తెలంగాణలో రైతుబంధు పడ్తలేదు కానీ రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తోంది : కేటీఆర్
రైతుల మీద ప్రేమ ఉంటే రైతుభరోసాను వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారన్న కేటీఆర్ - కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మండిపాటు - బీఆర్ఎస్లో చేరిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు

Published : April 29, 2026 at 8:37 PM IST
KTR Fire on Congress Govt in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్‌లు, డైలాగ్‌లు ఇవ్వడం తప్ప తెలంగాణలో ఏ వర్గానికి న్యాయం చేయలేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లోకి చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు సరిగా ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. రైతులకు యూరియా ఎందుకు దొరకట్లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే రైతుభరోసా నిధులు వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారని కేటీఆర్ నిలదీశారు.
"గత పదేళ్ల బీఆర్‌ఎస్ కాలంలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలోనే రూ.3.70 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి ఈ పైసలన్నీ ఎవరికి వెళ్లాయి. రైతుబంధు పడ్తలేదు. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తోంది. ఎన్నికల ముందు దానవీర శూర కర్ణ, ఏదీ కావాలంటే అది ఇస్తామన్నారు. ఇప్పుడు కుంభకర్ణ. ఎలక్షన్ల ముందు పాలమూరు బిడ్డ. ఇప్పుడేమో పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డా. ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి. నాగర్‌కర్నూల్‌లోని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. రైతుల ధాన్యం వానకు తడిసి వారిని చూసి బాధనిపిస్తలేదా? ఈ అంశాలపై మేం ప్రశ్నిస్తుంటే ఆయనకు సంగీతంలాగా ఉందటా. పైశాచిక ఆనందం వస్తుందని అంటున్నారు" -కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
గుండెల్లో దమ్ము ఉండాలి : రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు తేవాలంటే గుండెల్లో దమ్ము ఉండాలని కేటీఆర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా ప్రభుత్వంలో కూడా తప్పులు జరిగాయి : రైతుల మీద ప్రేమ ఉంటే రైతుభరోసాను వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఉదారంగా రైతుబంధు ఇస్తే రైతులు పుల్లవిరుపుగా మాట్లాడారన్న ఆయన ఎవరు వచ్చినా రైతుబంధు ఆగదని గతంలో కొందరు మాట్లాడారన్నారు. ఇవాళ రైతుబంధు సరిగా ఎందుకు రావట్లేదు, యూరియా ఎందుకు దొరకట్లేదు? అని ప్రశ్నించారు. అన్నీసరిగా అందినప్పుడు కేసీఆర్ విలువ మీకు తెలియలేదని, గత ప్రభుత్వంలో ఏమీ తప్పులు జరగలేదని తాను అనటం లేదన్నారు. దెబ్బమీద దెబ్బ తగిలితే పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం రావటం సహజమన్నారు. ఓటమి తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయామని అన్నారు.
కవిత కొత్త పార్టీపై స్పందించిన కేటీఆర్ - పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు
కాంగ్రెస్ కుట్రల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని మరోసారి చెప్తున్నా : కేటీఆర్

