ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్​ బహిరంగ సభలు!

బీఆర్‌ఎస్‌ నేతలతో ముగిసిన కేసీఆర్ సమావేశం - ఈనెల 29న శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం - పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల తదుపరి కార్యాచరణపై చర్చించిన కేసీఆర్ - పలు విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్​ అధినేత

BRS CHIEF KCR HELD A MEETING
BRS CHIEF KCR HELD A MEETING (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : December 26, 2025 at 7:53 PM IST

|

Updated : December 26, 2025 at 8:58 PM IST

3 Min Read
Choose ETV Bharat

KCR Held Meeting With 4 Districts BRS Leaders : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తదుపరి కార్యాచరణపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు, మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్​లు పాల్గొన్నారు.

రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది : మాజీ మంత్రులతో సమావేశం సందర్భంగా పలు అంశాలపై కేసీఆర్​ చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అంశంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన​ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు కాంగ్రెస్‌ ఎప్పుడూ ద్రోహమే చేస్తోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. బీర్‌ఎస్‌కు తప్ప మరే ఇతర పార్టీకి తెలంగాణపై పట్టింపు లేదని కేసీఆర్​ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాల్సిందేనని వివరించారు. ప్రజల్లోకి వెళ్దాం ఉద్యమాన్ని నిర్మిద్దాం అని పార్టీ నేతలకు సూచించారు. నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్‌పైనే ఉందని కేసీఆర్​ తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో వివరిద్దామని పార్టీ నాయకులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగా చెబుదామన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన పెంచేలా గ్రామస్థాయి నుంచి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలన్న అంశంపై నేతలు చర్చించారు. అలాగే బహిరంగ సభల నిర్వహణ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ భేటీలో లోతైన చర్చ జరిగినట్లు సమాచారం. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వైఖరిపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్న దిశగా కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్​ ఫైర్ : కాగా ఇటీవల జరిగిన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్​ నిప్పులు చెరిగారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైన చర్చించినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరేనని, 174 టీఎంసీల నీరు పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులకు రావాల్సి ఉందని మీడియా సమావేశంలో కేసీఆర్‌ అన్నారు.

పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కిలో మీటర్లు ప్రవహించినా అప్పట్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందలేదని కేసీఆర్ వివరించారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు తాము చాలా వాదించి, ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని వివరించినట్లుగా కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల మధ్య వివాదాలే పరిష్కరిస్తామని ట్రైబ్యునల్‌ చెప్పిందన్న కేసీఆర్​ బచావత్‌ ట్రైబ్యునల్‌ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారని ఇటీవల సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరు కోసం గంటెడు నీళ్లు అడిగిన వాళ్లే అప్పుడు లేరని కేసీఆర్ వివరించారు. 1974లో బచావత్‌ ట్రైబ్యునల్‌ 17 టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించినా దాన్ని పట్టించుకున్నవారే లేరని ఆయన ధ్వజమెత్తారు.

మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి : పాలమూరుపై కేంద్రాన్ని ఎండగట్టి పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారు. భారీ బహిరంగ సభలు పెడుతున్నామని తాను సభలకు రానున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వం నోరుమూసుకుని ఉంటే తామైనా పూనుకోవాలి కదా అని ఆయన అన్నారు. ఇవాళ్టి వరకూ ఒక కథ రేపటి నుంచి మరో కథ ఉంటుందని పేర్కొన్నారు.

పార్టీ కార్యకలాపాల్లో వేగం పెంచిన బీఆర్ఎస్ : ఇటీవల బీఆర్ఎస్ పార్టీ తమ తమ కార్యకలాపాల్లో వేగంపెంచింది. పార్టీ శ్రేణుల్ని ఉత్తేజితం చేసే దిశగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఇటీవల వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా ఆ పార్టీకి కొంత ఊరట నిచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా నాలుగు జిల్లాల ముఖ్య నాయకులతో ఆ పార్టీ అధినేత సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫ్యూచర్‌ సిటీ పేరుతో జరిగేదంతా రియల్‌ఎస్టేట్‌ దందానే : మాజీ సీఎం కేసీఆర్

నన్ను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది : కేసీఆర్

Last Updated : December 26, 2025 at 8:58 PM IST