ETV Bharat / state

బ్రెయిన్​ డెడ్​తో మృతి చెంది నలుగురికి ప్రాణదాతగా నిలిచిన బాలింత

23 రోజుల కిందటే ప్రసవం - అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి బ్రెయిన్​ డెడ్​ - అవయవదానంతో నలుగురికి పునర్జన్మ - అసిఫాబాద్​లోని ఓ బాలింత మానవతా దృక్పథం

23 DAYS BABY MOTHER ORGAN DONATION
23 DAYS BABY MOTHER ORGAN DONATION (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 5:27 PM IST

3 Min Read
Choose ETV Bharat

Mother Organ Donation After Die : బ్రెయిన్​ డెడ్​తో 23 రోజుల కిందటే బిడ్డకు జన్మనిచ్చిన ఓ బాలింత మృతి చెందింది. కానీ అవయవ దానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చి అమ్మ మనసు చాటుకుంది. ఈ ఘటన అసిఫాబాద్​లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని జన్కాపుర్​కు చెందిన గుండు నాగరాజ్​కు 2018లో సృజన (34)తో వివాహమైంది. వీరికి అద్విక్​ అనే అయిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా 23 రోజుల కిందటే మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓ రోజు అకస్మాత్తుగా స్పృహ తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయిదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించిన తర్వాత ఆమె బ్రెయిన్​ డెడ్ అయిందని వైద్యులు నిర్దరించారు. దీంతో కుటుంబీకుల అంగీకారంతో సృజన అవయవాలను దానం చేశారు. నెల కూడా నిండని పసికందు, అయిదేళ్ల కుమారుడు అమ్మ చితికి నిప్పు పెట్టిన ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.

అకస్మాత్తుగా స్పృహ తప్పి : జన్కాపుర్​కు చెందిన గుండు నాగరాజ్ ఉద్యోగ నిమిత్తం మూడేళ్లుగా దుబాయ్​లో ఉంటున్నారు. గర్భిణిగా ఉన్న సృజనను ప్రసవం కోసం మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉన్న ఆమె తల్లిగారింటికి పంపించారు. 23 రోజుల కిందట సృజనకు బాబు పుట్టాడు. భార్య కాన్పు కోసమని నాగరాజ్​ దుబాయ్​ నుంచి మందమర్రికి వచ్చి, 11 రోజుల పాటు భార్యా పిల్లలతో గడిపి, దుబాయ్​కి తిరిగి వెళ్లారు. ఓ రోజు తలనొప్పితో సృజన ఉన్నట్లుండి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మంచిర్యాలలోని ఓ హాస్పిటల్​కు తరలించారు. కానీ సృజన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో అక్కడి నుంచి హైదరాబాద్​లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయిదు రోజులు ఐసీయూలో చికిత్స అందించిన డాక్టర్లు సృజన బ్రెయిన్​ డెడ్​ అయినట్లు నిర్దరించారు.

దుబాయ్​ నుంచి వచ్చి : సృజన పరిస్థితి గురించి డాక్టర్లు, జీవన్​ధాన్ ఆర్గాన్​ డోనర్​ సంస్థ ప్రతినిధులు అవయవదానం గురించి బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో ఆమె భర్త నాగరాజ్​ దుబాయ్ నుంచి హైదరాబాద్​కు వచ్చి అవయవదానానికి అంగీకరించారు. ఈ మేరకు సృజనకు సంబంధించిన ఊపిరితిత్తులు, రెండు కిడ్నీలు, కాలేయాన్ని వైద్యులు సేకరించారు. అవసరమైన వారికి ఆ అవయవాలను అందించారు.

చిన్నారులను చూసి కన్నీరుమున్నీరు : అంత్యక్రియలు చేసేందుకు సృజన మృత దేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు గురువారం జన్కాపుర్​కు తీసుకొచ్చారు. దీంతో గ్రామస్థులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. 23 రోజుల పసికందును, అభం శుభం తెలియన అయిదేళ్ల కుమారుడు తల్లి చితికి నిప్పు పెట్టడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్థులతో పాటు జీవన్​దాన్ ప్రతినిధులు, సదాశయ ఫౌండేషన్​ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్​కుమార్​, జీవన్​దాన్​ ప్రతినిధులు, కార్యదర్శి లింగమూర్తి, సభ్యులు నూక సురేష్​, భీష్మాచారి, సానా రామకృష్ణారెడ్డి, ఆసు, రాంరెడ్డి, తదితరులు విషాదంలోనూ బాధిత కుటంబ సభ్యులు చూపిన మానవతా దృక్పథాన్ని అభినందించారు.

ఆర్గాన్​ డొనేషన్ చేయాలనుకుంటే : అవయవాలు దానం చేసేందుకు క్రమగా ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికి పలు సంస్థలు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వాసవి, లయన్స్​, అలయన్స్​ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలకు అవయవ దానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో చాలామంది ఆర్గాన్ డొనేషన్​కు ముందుకొస్తున్నారు. భవిష్యత్తులోనూ ఎవరైనా అవయవ దానం చేయాలని నిర్ణయించుకుంటే https://jeevandan.gov.in/వెబ్​సైట్​ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డోనర్​ కార్డును సంస్థ ఆన్​లైన్​లో అందిస్తుంది. హైదరాబాద్​లో ఉన్నవారు నిమ్స్​ హాస్పిటల్​ ఉన్న జీవన్​దాన్​ సంస్థ ప్రతినిధులను నేరుగా సంప్రదించవచ్చు. అవయవ దానానికి సంబంధించిన సందేహాలను వారితో నివృత్తి చేసుకోవచ్చు.

మలుపులు తిరుగుతోన్న కుమ్మెర ఘటన - షాకింగ్ విషయాలు చెప్పిన పోలీసులు

చిన్న చిన్న కారణాలతో ఉసూరుమంటున్న ప్రాణాలు - ధైర్యం చెప్పేవారుంటే సరి