విశాఖలో విజయవంతంగా బ్రిక్స్ సదస్సు - క్రీడా సహకారంపై కీలక నిర్ణయాలు
విశాఖలో విజయవంతంగా ముగిసిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు - సదస్సులో ఏకాభిప్రాయంతో జాయింట్ డిక్లరేషన్ ఆమోదం - క్రీడా విజ్ఞానం, ఏఐ, డిజిటల్ మార్పులపై గ్రూప్ ఏర్పాటుకు అంగీకారం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 7:30 AM IST
BRICS Summit 2026 in Visakha : విశాఖలో రెండ్రోజులపాటు జరిగిన బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల మంత్రుల సదస్సు ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. చివరి రోజు సదస్సులో పాల్గొన్న కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామన్యం కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని అన్నారు. అథ్లెట్లు, కోచ్‌ల మార్పిడితో పాటు సంయుక్త పోటీల నిర్వహణకు బలమైన పునాది పడాలని పిలుపునిచ్చారు. క్రీడా విజ్ఞానం, అథ్లెట్ల పనితీరు, పాలన, ఏఐ సహా డిజిటల్ మార్పులపై ప్రత్యేక బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
క్రీడలతో పాటు ఆర్థిక స్వావలంబన సాధనే ధ్యేయంగా భారత్ అడుగులు వేస్తోందని మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో క్రీడా పర్యావరణం పూర్తిగా మారిపోతోందని ఉద్ఘాటించారు. దేశీయంగా క్రీడా సామగ్రి తయారీని ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రత్యేక క్లస్టర్ల ప్రోత్సాహక పథకాన్ని తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, పెట్టుబడిదారులు మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో ముందుకు రావాలన్నారు.
BRICS Youth Ministers Meeting 2026 : క్రీడా పరిశ్రమల అభివృద్ధి, వాణిజ్య సంబంధాల పెంపు కోసం ఈ ఏడాది నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. సభ్య దేశాల మధ్య సాంస్కృతిక బంధాలు, ప్రజల మధ్య సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు అక్టోబర్ 12, 13 తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ ట్రెడిషనల్ అండ్ ఇండిజినస్ స్పోర్ట్స్ డెమోన్‌స్టేషన్ గేమ్స్ నిర్వహించనున్నారు.
ఎలాంటి పోటీతత్వానికి తావులేకుండా, పూర్తిగా సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా ఈ వేడుకలు జరగనున్నాయి. ఆయా దేశాలకు చెందిన స్వచ్ఛంద క్రీడాకారులు, నిపుణులు ఈ వేదికపై తమ దేశీయ క్రీడా సంస్కృతిని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాల మధ్య మైత్రి మరింత బలపడుతుందని, పాత కాలపు నాటు క్రీడలకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
BRICS Friendship Cycling Event 2026 : అంతకుముందు విశాఖ బీచ్ రోడ్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ఫ్రెండ్‌షిప్ సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కి క్రీడాకారులు, యువతను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికా దేశాలతో పాటు పలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి విచ్చేసిన క్రీడా ప్రతినిధులు, యువజన మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బ్రిక్స్ దేశాల మధ్య సాంకేతికత, క్రీడలు, నైపుణ్యాల భాగస్వామ్యం మరింత బలపడాలని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆకాంక్షించారు. కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
విశాఖలో ఘనంగా 'బ్రిక్స్' సైకిల్ ర్యాలీ - పాల్గొన్న వివిధ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులు
'బ్రిక్స్' దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు

