ETV Bharat / state

ఏపీలో కొత్త పోలీసు అకాడమీ - ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

పోలీసు శాఖకు త్వరలో 3,000 కొత్త వాహనాలను అందిస్తామన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ -డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలను ఎదుర్కొనేందుకు ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడి

Budget Allocation for Home Department in 2026 Annual Budget
Budget Allocation for Home Department in 2026 Annual Budget (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 14, 2026 at 10:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

Budget Allocation for Home Department in 2026 Annual Budget : పోలీసుశాఖ బలోపేతం, పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరిస్తున్నామన్నారు. వార్షిక బడ్జెట్‌లో పోలీసు శాఖలో తీసుకువచ్చిన సంక్షేమ చర్యలు, ఆధునికీకరణ గురించి మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ‘‘మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌ వ్యాఖ్యను ప్రస్తావించారు.

పోలీసుశాఖకు 3వేల కొత్త వాహనాలను త్వరలో అందించనున్నట్లు తెలిపారు. డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేశవ్ వెల్లడించారు. సీసీటీవీ, డ్రోన్ వినియోగంతో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థ నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కొత్త ఏపీ పోలీసు అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.

ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులకు చెక్ : "పోలీసు శాఖకు కొత్తగా 3,000 వాహనాలను త్వరలో అందించనున్నాం. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు. స్మార్ట్‌ పోలీసింగ్‌ ల్యాబ్‌ల స్థాపన, ఆధునిక కమ్యూనికేషన్, భద్రతా పరికరాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, సీసీటీవీ, డ్రోన్ వినియోగంతో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం.

రాష్ట్రంలో కొత్త ఏపీ పోలీసు అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించాం. నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ ఏడాది రూ.15 కోట్ల కేటాయింపులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, రాజమండ్రి జిల్లాల్లో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్‌లను ప్రారంభించి 3,920 పోస్టులను మంజూరు చేశాం. పౌర-పోలీసు నిష్పత్తిని మెరుగుపర్చేందుకు 5,757 స్టైపెండరీ కేడెట్ ట్రైనీ కానిస్టేబుళ్లను నియమించాం. శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ భత్యం రూ.4,500 నుంచి 12,000కు పెంపు.

పోలీసు సిబ్బందికి బకాయి ఉన్న డీఏ, టీఏ, సెలవు సంబంధిత బకాయిలు, వైద్య రీయింబర్స్‌మెంట్‌ తదితర చెల్లింపుల కోసం దాదాపు రూ.500కోట్ల విడుదల. పోలీసు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్‌ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథక పునరుద్ధరణ. గత ఐదేళ్లుగా విస్తరించిన గంజాయి సమస్యకు ప్రత్యేక విభాగం ‘ఈగల్‌’ ద్వారా, డ్రోన్ల వినియోగంతో కట్టడి. మహిళల భద్రత కోసం ‘శక్తి యాప్‌’ను తీసుకువస్తాం. దీనిద్వారా 7 నిమిషాల్లోనే స్పందన లభిస్తుంది. వేధింపులకు పాల్పడేవారిపై కఠినచర్యలు ఉంటాయి" అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

వైద్యారోగ్య రంగానికి బడ్జెట్‌లో 19వేల 306 కోట్లు : మరోవైపు వైద్యారోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో 19వేల 306 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రతి పౌరుడి ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంజీవని పథకాన్ని చేపట్టిందని మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వైద్యారోగ్య వ్యవస్థలు ఇబ్బందులు పడ్డాయని 6వేల 486 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా వదిలేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం బకాయిలను చెల్లించి రాష్ట్రంలో వైద్యారోగ్యం పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించామని మంత్రి కేశవ్‌ స్పష్టం చేశారు.

సాగునీటి రంగానికి బడ్జెట్​లో అత్యంత ప్రాధాన్యం : రాష్ట్రప్రభుత్వం సాగునీటి రంగానికి బడ్జెట్​లో అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. భావితరాలకు దీర్ఘకాలిక జల భద్రతను కల్పించాలన్న లక్ష్యంతో నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి సారించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు. పోలవరం, వంశధార, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు కట్టుబట్టి ఉన్నామన్నారు. పోలవరం- నల్లమల సాగర్ అనుసంధానంతో సీమను సస్యశ్యామలం చేస్తామని ఉద్ఘాటించారు. ఏపీని కరవురహిత రాష్ట్రంగా మార్చేలా జలవనరులశాఖకు రూ.18వేల224 కోట్లు కేటాయించినట్లు మంత్రి పయ్యావుల ప్రకటించారు.

పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి : పర్యాటకరంగం అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతి సహా పలు ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయల బలోపేతం చేయటం సహా ప్రపంచస్థాయి పర్యాటక హోటళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి పుష్కరాల కోసం ప్రారంభంగా రూ.60 కోట్లు కేటాయింపులు చేశామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. పీపీపీ విధానం ద్వారా పర్యాటకరంగాన్ని మెరుగ్గా అమలు చేయగలమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

సామాజిక న్యాయానికి బడ్జెట్‌లో పెద్దపీట - సంక్షేమానికే ఏకంగా 17శాతం నిధులు కేటాయింపు

భావి తరాలకు బంగారు భవిష్యత్తు - పాఠశాల విద్యకు బడ్జెట్‌లో రూ.32,308 కోట్లు కేటాయింపు