పచ్చని కోనసీమ నిప్పుల కొలిమిగా - తరచూ భయపెడుతున్న బ్లోఅవుట్‌లు
ఇరుసుమండ బ్లోఅవుట్ ఘటనతో భయకంపితులవుతున్న స్థానికులు - కోనసీమ ప్రజల ముందు కదలాడుతున్న గతంలో జరిగిన ఘటనలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 7:23 AM IST
Blowouts that are Frequently Frightening Konaseema: చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తిలో భాగంగా చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాలు పచ్చని కోనసీమను నిప్పుల కొలిమిగా మారుస్తున్నాయి. ఎక్కడ చిన్న గ్యాస్ లీకేజీ జరిగినా స్థానికుల గుండెలు అదిరిపోతున్నాయి. తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ స్థానికుల్ని భయకంపితులను చేస్తోంది. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు వారి కళ్ల ముందు కదలాడుతున్నాయి.
1993లో ఎగజిమ్మిన చమురు: కోనసీమ జిల్లా ఇరుసుమండలో తాజాగా జరిగిన బ్లోఅవుట్ గతంలో ప్రజల్ని ఠారెత్తించిన ఇలాంటి అనేక ఘటనలను గుర్తు చేస్తోంది. చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తిలో భాగంగా జరుగుతున్న దుర్ఘటనలు జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. రాజోలు మండలం కడలి పరిధి తూర్పుపొలంలోని కొమరాడ-1 డ్రిల్లింగ్ సైట్‌లో 1993 మార్చి 20న బ్లోఅవుట్ జరిగింది. ఆ సమయంలో ఎగజిమ్మిన చమురు స్థానిక కడలి డ్రెయిన్‌లో కలిసి పలుచోట్ల మంటలు అంటుకున్నాయి. వాటి ధాటికి వేలాది కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. 26 రోజుల అనంతరం వెల్ కిల్లింగ్ ఆపరేషన్‌తో బావిని శాశ్వతంగా మూసివేశారు.
1995లో 65 రోజుల పాటు అగ్నికీలలు: అల్లవరం మండలం దేవరలంకలోని పాశర్లపూడి-19 బావిలో 1995 జనవరి 8న డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ సంభవించింది. 65 రోజుల పాటు అగ్నికీలలు ఏకబిగిన ఎగసిపడటంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. బ్లోఅవుట్ ప్రివెంటర్-B.O.P.ని మూసివేసి మంటల్ని అదుపులోకి తెచ్చారు.
1997లో గ్యాస్ బ్లోఅవుట్: రావులపాలెం సమీపంలోని దేవరపల్లిలో 1997 ఫిబ్రవరి 19న డ్రిల్లింగ్ సైట్‌లో గ్యాస్ బ్లోఅవుట్ జరిగింది. విపరీతమైన ధ్వనితో గ్యాస్, చమురు చుట్టుపక్కల నివాస ప్రాంతాల వరకు వ్యాపించడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఫిబ్రవరి 24న బ్లోఅవుట్‌ను అదుపులోకి తెచ్చారు.
2014లో 22 మంది మృత్యువాత: మామిడికుదురు మండలం నగరంలోని గెయిల్‌కు చెందిన ట్రంక్ లైన్ 2014 జూన్ 27న విస్ఫోటం చెందడంతో 22 మంది మంటల్లో సజీవదహనమయ్యారు. 18 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
2020లో ఉప్పూడిలో పేలుడు: కాట్రేనికోన మండలం ఉప్పూడిలో 2020 ఫిబ్రవరి 2న డ్రిల్లింగ్ సైట్‌లో గ్యాస్ పేలుడు జరిగింది. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఓఎన్జీసీ నిపుణుల బృందం 3 రోజుల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.
బ్లోఅవుట్ అనగా?
సహజ వాయువు ఉత్పత్తి అనేది మన అదుపులోనే ఉంటుంది. ఎప్పుడు అయితే అదుపుతప్పి గొట్టాల నుంచి బయటకు వచ్చి వేడికి మండుతుందో దాన్నే బ్లోఅవుట్ అంటారు.
సాంకేతికత పెరిగినా ఇంకా సమస్యగానే: గతంలో పాశర్లపూడి వద్ద జరిగిన బ్లోఅవుట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీన్ని ఆర్పేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ ఎంతో నష్టానికి గురయ్యాయి. దీన్ని ఒక అనుభవంగా తీసుకుని కొన్నింటిని అదుపు చేయడంలో అధికారులు కొంత మేరకు విజయం సాధించారు. టెక్నాలజీ ఎంత పెరిగినా వీటిని పూర్తి స్థాయిలో అదుపు చేయడం నేటికీ సమస్యగానే మారింది.
పాశర్లపూడి బ్లోఅవుట్ ఆర్పేందుకు 3 నెలల సమయం పట్టింది. అమెరికా నుంచి నిపుణులు వచ్చి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ వేడికి చుట్టుపక్కల చెట్లు సహా పశువులు, మనుషులకు తీవ్ర నష్టం జరిగింది. భయంకర శబ్దాలకు దూరంలో ఉండే అమలాపురం పట్టణంలో కూడా ఇళ్ల కిటికీల తలుపులు కొట్టుకోవడం జరిగింది. ఆ రోజున ప్రకృతి విజృంభణకు బెంబేలెత్తిపోయారని డాక్టర్ సి.వి.సర్వేశ్వరశర్మ, కోనసీమ సైన్స్ పరిషత్తు అధ్యక్షుడు, శాస్త్రవేత్త తెలిపారు.
ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్ - ఎగసిపడుతున్న మంటలు
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 800 టన్నుల స్టైరీన్ గ్యాస్ లీక్! - పరిశోధన సంస్థల నివేదిక

