వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్ - 'ఏఐ' పెన్నులతో జవాబులు - అగ్రివర్సిటీలో బీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్
ఏఐ ఆధారిత పెన్నులతో జవాబుల రాత - వాట్సాప్ ద్వారా ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు చేరవేత - 35 మంది ప్రవేశాల రద్దు - ఒక ఉన్నతాధికారి సహా ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్

Published : January 9, 2026 at 8:15 AM IST
Question Paper Leaked at Prof Jayashankar Agriculture University : బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల్లో వరంగల్ నగరం కేంద్రంగా ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దానికి బాధ్యులైన ఒక ఉన్నతాధికారి సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం రాత్రి ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో భాగంగా మొత్తం 35 మంది ఇన్‌సర్వీసు అభ్యర్థులకు లీకేజీ ప్రశ్నపత్రాలు అందినట్లు గుర్తించారు. వీరంతా వ్యవసాయ విస్తరణాధికారులుగా ఉండి, ఇన్‌సర్వీసు కోటాలో మూడేళ్ల క్రితం బీఎస్సీలో అడ్మిషన్లు పొందారు. వారి ప్రవేశాలను రద్దు చేసి, తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. వారికి మళ్లీ ఇన్‌సర్వీసు కోటాలో బీఎస్సీ ప్రవేశాలు కల్పించకుండా అధికారులు వెంటనే బ్లాక్ లిస్టులో చేర్చారు.
ఇలా వెలుగు చూసింది : గత వారం వర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్దాస్ జానయ్య జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. గత నెలలో జరిగిన సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మార్కుల షీట్లను పరిశీలించారు. అందులో ఇన్‌సర్వీసు విద్యార్థులకు కఠినమైన పాథాలజీ సబ్జెక్టులో 90 శాతానికి పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించి అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా పాథాలజీలో అత్యంత ప్రతిభావంతులకే 60 శాతం కంటే ఎక్కువ మార్కులు ఎట్టి పరిస్థితుల్లో రావు. అలాంటిది 90 శాతానికి పైగా మార్కులు ఎలా వచ్చాయనే అనుమానంతో ఆయన పరీక్షలు జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీలను వెంటనే కావాలని అడిగారు. కళాశాల అధికారులు తెచ్చి చూపెట్టగా అందులో పరిశీలించారు.
వాట్సాప్ ద్వారా వచ్చిన క్వశ్చన్ పేపర్ : అందులో ఒక ఇన్‌సర్వీస్ అభ్యర్థి పది నిమిషాల్లోనే మొత్తం పరీక్ష పూర్తి చేసి, ఖాళీగా కూర్చున్నట్లు గుర్తించారు. ఆ విద్యార్థిని పిలిచి గట్టిగా ప్రశ్నించడంతో వరంగల్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం తనకు వచ్చిందని చెప్పారు. పార్ట్ ఏలోని 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పెన్నులో నమోదు చేసుకుని పరీక్ష రాసినట్లు వెల్లడించారు. దీనిపై వీసీ ముగ్గురు అధికారులతో తక్షణమే కమిటీ వేసి విచారణ జరిపించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.
సమగ్ర విచారణకు వీసీ ఆదేశాలు : వరంగల్ వ్యవసాయ కాలేజీ అధికారి, ఉద్యోగి కలిసి 6 పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్‌సర్వీసు అభ్యర్థులకు పంపినట్లు కమిటీ సభ్యులు గుర్తించారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ముడుపులు వసూలు చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న 35 మంది ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు చేరగా, వారంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉన్న పెన్నుల్లో జవాబులు నమోదు చేసుకొని పరీక్షలు రాసినట్లు తేలింది. లీకేజీ వ్యవహారం ఒక్కసారిగా వెలుగు చూడటంతో వర్సిటీలో ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణపై సైబర్ నేరాల విభాగం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని వీసీ అల్దాస్ జానయ్య నిర్ణయించారు.
నిధులివ్వండి : జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎంపీ మల్లు రవి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వారం రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసి సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖను అందజేశారు. వర్సిటీలో మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ఏఐ, రోబోటిక్స్ వినియోగం, డిజిటల్ వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటు, 2047 నాటికి మానవ రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. విశ్వవిద్యాలయంలో ఏటా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున అదనపు బాలికల వసతిగృహాల నిర్మాణానికి నిధులివ్వాలని తెలిపారు. పనుల కోసం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.465 కోట్ల గ్రాంటును మంజూరు చేసి పెండింగ్‌లో ఉన్న యూజీసీ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరారు.
జీవవ్యర్థాలతో ఆర్గానిక్ ఎరువుల తయారీ - జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక ఒప్పందం
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ విడుదల - 24వ ర్యాంక్ సాధించిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

