం నిర్మాణాత్మకంగా ఉండాల్సిందిపోయి రాజకీయాలు చేస్తోందని అసెంబ్లీకి రాకుండా బయట బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిపాటు ఊళ్లలో తిరిగి చేసే కార్యక్రమాలు ఒక రోజు అసెంబ్లీలో మాట్లాడితే సరిపోతుందని తెలిపారు.
మంత్రులు శాఖల్లో చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అలానే అసెంబ్లీలో మాట్లాడితే ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడినట్టేనని సీఎం అన్నారు. ఈ నెల 28న సామాజిక భద్రత ఫించన్లు ఇస్తున్నందున అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. ఫింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాలని తేల్చిచెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాల ఎలా ఉన్నాయో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్‌తో విశ్లేషణ చేయిస్తున్నానని సీఎం తెలిపారు. హెరిటేజ్‌తో పాటు 10 సంస్థల విస్తరణకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చించారు. హెరిటేజ్‌కు భూ కేటాయింపు చర్చ సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
చర్చల్లో మంత్రులు బాగా ప్రిపేర్ అయి మాట్లాడాలి: రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ఘటనలు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్న సీఎం చంద్రబాబు ఇలాంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండని స్పష్టం చేసారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేబినెట్ అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకూ ఒక్కో అంశంపై లఘు చర్చ చేపడదామని సీఎం సూచించారు.
ఇందుకు తగ్గట్టుగా అంశాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి బాగా వెళ్లాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. సందర్భాన్ని బట్టి తానూ, పవన్ కల్యాణ్ చర్చల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. శాఖల వారీ పద్దులపై జరిగే చర్చల్లో మంత్రులు బాగా ప్రిపేర్ అయి మాట్లాడాలని సీఎం తెలిపారు. మంత్రి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు అనుబంధంగా మాట్లాడేవారూ కంటెంట్ ప్రిపేర్ అయ్యేలా చూడాలని సూచించారు.
సచివాలయాల పేరు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్పు - కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే!
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం - సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిటీ

