ETV Bharat / state

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం - ఛార్జిషీట్​ విడుదల చేసిన కేటీఆర్

కాంగ్రెస్​ 1000 రోజుల పాలనపై ఛార్జ్​షీట్​ విడుదల చేసిన బీఆర్​ఎస్ -​ కాంగ్రెస్‌ది రాక్షస పాలన అని విమర్శించిన కేటీఆర్ - ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఎద్దేవా

Congress government
కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై ఛార్జ్‌షీట్‌ పోస్టర్​ను విడుదల చేసిన మాజీ మంత్రులు హరీశ్​ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్​ఎస్​ నేతలు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 2, 2026 at 1:29 PM IST

4 Min Read
Choose ETV Bharat

BRS Charge Sheet on Congress Ruling : 1000 రోజుల కాంగ్రెస్‌ పాలనలో ఎటుచూసినా విధ్వంసం, వికృతమే కనిపిస్తుందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో కలిసి ఆయన ఛార్జిషీట్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయకున్నా 4.50 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. గురుదక్షిణ కింద కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి తరలించే కుట్ర జరుగుతోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మీ పాలన క్రిమినల్‌ వేస్ట్‌ : కాంగ్రెస్‌ 1,000 రోజుల పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎటుచూసినా విధ్వంసం, వికృతమే తాండవం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని రంగాల్లో సర్కార్‌ విఫలమైందని, కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన క్రిమినల్‌ వేస్ట్‌ అని ధ్వజమెత్తారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మారిస్తే, కాంగ్రెస్‌ నాశనం చేసిందంటూ దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం - ఛార్జిషీట్​ విడుదల చేసిన కేటీఆర్ (ETV Bharat)

తెలంగాణకు అన్యాయం : ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ కింద కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుపోయే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాసిన వ్యక్తి (ఆదిత్యానాధ్ దాస్​)ను సలహాదారుగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా జలాల వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని, మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. విద్యా వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారన్న కేటీఆర్, హెచ్​సీయూ భూ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంచాగిరి చేయడం మాత్రం బాగా తెలుసు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి గారికి చెంచాగిరి చేయడం. గురువుగారి గురుదక్షిణ కోసం కృష్ణా, గోదావరి నీళ్లను సంతర్పణ చేయడం మాత్రం ఆయనకు బాగా తెలుసు. బీఆర్ఎస్ హయాంలో ఆనాడు హరీశ్ రావు గారు సాగునీటి శాఖ మంత్రి, మాకు ఆనాడు ఆర్​ విద్యాసాగర్​ రావుగారు సలహాదారు. ఆయన ఒక ఉద్యమ బిడ్డ, నీళ్లు-నిజాలు అనే పుస్తకం రాసిన నాయకుడు. ఈనాడు తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్​ను సాగునీటి సలహాదారుగా పెట్టుకున్నారు" -కేటీఆర్, మాజీమంత్రి

కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి 3 పువ్వులు, 6 కాయల్లా వర్ధిల్లుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లిక్కర్ బాటిల్‌ మూతల నుంచి మేడారం గద్దెల టెండర్ల వరకు అంతా అవినీతేనని ఆరోపించారు. భూమి కనబడితే సీఎం సోదరులు, బంధువులు భూతాల్లా వాలిపోతున్నారని విమర్శించారు. మాట్లాడితే కేసీఆర్‌ రాజీనామా చేయాలని అంటున్న సీఎం, ఆయన రాజీనామా చేస్తే దిల్లీ నేతలే తట్టుకోలేకపోయారని, మీరు తట్టుకుంటారా? అని ప్రశించారు. సీఎం కోరిక మేరకే కేసీఆర్​ 2028లో అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా తిరిగివస్తారని తెలిపారు.

ప్రజల పక్షాన పోరాటం : తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్​తో కలిసి మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఛార్జ్‌షీట్​ను విడుదల చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్ ఎంతో కష్టపడి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా కుప్పకూలుస్తోందని హరీశ్​రావు ఆక్షేపించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణను కేసీఆర్ కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా ఇస్తే రేవంత్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ ఆగం చేస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, ప్రజల పక్షాన పోరాడేందుకే వారం రోజుల కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

హామీల అమలులో : కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాలు, వ్యవస్థల నిర్వీర్యం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఛార్జ్​షీట్‌ను ప్రజల ముందు ఉంచుతున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా దొరకని దీన స్థితికి దిగజారిందని ఆరోపించారు. పురోగమనం వైపు వేగంగా ప్రయాణం చేయాల్సిన రాష్ట్రం, తిరోగమనం వైపు పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమాలు : మూడో తేదీన రైతు సదస్సుల రూపంలో సాగునీరు, విద్యుత్‌, యూరియా, బీమా సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై నిరసనలు చేపడతారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై నిరసన కార్యక్రమాలు రూ.2500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అంశాలు లక్ష్యంగా నాలుగో తేదీన మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తారు. హామీలు అమలు చేయని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు చేపడతారు. ఐదో తేదీన విద్యార్థులు, యువతతో నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్‌ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌ అంశాలను ప్రస్తావిస్తారు.

ఆదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు చేపడతారు. ఆరో తేదీన హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలపై పట్టణాల్లో పారిశుద్ధ్యం, పల్లెల సమస్యలపై గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతారు. ఏడో తేదీన ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతిపత్రాలు ఇస్తారు. హామీల మోసంపై జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తారు. వారం రోజుల పోరాట కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో ఎనిమిదో తేదీన ప్రెస్‌ మీట్లు నిర్వహించడంతో పాటు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. సెప్టెంబర్ పదో తేదీన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్​ఎస్​ సంఘీభావం ప్రకటించింది. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలు వైఫల్యాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా బీఆర్​ఎస్ ఈ పోరుబాటను రూపొందించింది. మొత్తం కార్యక్రమాలను పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంతో పాటు ప్రతి కార్యక్రమంపై నివేదికలు తీసుకోనుంది.

'రుణమాఫీపై బహిరంగచర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి' - సీఎంకు సవాల్ విసిరిన హరీశ్​రావు

మంత్రివర్గంలో మార్పులా? సమూల ప్రక్షాళనా! - ఉత్కంఠగా కాంగ్రెస్ రాజకీయం