అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు - విస్తృత తనిఖీలు
కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఈ-మెయిల్‌తో బెదిరింపులు - అప్రమత్తమైన అధికారులు - కొన్ని కోర్టులు తాత్కాలిక నిలిపివేత - కోర్టుల ఆవరణలో బాంబు స్వ్కాడ్ల సోదాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 3:44 PM IST
Bomb Threats to Anantapur, Chittoor and Eluru District Courts : రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టుల్లో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టుల్లోనూ తనిఖీలు చేపట్టారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి లేఖ : కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని వచ్చిన ఈ-మెయిల్‌తో అనంతపురం పోలీసులు అప్రమత్తమయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా న్యాయమూర్తి, పరిపాలన అధికారిణిల ఈ-మెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు లేఖ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కోర్టు ఎదురుగానే ఉన్న టూటౌన్, గ్రామీణ, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల నుంచి సీఐలు, ఎస్సైలు, పోలీసులు వెంటనే తరలి వెళ్లారు.
'ఎక్కడో జరిగిన ఏదో ఒక సంఘటన కారణంగా తాము కోర్టులో బాంబు దాడులకు పాల్పడనున్నట్లు గుర్తు తెలియని చిరునామాతో మెయిల్ ఒకటి వచ్చింది. అందులో కోర్టు ఆవరణలో ఆత్మాహుతి చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రత్యేకించి అనంతపురం కోర్టులోనే బాంబు దాడులు జరుగుతాయని మెయిల్లో లేదు, కాబట్టి అన్ని ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాం' - శ్రీకాంత్, అనంతపురం టూటౌన్ సీఐ
క్షుణ్ణంగా సోదాలు : ఈలోపే టూటౌన్ సీఐ శ్రీకాంత్, జిల్లా ఎస్పీ జగదీష్‌కు సమాచారం ఇవ్వడంతో బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్వ్కాడ్లు జిల్లా కోర్టు వద్దకు వెళ్లి సోదాలు చేశాయి. కోర్టు ఆవరణలో న్యాయవాదులను, కక్షిదారులను కోర్టులో నుంచి కాంపౌండ్ వెలుపలికి వెళ్లాలని పోలీసులు కోరారు. అందరూ కోర్టు భవనం నుంచి దూరంగా వెళ్లిన తరువాత పోలీసులు కోర్టు ఆవరణ మొత్తాన్ని క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. మెయిల్ వచ్చిన విషయం వాస్తవమేనని, అయితే అనంతపురం కోర్టుకు మాత్రం ప్రత్యేకంగా రాలేదని సీఐ శ్రీకాంత్ చెబుతున్నారు. ఈ-మెయిల్ పంపిన నిందితుల కోసం సైబర్ క్రైం పోలీసులు గుర్తిస్తున్నారని సీఐ తెలిపారు.
మదనపల్లె జిల్లాలోని కోర్టులు తాత్కాలిక మూసివేత : కోర్టులో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో అన్నమయ్య మదనపల్లె జిల్లాలోని కోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు జిల్లా కోర్టునకు బాంబులు పెట్టి పేల్చి వేస్తున్నామని సమాచారం పంపడంతో అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కోర్టు ప్రాంగణంలో ఉన్న 9 కోర్టులలో పనిచేసే సిబ్బందిని బయటకు పంపేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు కోర్టుకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా మదనపల్లి ఉలిక్కిపడింది.
టెంపుల్ సిటీలో టెన్షన్ - తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు - సీఎం చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద విస్తృత తనిఖీలు

