ETV Bharat / state

ఇరుసుమండలో అదుపులోకి రాని బ్లోఅవుట్‌-మరో ఐదు రోజులపాటు మంటలు కొనసాగుతాయని అధికారులు వెల్లడి

గూడవల్లి కాల్వ నీటితో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్న సిబ్బంది-మంటల తీవ్రత తగ్గినప్పటికి కొనసాగుతున్న నియంత్రణ చర్యలు-విదేశీ నిపుణులతో మంటలను నియంత్రించేందుకు అధికారుల యత్నం

Blowout Continues ONGC Well in Konaseema District
Blowout Continues ONGC Well in Konaseema District (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 7, 2026 at 7:23 AM IST

2 Min Read
Choose ETV Bharat

Blowout Continues ONGC Well in Konaseema District : డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్‌ ఇంకా అదుపులోకి రాలేదు. మరో ఐదు రోజులపాటు మంటలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్‌జీసీ బావిలో ఈ నెల 5వ తేదీ (సోమవారం మధ్యాహ్నం) నుంచి 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఆరంభమైన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా 10 నుంచి 15 మీటర్లకు పైగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్‌ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండడంతో ఓఎన్‌జీసీ చర్యలు ముమ్మరం చేసింది.

మరో నాలుగైదు రోజులు చర్యలు : క్షేత్రస్థాయిలో విపత్తుల నిర్వహణ బృందం (సీఎంటీ), ఆర్‌సీఎంటీ సభ్యులు చర్యలు మొదలు పెట్టారు. నరసాపురం ఓఎన్‌జీసీ యూనిట్‌ నుంచి అత్యాధునిక పరికరాలు, వాహనాలను తీసుకువచ్చారు. అగ్నికీలలు వ్యాప్తి చెందకుండా, వేడి గాలులు విస్తరించకుండా ప్రత్యేక మోటార్లు పెట్టి నీటిని వెదజల్లుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా నీటిని పంపింగ్‌ చేయడంతో బావి సమీప ప్రాంతంలో వేడి తగ్గింది. మరో నాలుగైదు రోజులు ఈ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

తాత్కాలిక రోడ్డు - బావి దగ్గరకు మడ్​ ఫిల్లింగ్​ యంత్రం : బావి నుంచి వెలువడే మంటలను ఒకేసారి నియంత్రిస్తే సాంకేతికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున దశల వారీగా వాటిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు. బుధవారం మధ్యాహ్నానికి ఇది పూర్తయ్యే అవకాశముందని ఓ ఇంజినీరింగ్‌ అధికారి తెలిపారు. తాత్కాలిక రహదారి మీదుగా భారీ వాహనాలతో మడ్‌ ఫిల్లింగ్‌ యంత్రాన్ని బావి దగ్గరకు చేర్చి లీకేజీని అరికట్టనున్నారు.

ప్రత్యేక బృందాలు : విదేశీ నిపుణులతో మంటలను నియంత్రించేందుకు అధికారుల యత్నిస్తున్నారు. ఇప్పటికే బ్లోఅవుట్‌ వంటి విపత్కర పరిస్థితులను సమర్థంగా అదుపులోకి తీసుకువచ్చే ఓఎన్‌జీసీ ప్రత్యేక బృందాలు దిల్లీ, ముంబయి నుంచి వచ్చాయి. టెక్నాలజీ, ఫీల్డ్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సక్సేనా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రాంతీయ విపత్తుల నిర్వహణ బృందం (ఆర్‌సీఎంటీ) హెడ్‌ శ్రీహరి పరిస్థితులను అంచనా వేసి సిబ్బందికి సూచనలిస్తున్నారు. ఆయనకు పలు ప్రాంతాల్లో బ్లోఅవుట్‌లను విజయవంతంగా నియంత్రించిన అనుభవం ఉందని ఓఎన్‌జీసీ అధికారి తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక బావి లోపల లీకులు గుర్తించి రసాయనాలతో కూడిన బురదను వేగంగా లోపలికి పంపి నియంత్రిస్తారు. ఇందుకు నాలుగైదు రోజులకు పైగా సమయం పట్టనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమలాపురం ఎంపీ హరీష్‌ మాథుర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ లక్కవరంలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

అగ్నికీలల తీవ్రతను తగ్గింది : బ్లోఅవుట్‌ క్రమంగా నియంత్రణలోకి వస్తున్నట్లు ఓఎన్‌జీసీ అధికారులు దిల్లీ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థ సీనియర్‌ మేనేజ్‌మెంట్, డైరెక్టర్‌ విక్రమ్‌ సక్సేనా నేతృత్వంలోని బృందం బావిపై పూర్తి ఆపరేషన్‌ బాధ్యతను చేపట్టినట్లు పేర్కొన్నారు. అత్యధిక సామర్థ్యమున్న పంపుల ఏర్పాటుకు తాత్కాలికంగా కాలువ తవ్వకం పనులు పూర్తయ్యాయని వివరించారు. అగ్నికీలల తీవ్రతను తగ్గించడంలో నిపుణుల బృందం విజయం సాధించిందని తెలిపారు.

'ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి' - ఇరుసుమండ బ్లోఅవుట్​పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఓఎన్జీసి బ్లో అవుట్‌లో తగ్గుముఖం పట్టిన మంటలు - వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియను కొనసాగిస్తున్న ఫైర్‌ ఫైటింగ్‌ స్టాప్‌